Share News

'హర్మన్‌ప్రీత్ దారి వేరు.. స్మృతి ప్రయాణం వేరు'.. మాజీ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!

ABN , Publish Date - Oct 09 , 2026 | 05:33 PM

భారత మహిళల క్రికెట్ జట్టుకు అన్ని ఫార్మాట్లలో కొత్త సారథిగా బాధ్యతలు చేపట్టిన స్మృతి మంధానపై భారత మాజీ కెప్టెన్ అంజుమ్ చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మాజీ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌ శైలిని స్మృతి అనుకరించాల్సిన అవసరం లేదని, కెప్టెన్‌గా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును ఏర్పరచుకోవాలని సూచించారు.

 'హర్మన్‌ప్రీత్ దారి వేరు.. స్మృతి ప్రయాణం వేరు'.. మాజీ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
Smriti Mandhana

స్పోర్ట్స్ డెస్క్: భారత మహిళల క్రికెట్ జట్టు నూతన సారథిగా స్టార్ ప్లేయర్ స్మృతి మంధానను ఎంపికైన సంగతి తెలిసిందే. మాజీ కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ అకస్మాత్తుగా తన నాయకత్వ బాధ్యతలకు గుడ్ బై చెప్పడంతో కొత్త కెప్టెన్ ఎంపిక అనివార్యమైంది. ఇక అన్ని ఫార్మాట్లలో కొత్త సారథిగా బాధ్యతలు చేపట్టిన స్మృతి మంధానపై భారత మాజీ కెప్టెన్ అంజుమ్ చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మాజీ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌ స్థానాన్ని లేదా ఆమె శైలిని స్మృతి అనుకరించాల్సిన అవసరం లేదని తెలిపారు. కెప్టెన్‌గా మంధాన తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును, ప్రయాణాన్ని ఏర్పరచుకోవాలని సూచించారు.


రాయ్‌పూర్‌ వేదికగా అక్టోబరు 16 నుంచి జింబాబ్వేతో ప్రారంభం కానున్న 3 టీ20ల సిరీస్‌తో స్మృతి పూర్తిస్థాయి కెప్టెన్‌గా తొలి బాధ్యతలను నిర్వర్తించనుంది. ఈ సందర్భంగా అంజుమ్ చోప్రా మీడియాతో మాట్లాడుతూ... 'స్మృతికి కెప్టెన్సీ కొత్తేమీ కాదు. 2019లోనే ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌ల్లోనే ఆమె భారత్‌ను నడిపించింది. హర్మన్‌ప్రీత్ లేదా అంతకుముందు నాయకులతో పోలిస్తే పూర్తిస్థాయి కెప్టెన్ కాకముందే నూతన వ్యూహాలు అమలు చేసేంత సమయం, అనుభవం స్మృతికి లభించాయి' అని అంజుమ్ పేర్కొన్నారు.


నాయకత్వ మార్పును 'రిలే రేస్'లో బాటన్ మార్పిడితో పోల్చిన అంజుమ్.. స్మృతి ఇప్పటికే రన్నింగ్‌లో ఉంటూ బాటన్‌ను అందుకుందని, అందుకే ఆమెకు ఒక అదనపు ప్రయోజనం (Head start) ఉందన్నారు. దీప్తి శర్మ, జెమిమా రోడ్రిగ్స్, స్మృతి అందరూ ఒకే తరంలో ఎదిగిన ఆటగాళ్లని, ఇప్పుడు జట్టును తర్వాతి స్థాయికి తీసుకెళ్లడమే మంధాన ముందున్న ప్రధాన సవాల్ అని చోప్రా చెప్పారు. టీమిండియా ప్రస్తుతం ఎదుర్కొంటున్న సవాళ్లను గుర్తించి, లోపాలను సరిదిద్దుకుంటూ జట్టుకు మార్గదర్శిగా నిలవాలని అంజుమ్ ఆకాంక్షించారు.


ఇవి కూడా చదవండి:

పోలీస్ మహిళా సిబ్బందిని రాహుల్ గాంధీ అసభ్యంగా తాకారు: తుషార్ మెహతా..

ప‌దేళ్ల త‌ర్వాత జ‌ట్టులోకి.. 33 బంతులు, 0 పరుగులు!

బీసీసీఐ క్రీడా కమిటీ బడ్జెట్‌ భారీగా పెంపు.. ఏకంగా రూ. 127 కోట్లు

Updated Date - Oct 09 , 2026 | 05:36 PM