బ్రిజ్ భూషణ్‌కు కోర్టులో ఊరట.. స్పందించిన మహిళా రెజర్లు..
ABN , Publish Date - Aug 03 , 2026 | 02:36 PM
లైంగిక వేధింపుల కేసులో భారత రెజ్లింగ్ సమాఖ్య మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌కు ఢిల్లీ కోర్టులో ఊరట లభించింది. ఈ కేసులో ఆయన్ను నిర్దోషిగా ప్రకటిస్తూ.. ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు తీర్పు వెలువరించింది.
స్పోర్ట్స్ డెస్క్: భారత మహిళా రెజ్లర్లు దాఖలు చేసిన లైంగిక వేధింపుల కేసులో భారత రెజ్లింగ్ సమాఖ్య (WFI) మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌కు ఢిల్లీ కోర్టులో భారీ ఊరట లభించింది. ఈ కేసులో ఆయన్ను నిర్దోషిగా ప్రకటిస్తూ.. ఢిల్లీలోని రౌస్ అవెన్యూ అదనపు చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ అశ్విని పన్వార్ తీర్పు వెలువరించారు. ఈ కేసులో సహ నిందితుడిగా ఉన్న డబ్ల్యూఎఫ్ఐ మాజీ అసిస్టెంట్ సెక్రటరీ వినోద్ తోమర్‌ను కూడా కోర్టు నిర్దోషిగా ప్రకటించింది.
ఢిల్లీ కోర్టు ఇచ్చిన తీర్పుపై ప్రముఖ రెజ్లర్లు వినేశ్ ఫోగాట్, బజరంగ్ పూనియాలు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. తీర్పు వెలువడిన వెంటనే వారు సంయుక్త ప్రకటన విడుదల చేస్తూ... అధికార పక్షానికి చెందిన బలమైన నాయకుడిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయించడానికే తాము ఎంతో ధైర్యంతో జంతర్ మంతర్ వద్ద వీధిపోరాటాలు చేయాల్సి వచ్చిందని గుర్తుచేశారు. తమ అధికార, ఆర్థిక బలంతో బ్రిజ్ భూషణ్ అనేక మంది బాధితులను బెదిరించి ఫిర్యాదులను వెనక్కి తీసుకునేలా చేశారని తెలిపారు. అయినప్పటికీ కొంతమంది మహిళా రెజ్లర్లు లొంగకుండా కోర్టులో సుదీర్ఘ పోరాటం చేశారని వినేశ్ ఫోగాట్ పేర్కొన్నారు.
ఈ కేసు వేసిన తొలి రోజు నుంచే వ్యవస్థలు, ప్రభుత్వం మొత్తం బ్రిజ్ భూషణ్‌ను కాపాడేందుకే పనిచేసేలా సంకేతాలు కనిపించాయని మహిళా రెజర్లు ఆరోపించారు. ఈ తీర్పుతో తమ పోరాటం ముగిసిపోలేదని స్పష్టం చేశారు. న్యాయవాదులతో చర్చించి త్వరలోనే ఈ తీర్పును హైకోర్టులో సవాల్ చేయనున్నట్లు వినేశ్ పేర్కొన్నారు. బాధితులైన మహిళా రెజ్లర్లు అధైర్యపడకుండా న్యాయం జరిగే వరకు తమ పోరాటాన్ని కొనసాగిస్తారని స్పష్టం చేశారు.
నాకు సంతోషంగా ఉంది: బ్రిజ్ భూషణ్
ఢిల్లీ కోర్టు ఇచ్చిన తీర్పుపై లైంగిక ఆరోపణలు ఎదుర్కొన్న బ్రిజ్ భూషణ్ స్పందించారు. కోర్టు ఇచ్చిన తీర్పు తనకు సంతోషాన్ని కలిగించిందన్నారు. 'నాపై ఆరోపణలు వచ్చిన రోజే ఒక మాట చెప్పాను. ఆ ఆరోపణలు రుజువైతే నేను స్వచ్ఛందంగా ఉరి వేసుకుంటానని చెప్పాను. ఈ రోజు కోర్టు నన్ను నిర్దోషిగా విడుదల చేసింది. అంతేకాక 'గౌరవప్రదంగా నిర్దోషిగా విడుదల' అనే పదాన్ని ఉపయోగించింది' అని బ్రిజ్ భూషణ్ సంతోషం వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి:
శ్రీలంకతో టెస్టు సిరీస్: బుమ్రా ఔట్.. ఆకిబ్ నబీకి ఛాన్స్
బుమ్రా కాదు.. అర్ష్‌దీప్ సింగ్‌కు నచ్చిన టాప్-5 బౌలర్లు వీరే!