శాండ్ పేపర్ వివాదంపై లక్షలసార్లు సమాధానం చెప్పా: ప్యాట్ కమిన్స్
ABN , Publish Date - Oct 09 , 2026 | 11:23 AM
ఆస్ట్రేలియా-సౌతాఫ్రికా మధ్య మూడు టెస్టుల సిరీస్ జరగనున్న నేపథ్యంలో.. 2018 శాండ్ పేపర్ వివాదం వార్తల్లో నిలిచింది. తాజాగా ఈ విషయంపై ఆసీస్ ప్రస్తుత కెప్టెన్ ప్యాట్ కమిన్స్ స్పందించాడు.
ఇంటర్నెట్ డెస్క్: ఆస్ట్రేలియా-సౌతాఫ్రికా మధ్య మూడు టెస్టుల సిరీస్ జరగనున్న నేపథ్యంలో.. 2018 శాండ్ పేపర్ వివాదం వార్తల్లో నిలిచింది. ఈ క్రమంలో ఆసీస్ మాజీ ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా.. తన ఆత్మకథ ‘సబ్ర్’లో ఈ ఉదంతానికి సంబంధించిన పలు కొత్త విషయాలు ప్రస్తావించే అవకాశం ఉందంటూ వస్తోన్న వార్తలు ఆసక్తి రేపుతున్నాయి. అయితే ఈ పరిణామాలపై ఆసీస్ ప్రస్తుత కెప్టెన్ ప్యాట్ కమిన్స్ స్పందించాడు. ప్రొటీస్‌తో టెస్టు సిరీస్‌కు ముందు మీడియాతో మాట్లాడాడు.
‘కొన్ని వారాల క్రితం ఉజ్(ఉస్మాన్ ఖవాజా) నాకు ఫోన్ చేసి ఓ పుస్తకం విడుదల చేయనున్నట్లు చెప్పాడు. అందులోని విషయాల గురించి పెద్దగా వివరించలేదు. కేవలం పుస్తకం రాస్తున్నానని ముందుగా సమాచారం ఇచ్చాడు. నేను కూడా ఎప్పటిలాగే.. ఫర్వాలేదు, నీ కథ నువ్వు చెప్పుకో.. అందులో ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పాను’ అని కమిన్స్ వివరించాడు. శాండ్ పేపర్ వివాదం జరిగినప్పుడు కమిన్స్, ఖవాజా కూడా జట్టులోని సభ్యులే. దీంతో ఈ వివాదంపై మరిన్ని వివరాలు తెలుస్తాయా? అంటూ రిపోర్టర్ అడిగా.. కమిన్స్ సమాధానం ఇచ్చాడు.
‘దాని గురించి ఏమి రాశారో నాకు తెలియదు. ఆ విషయాన్ని ఖవాజానే అడిగి తెలుసుకోవాలి. అది జరిగి చాలా కాలమైంది. అప్పట్లోనే అన్ని విచారణలు పూర్తయ్యాయి. ఈ అంశంపై నేను కొన్ని లక్షల సార్లు ప్రశ్నలకు సమాధానాలు చెప్పాను. అప్పుడే దానికి ముగింపు పలికాం. ఒక జట్టుగా మేం ఆ వివాదాన్ని దాటేసి వచ్చాం. గత ఎనిమిది, తొమ్మిదేళ్లలో మా జట్టు ఎలా ఎదిగింది? ఎలా మారింది? అన్న విషయంలో నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఇప్పుడు నా దృష్టంతా జట్టుకు నాయకత్వం వహించడంపైనే ఉంది’ అని కమిన్స్ వివరించాడు.
ఇవి కూడా చదవండి:
కోహ్లీ కెప్టెన్సీకే ఎసరు పెట్టారా? ఆర్సీబీ మాజీ స్టార్ సంచలన వ్యాఖ్యలు
నెట్స్‌లో వైభవ్ వీర విధ్వంసం.. రెండో టీ20లో చోటు దక్కుతుందా?