Share News

మూడేళ్లుగా స్వర్ణానికి దూరం.. నీరజ్ చోప్రా కెరీర్ దారెటు?

ABN , Publish Date - Aug 03 , 2026 | 12:25 PM

నీరజ్ చోప్రా.. ఒకప్పుడు అంతర్జాతీయ వేదికపై బరిలోకి దిగాడంటే స్వర్ణం ఖాయమైనట్లే అని అభిమానులు అనుకునేవారు. కానీ ఇప్పుడు ఈ జావెలిన్ త్రో స్టార్ గోల్డెన్ మెడల్‌ను ముద్దాడి మూడేళ్లు గడిచిపోయింది. దీంతో అతడి కెరీర్ స్తబ్దతకు చేరిందా? లేక ప్రపంచ స్థాయి పోటీ మరింత పెరిగిందా? అనే చర్చ అథ్లెటిక్స్ వర్గాల్లో సాగుతోంది.

మూడేళ్లుగా స్వర్ణానికి దూరం.. నీరజ్ చోప్రా కెరీర్ దారెటు?
Neeraj Chopra

ఇంటర్నెట్ డెస్క్: నీరజ్ చోప్రా.. ఒకప్పుడు అంతర్జాతీయ వేదికపై బరిలోకి దిగాడంటే స్వర్ణం ఖాయమైనట్లే అని అభిమానులు అనుకునేవారు. కానీ ఇప్పుడు ఈ జావెలిన్ త్రో స్టార్ గోల్డెన్ మెడల్‌ను ముద్దాడి మూడేళ్లు గడిచిపోయింది. దీంతో అతడి కెరీర్ స్తబ్దతకు చేరిందా? లేక ప్రపంచ స్థాయి పోటీ మరింత పెరిగిందా? అనే చర్చ అథ్లెటిక్స్ వర్గాల్లో సాగుతోంది. ఓ వైపు గాయాలు వేధించడంతో నీరజ్ చోప్రా.. కాస్త ఫామ్ కోల్పోయాడంటూ అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.


2016 దక్షిణాసియా క్రీడల్లో స్వర్ణంతో అంతర్జాతీయ ప్రయాణం ప్రారంభించిన నీరజ్.. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. 2017 ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్, 2018 కామన్వెల్త్ గేమ్స్, ఆసియా క్రీడలు, టోక్యో ఒలింపిక్స్‌లలో వరుసగా బంగారు పతకాలు సాధించి భారత 'గోల్డెన్ బాయ్'గా గుర్తింపు పొందాడు. అయితే 2023 ఆసియా క్రీడల్లో స్వర్ణం గెలిచిన తర్వాత అతడు ఒక్క అంతర్జాతీయ టోర్నీలోనూ బంగారు పతకం అందుకోలేకపోయాడు.


ఈసారి కూడా అంతే..!

పారిస్ ఒలింపిక్స్‌లో 89.45 మీటర్ల త్రోతో రజత పతకం సాధించిన నీరజ్.. పాకిస్థాన్‌కు చెందిన అర్షద్ నదీమ్ ఒలింపిక్ రికార్డు (92.97 మీటర్లు)తో స్వర్ణం గెలవడంతో రెండో స్థానంతో సరిపెట్టుకున్నాడు. అనంతరం మరో అంతర్జాతీయ పోటీలో నాలుగో స్థానంలో నిలవగా, తాజాగా గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్‌లో సీజన్ అత్యుత్తమ ప్రదర్శన (85.83 మీటర్లు) చేసినప్పటికీ పసిడి దక్కలేదు. శ్రీలంక అథ్లెట్ రమేశ్ పతిరాగే (89.75 మీటర్లు) స్వర్ణ పతకం గెలవడంతో నీరజ్.. రజత పతకానికే పరిమితమయ్యాడు.


అయితే నీరజ్ ఫామ్ తగ్గిందని చెప్పేందుకు గణాంకాలు కూడా అంగీకరించడం లేదు. 2025 దోహా డైమండ్ లీగ్‌లో తొలిసారి 90 మీటర్ల మార్క్‌ను దాటి 90.23 మీటర్ల త్రోతో జాతీయ రికార్డు నెలకొల్పాడు. అతడి టెక్నిక్, సామర్థ్యంలో పెద్దగా మార్పు లేకపోయినా ప్రపంచ జావెలిన్ స్థాయి అమాంతం పెరిగింది. పాకిస్థాన్, శ్రీలంక, గ్రెనెడా వంటి దేశాల అథ్లెట్లు కూడా ఇప్పుడు 90 మీటర్లకు చేరువలో నిలుస్తున్నారు. నీరజ్ ఇప్పటికీ ప్రపంచంలో అత్యంత నిలకడైన జావెలిన్ త్రోయర్లలో ఒకడు. అయితే గత విజయాలే ఇప్పుడు అతనిపై భారీ అంచనాలు పెంచాయి. గోల్డ్ కాకపోతే అది వైఫల్యంగా భావించే పరిస్థితి ఏర్పడింది. గాయాల నుంచి పూర్తిగా కోలుకుని, మరింత స్థిరమైన ప్రదర్శన చేస్తే రజతాలను మళ్లీ స్వర్ణాలుగా మార్చే సత్తా నీరజ్‌కు ఉందని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.


ఇవి కూడా చదవండి:

శ్రీలంకతో టెస్టు సిరీస్: బుమ్రా ఔట్.. ఆకిబ్ నబీకి ఛాన్స్

బుమ్రా కాదు.. అర్ష్‌దీప్ సింగ్‌కు నచ్చిన టాప్-5 బౌలర్లు వీరే!

Updated Date - Aug 03 , 2026 | 12:27 PM