శాండ్ పేపర్ వివాదం.. ఎనిమిదేళ్ల తర్వాత వెలుగులోకి అసలు విషయం!
ABN , Publish Date - Oct 09 , 2026 | 09:41 AM
క్రికెట్ చరిత్రలో ఆస్ట్రేలియాను తీవ్రంగా ఇబ్బందిపెట్టిన వివాదాల్లో 2018 శాండ్ పేపర్ ఉదంతం ఒకటి. అప్పుడు కేప్‌టౌన్ టెస్టు ప్రసార బాధ్యతలు పర్యవేక్షించిన అల్విన్ నైకర్ తాజాగా ఈ ఘటనకు సంబంధించిన ఆసక్తికర విషయాలను వెల్లడించాడు.
ఇంటర్నెట్ డెస్క్: క్రికెట్ చరిత్రలో ఆస్ట్రేలియాను తీవ్రంగా ఇబ్బందిపెట్టిన వివాదాల్లో 2018 శాండ్ పేపర్ ఉదంతం ఒకటి. బంతి ఆకృతిని అక్రమంగా మార్చేందుకు ప్రయత్నించి ఆ జట్టు కెప్టెన్ స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్, కామెరాన్ బాన్‌క్రాఫ్ట్ నిషేధానికి గురయ్యారు. ఈ ఘటన ఆస్ట్రేలియా క్రికెట్ ప్రతిష్ఠను దెబ్బతీయడమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అయితే, ఈ వివాదం బయటపడటానికి కారణం పక్కా ప్రణాళిక కాదట.. అనుకోకుండా కెమెరా బాన్‌క్రాఫ్ట్‌పై పడటమేనట! 2018లో కేప్‌టౌన్ టెస్టు ప్రసార బాధ్యతలు పర్యవేక్షించిన అల్విన్ నైకర్ తాజాగా ఈ ఘటనకు సంబంధించిన ఆసక్తికర విషయాలను వెల్లడించాడు.
‘ఆస్ట్రేలియా ఆటగాళ్లు పట్టుబడటం పూర్తిగా అనుకోకుండా జరిగింది. సాధారణంగా క్రీడా ప్రసారాల్లో కాస్త విరామం దొరికినా ఆటగాళ్ల ముఖాలు, వారి కదలికలను దగ్గరగా చూపిస్తారు. అదే సమయంలో కెమెరామెన్ బాన్‌క్రాఫ్ట్‌పై దృష్టి పెట్టడంతో వివాదానికి సంబంధించిన దృశ్యాలు రికార్డయ్యాయి. బాన్‌క్రాఫ్ట్ మొదట అతడు తన ప్యాంటుకు బంతిని రుద్దుతూ మెరిపించే ప్రయత్నం చేశాడు. ఆ తర్వాత బంతిని అర చేతిపై రుద్దడం ప్రారంభించాడు. బంతిని బౌలర్‌కి ఇచ్చాక తన చేతిని జేబులో పెట్టాడు. దీంతో కెమెరామెన్ అతడి జేబుపై జూమ్ చేశాడు. మా స్లో మోషన్ ఆపరేటర్ ఆ దృశ్యాలను వెనక్కి, ముందుకు పరిశీలించి.. జూమ్ చేయడంతో పసుపు రంగులో ఉన్న వస్తువు కనిపించింది. అదే శాండ్ పేపర్. ప్రొజెక్టర్‌పై ఆ దృశ్యాలను చూసి బాన్‌క్రాఫ్ట్ శాండ్‌పేపర్‌ను తీసి తన లోదుస్తుల్లో పెట్టుకున్నాడు. కెమెరామెన్ ఆ దృశ్యాలను కూడా రికార్డు చేశాడు. ఆ సమయంలో అవి ప్రత్యక్ష ప్రసారంలో లేవు. మేము రీప్లే ద్వారా ఆ దృశ్యాలను చూపించాం’ అని ఆయన వివరించాడు.
స్మిత్ కన్నీళ్లు.. ముగ్గురిపై నిషేధం!
ఈ ఘటన బయటపడటంతో క్రికెట్ ప్రపంచం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. శాండ్ పేపర్ వినియోగించినట్లు నిర్ధారణ కావడంతో అప్పటి కెప్టెన్ స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్, కామెరాన్ బాన్‌క్రాఫ్ట్‌పై క్రికెట్ ఆస్ట్రేలియా కఠిన చర్యలు తీసుకుంది. వివాదం తర్వాత ప్రత్యక్ష టీవీ ఇంటర్వ్యూలో స్మిత్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఈ ఘటనకు బాధ్యత వహిస్తున్నట్లు అంగీకరించాడు. అయినప్పటికీ అతడిపై విధించిన శిక్ష తప్పలేదు. స్మిత్‌కు అంతర్జాతీయ, దేశవాళీ క్రికెట్ నుంచి 12 నెలల నిషేధం విధించడంతో పాటు కెప్టెన్సీ నుంచి తొలగించారు. డేవిడ్ వార్నర్‌పైనా 12 నెలల నిషేధం విధించారు. అంతేకాకుండా ఆస్ట్రేలియా క్రికెట్‌లో ఎలాంటి నాయకత్వ బాధ్యతలు చేపట్టకుండా అతడిపై ఆంక్షలు విధించారు. బాన్‌క్రాఫ్ట్‌కు తొమ్మిది నెలల పాటు అంతర్జాతీయ, దేశవాళీ క్రికెట్ నుంచి నిషేధం పడింది. ఈ వివాదం జరిగిన ఎనిమిదేళ్ల తర్వాత ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్లు మరోసారి దక్షిణాఫ్రికా గడ్డపై టెస్టు సిరీస్‌లో తలపడుతున్నాయి. డర్బన్ వేదికగా శుక్రవారం నుంచి మూడు టెస్టుల సిరీస్ ప్రారంభం కానుంది.
ఇవి కూడా చదవండి:
కోహ్లీ కెప్టెన్సీకే ఎసరు పెట్టారా? ఆర్సీబీ మాజీ స్టార్ సంచలన వ్యాఖ్యలు
నెట్స్‌లో వైభవ్ వీర విధ్వంసం.. రెండో టీ20లో చోటు దక్కుతుందా?