మహిళా పోలీస్ సిబ్బందిని రాహుల్ గాంధీ అసభ్యంగా తాకారు: తుషార్ మెహతా..
ABN , Publish Date - Oct 09 , 2026 | 05:13 PM
దేశ రాజధానిలో కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ నేతృత్వంలో ఇటీవల జరిగిన నిరసన ప్రదర్శనపై సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ నిరసన సందర్భంగా మహిళా పోలీసు సిబ్బందిని లైంగికంగా వేధించారని, వారిని గాయపరిచారని ఆయన శుక్రవారం సుప్రీంకోర్టుకు తెలిపారు.
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ నేతృత్వంలో ఇటీవల జరిగిన నిరసన ప్రదర్శనపై సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ నిరసన సందర్భంగా మహిళా పోలీసు సిబ్బందిని లైంగికంగా వేధించారని, వారిని గాయపరిచారని ఆయన శుక్రవారం సుప్రీంకోర్టుకు తెలిపారు. ఇందుకు సంబంధించిన వీడియోలను పరిశీలించాలని న్యాయస్థానాన్ని కోరారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదనే కాక్రోచ్ జనతా పార్టీ నిరసనకు అనుమతి ఇవ్వలేదని కోర్టుకు మెహతా తెలిపారు.
ఓట్ల చోరీ అంశంలో కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ అక్టోబర్ 10న కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) భారీ నిరసనలకు పిలుపునిచ్చింది. అయితే, ఈ నిరసన ప్రదర్శనకు ఢిల్లీ పోలీసులు అనుమతి నిరాకరించడంతోపాటు పలు ఆంక్షలు విధించారు. ఈ ఆంక్షలను ఎత్తివేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారణ సందర్భంగా రాహుల్ గాంధీ నిరసన ప్రదర్శనలో చోటుచేసుకున్న ఘటనలను న్యాయస్థానం దృష్టికి తుషార్ మెహతా తీసుకొచ్చారు. కేంద్ర ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన ఆయన.. నిరసన సమయంలో మహిళా పోలీసు సిబ్బందిని అనుచితంగా తాకారని ఆరోపించారు.
దానికి సంబంధించిన వీడియోలను కోర్టు చూడాలని మెహతా కోరారు. ఈ కారణంగానే సీజేపీ నిరసనలపై కేంద్రం ఆంక్షలు విధించిందని వివరించారు. మరోవైపు, బుధవారం జరిగిన నిరసన ప్రదర్శనపై బీజేపీ కూడా ఇలాంటి ఆరోపణలే చేసింది. అశోకా రోడ్డులో జరిగిన ఘర్షణ సందర్భంగా ఓ మహిళా పోలీసు అధికారిని రాహుల్ గాంధీ తోసివేయడానికి ప్రయత్నించారని, ఆమెను అనుచితంగా తాకారని ఆ పార్టీ ఆరోపించింది. ఈ మేరకు బీజేపీ అధికార ప్రతినిధి ప్రదీప్ భండారీ సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ఓ వీడియోను కూడా పంచుకున్నారు.
ఇదిలా ఉండగా, సీనియర్ న్యాయవాదులు కపిల్ సిబల్, అభిషేక్ మను సింఘ్వీ, ప్రశాంత్ భూషణ్, వృందా గ్రోవర్ సీజేపీ నిరసనలపై విధించిన ఆంక్షల తీవ్రతను ప్రశ్నించారు. మెట్రో స్టేషన్ల మూసివేత, రైళ్ల రద్దు, ఢిల్లీ సరిహద్దుల్లో తనిఖీలు, కొత్త బుకింగ్‌లను స్వీకరించవద్దంటూ హోటళ్లకు ఆదేశాలు వంటి అంశాలను ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. అయితే, శాంతిభద్రతలను కాపాడటానికి ఈ చర్యలు అవసరమని తుషార్ మెహతా సమర్థించారు.
ఈ సందర్భంగా భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. నిరసన తెలిపే హక్కును పౌరులు స్వేచ్ఛగా సంచరించే, నిత్యావసర సౌకర్యాలను పొందే హక్కులతో సమతుల్యం చేయాలని పేర్కొంది. సాక్ష్యాధారాలను పరిశీలించిన అనంతరం పోలీసుల చర్యలు అసమంజసంగా కనిపిస్తున్నాయని సీజేఐ ధర్మాసనం వ్యాఖ్యానించింది.
ఈ వార్తలు కూడా చదవండి
ఎల్‌నినో ప్రభావం.. 2027 నాటికి భారత్‌లో వంటనూనెల కొరత..
విద్యార్థి గుండుపై తబలా వాయించిన ఉపాధ్యాయుడు.. చివరికి ఏమైందంటే..