గంగూలీ భద్రతను తగ్గించిన బెంగాల్ ప్రభుత్వం.. ఎందుకంటే..
ABN , Publish Date - Jun 03 , 2026 | 03:04 PM
టీమిండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ భద్రతను పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం తగ్గించింది. దాదాకు గతంలో ఉన్న జెడ్ కేటగిరీ భద్రతను వై కేటగిరికి కుదిస్తూ బెంగాల్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
స్పోర్ట్స్ డెస్క్: టీమిండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ (Sourav Ganguly) భద్రతను పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం తగ్గించింది. ఆయనకు ఇంతకుముందు ఇస్తున్న 'జెడ్' కేటగిరీ భద్రతను ఉపసంహరించుకుని, 'వై' (Y) కేటగిరీకి కుదించినట్లు రాష్ట్ర ప్రభుత్వ భద్రతా విభాగం తాజాగా ప్రకటించింది. గంగూలీ భద్రత గురించి పునఃసమీక్ష చేసిన అనంతరం రాష్ట్ర భద్రతా విభాగ అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.
2023లో మమతా బెనర్జీ సర్కార్ గంగూలీకి ఉన్న 'వై' కేటగిరీ భద్రత నుంచి 'జెడ్' కేటగిరీకి పెంచింది. జెడ్ కేటగిరీ ఉన్నంత కాలం గంగూలీకి 8 నుంచి10 మంది పోలీసు సిబ్బంది రక్షణ ఉండేది. ఇప్పుడు వై కేటగిరీకి తగ్గించడంతో ఆయనకు భద్రత కల్పించే పోలీసుల సంఖ్య కూడా తగ్గనుంది. ఏటా మాదిరిగానే ఈ ఏడాది కూడా వివిధ ప్రముఖలకు సంబంధించిన భద్రతపై అధికారులు సమీక్షించారు. అలానే కొత్త భద్రతా నిబంధనల ప్రకారం.. గంగూలీకి ఉన్న ముప్పు 'జెడ్' కేటగిరీ భద్రత కిందకు రాదు.
గంగూలికి అవసరమైన పోలీసు భద్రత కొనసాగుతున్నప్పటికీ, 'Z' కేటగిరీ కింద కేటాయించిన విస్తృతమైన వీఐపీ కార్డన్, హోంగార్డులు, ప్రత్యేక వ్యక్తిగత భద్రతా అధికారుల (పీఎస్‌ఓల) సంఖ్యను తగ్గించారు. గంగూలీ భద్రత తగ్గింపు అనేది కేవలం ఒక ప్రత్యేక నిర్ణయం కాదని, రాష్ట్రవ్యాప్తంగా వీఐపీ భద్రతా నిబంధనల పునర్వ్యవస్థీకరణలో భాగమేనని రాష్ట్ర అధికారులు స్పష్టం చేశారు. ఈ నిర్ణయానికి ఎలాంటి రాజకీయాలు ఆపాదించవద్దని సూచించారు.
ఇవి కూడా చదవండి:
ప్రపంచ నం.1 కార్ల్‌సన్‌కు మరో షాక్.. చరిత్ర సృష్టించిన ప్రజ్ఞానంద
అఫ్గానిస్థాన్‌తో వన్డే సిరీస్.. రోహిత్ శర్మ దూరం కానున్నాడా?