Share News

కామన్వెల్త్ గేమ్స్: ఏకంగా 8 స్వర్ణాలు.. భారత్ పతక వేటలో మహిళలదే ఆధిపత్యం

ABN , Publish Date - Aug 03 , 2026 | 01:46 PM

కామన్వెల్త్ గేమ్స్ 2026 సంగ్రామం ముగిసింది. గ్లాస్గో వేదికపై భారత మహిళా అథ్లెట్లు అద్భుతం చేశారు. భారత్ సాధించిన 13 స్వర్ణాల్లో 8 గోల్డ్ మెడల్స్ మహిళా అథ్లెట్ల ఖాతాలోనే చేరడం విశేషం.

కామన్వెల్త్ గేమ్స్: ఏకంగా 8 స్వర్ణాలు.. భారత్ పతక వేటలో మహిళలదే ఆధిపత్యం
India Women Athletes

ఇంటర్నెట్ డెస్క్: కామన్వెల్త్ గేమ్స్ 2026 సంగ్రామం ముగిసింది. గ్లాస్గో వేదికపై భారత మహిళా అథ్లెట్లు అద్భుతం చేశారు. 13 స్వర్ణాలు, 17 రజతాలు, 9 కాంస్యాలతో మొత్తంగా 39 పతకాలు సాధించిన భారత్.. పట్టికలో నాలుగో స్థానంలో నిలిచింది. అయితే భారత్ సాధించిన 13 స్వర్ణాల్లో 8 గోల్డ్ మెడల్స్ మహిళా అథ్లెట్ల ఖాతాలోనే చేరడం విశేషం. అంతర్జాతీయ వేదికపై జాతీయ గీతం మార్మోగిన ప్రతిసారీ పతక పోడియాలపై మహిళలే ఎక్కువగా కనిపించారు. వెయిట్ లిఫ్టింగ్, బాక్సింగ్, జుడో, పారా అథ్లెటిక్స్.. ఇలా విభిన్న విభాగాల్లో భారత మహిళలు సత్తా చాటి దేశానికి గర్వకారణంగా నిలిచారు.


వెయిట్ లిఫ్టింగ్‌లో మీరాబాయ్ చాను, జుడోలో అస్మితా డే, పారా అథ్లెటిక్స్‌లో షర్మిలా, బాక్సింగ్‌లో ప్రీతి పవార్, జైస్మిన్ లాంబోరియా సాక్షి చౌదరి, ప్రియా ఘంఘాస్, అరుంధతీ చౌదరి.. ఇలా గ్లాస్గో భారత మహిళలు బంగారు పతకాలతో తళుక్కుమన్నారు. అయితే వీరి ప్రయాణమేమీ అంత సులభంగా సాగలేదు. ఎన్నో ఒడిదొడుకులు, విమర్శలు అన్నింటినీ ఎదుర్కొని అంతర్జాతీయ స్థాయి వరకు ఎదిగారు. ప్రీతి పవార్ రెజ్లింగ్ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చి బాక్సింగ్‌లో రాణించింది. హర్జిందర్ కౌర్ పాఠశాలకు సైకిల్‌పై వెళ్లి, సాయంత్రం పొలంలో తండ్రికి సాయం చేస్తూనే అంతర్జాతీయ స్థాయికి చేరుకుంది. షర్మిలా దన్‌ఖడ్.. వైకల్యాన్ని, గృహహింసను అధిగమించి 40 ఏళ్ల వయసులో పసిడి నెగ్గింది. సీమా కళిరామన్ బిడ్డకు జన్మనిచ్చిన 11 నెలలకే ప్రాక్టీస్‌కు దిగింది. భర్త అండతో కాంస్య పతకం సాధించింది. జ్ఞానేశ్వరి యాదవ్.. పీరియడ్స్ తొలిరోజే నొప్పిని బరిస్తూ 199 కిలోల బరువు ఎత్తి రజతం సాధించింది. ఇలా ఒక్కొక్కరిదీ ఒక్కో కథ. కష్టాల సాగరాన్ని దాటి కలల ప్రపంచాన్ని కళ్ల ముందుకు రప్పించుకున్న మహిళల విజయగాధ! ఈ అథ్లెట్ల ప్రయాణం ఎంతో మందికి స్ఫూర్తి.


భారత క్రీడలకు కొత్త ముఖచిత్రం

ఒకప్పుడు అంతర్జాతీయ వేదికపై ఒక మహిళ స్వర్ణం గెలవడం అంటే చాలా అరుదైన విషయం. కానీ ఇప్పుడు రోజులు మారాయి. అన్ని విభాగాల్లో తామేమీ తక్కువ కాదని నిరూపిస్తోన్న మహిళలు.. క్రీడా రంగంలోనూ రాణిస్తున్నారు. అంతర్జాతీయ వేదికపై పతకాల పంట పండిస్తున్నారు. కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత్ 13 పసిడి పతకాలు గెలిస్తే.. అందులో 8 స్వర్ణాలు మహిళలే సాధించడం విశేషం. గ్లాస్గోలో సాధించిన ఈ విజయాలు కేవలం పతకాల లెక్క మాత్రమే కాదు.. భారత మహిళా క్రీడల ఎదుగుదలకు, వారి పోరాట స్ఫూర్తికి ప్రతీకగా నిలిచాయి.


కామన్వెల్త్ క్రీడల్లో భారత మహిళల పతకాలు..

  • స్వర్ణం(8): మీరాబాయి చాను (వెయిట్ లిఫ్టింగ్), షర్మిలా దన్‌ఖడ్(పారా అథ్లెటిక్స్), అస్మితా డే(జుడో), ప్రీతి పవార్, జైస్మిన్ లాంబోరియా, సాక్షి చౌదరి, ప్రియా ఘంఘాస్, అరుంధతి చౌదరి (బాక్సింగ్)

  • రజతం (5): హర్జిందర్ కౌర్ (వెయిట్‌ లిఫ్టింగ్), లవ్లీనా (బాక్సింగ్), రూపాల్ (400 మీటర్లు), నికితా ధ్యాని (5,000 మీటర్లు), జ్ఞానేశ్వరి యాదవ్(వెయిట్ లిఫ్టింగ్)

  • కాంస్యం (4): సీమ కళిరామన్ (డిస్కస్ త్రో), నికితా (1,500 మీటర్లు), సోనియా బైష్యా (వెయిట్ ‌లిఫ్టింగ్), లిషా దాస్ (పారా ట్రాక్ సైక్లింగ్)


ఇవి కూడా చదవండి:

శ్రీలంకతో టెస్టు సిరీస్: బుమ్రా ఔట్.. ఆకిబ్ నబీకి ఛాన్స్

బుమ్రా కాదు.. అర్ష్‌దీప్ సింగ్‌కు నచ్చిన టాప్-5 బౌలర్లు వీరే!

Updated Date - Aug 03 , 2026 | 02:00 PM