గతంలో కంటే డేంజరస్‌గా కోహ్లీ ఫామ్: ఏబీ డివిలియర్స్
ABN , Publish Date - Oct 09 , 2026 | 12:10 PM
37 ఏళ్ల వయసులోనూ అద్భుతమైన ఫామ్‌లో కొనసాగుతున్న కోహ్లీ.. తన కెరీర్‌లోనే అత్యుత్తమ దశలో ఉన్నాడా? అంటే దక్షిణాఫ్రికా దిగ్గజం, కోహ్లీ మాజీ ఆర్సీబీ సహచరుడు ఏబీ డివిలియర్స్ మాత్రం అవుననే అంటున్నాడు.
ఇంటర్నెట్ డెస్క్: టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ వయసు పెరుగుతున్నా.. అతడి ఆటలో మాత్రం జోరు తగ్గడం లేదు. కెరీర్ చివరి దశలోనూ వన్డేల్లో పరుగుల వరద పారిస్తూ ప్రత్యర్థి బౌలర్లకు సవాల్ విసురుతున్నాడు. 37 ఏళ్ల వయసులోనూ అద్భుతమైన ఫామ్‌లో కొనసాగుతున్న కోహ్లీ.. తన కెరీర్‌లోనే అత్యుత్తమ దశలో ఉన్నాడా? అంటే దక్షిణాఫ్రికా దిగ్గజం, కోహ్లీ మాజీ ఆర్సీబీ సహచరుడు ఏబీ డివిలియర్స్ మాత్రం అవుననే అంటున్నాడు. 2016-17లో కనిపించిన కోహ్లీ కంటే ఇప్పుడు మరింత మెరుగైన ఆటగాడిగా మారాడని అభిప్రాయపడ్డాడు.
‘2016తో పోలిస్తే ఇప్పుడు కోహ్లీ మరింత మెరుగైన ఆటగాడని నేను భావిస్తున్నా. మైదానంలో అతడు ఎంత ప్రశాంతంగా ఉంటున్నాడో గమనించవచ్చు. పూర్తి స్వేచ్ఛగా ఆడుతున్నట్లు కనిపిస్తున్నాడు. గతంలో కంటే మరింత డేంజరేస్‌గా ప్రత్యర్థులకు సవాల్ విసురుతున్నాడు. ఇటీవల ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో అతడి ఆటతీరులో మార్పు కనిపించింది. మొదట కొత్త తరహాలో ఆడేందుకు ప్రయత్నించినా.. ఆ తర్వాత దూకుడుగా ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. తన సహజమైన ఆటను ఆస్వాదించడం మొదలుపెట్టాడు’ అని ఏబీడీ అభిప్రాయపడ్డాడు.
ఇంకెంతకాలం ఆడతాడో తెలియదు!
37 ఏళ్ల వయసులోనూ కోహ్లీ ఇంతటి స్థాయిలో రాణించడానికి అతడి మానసిక స్థితి కూడా కారణమని డివిలియర్స్ పేర్కొన్నాడు. ‘ప్రస్తుతం తన ప్రతిభను బయటపెట్టడం, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు తన ఆటను ఆస్వాదించేలా చేయడమే తన చేతుల్లో ఉందని కోహ్లీ గుర్తించాడు. అది మరో రెండేళ్లు, మూడేళ్లు లేదా ఐదేళ్లు కావొచ్చు. అతడు ఇంకెంతకాలం ఆడతాడో నాకు తెలియదు. కానీ కోహ్లీ ఆటలో ఈ కోణాన్ని చూడటం నాకు ఎంతో ఆనందంగా ఉంది. యువ ఆటగాళ్లకు కోహ్లీతో కలిసి డ్రెస్సింగ్ రూమ్‌ను పంచుకోవడం గొప్ప అనుభవం. ప్రస్తుతం కోహ్లీ ఉన్న మానసిక స్థితి, ఆట పట్ల అతడికున్న స్పష్టత నుంచి యువ క్రికెటర్లు గతంలో కంటే ఎక్కువగా నేర్చుకునే అవకాశం ఉంది’ అని డివిలియర్స్ వెల్లడించాడు.
ఇవి కూడా చదవండి:
శాండ్ పేపర్ వివాదంపై లక్షలసార్లు సమాధానం చెప్పా: ప్యాట్ కమిన్స్
గంగూలీ బయోపిక్ ‘దాదా’ పోస్టర్‌పై విమర్శలు.. హీరో రియాక్షన్ ఇదే!