బీసీసీఐ క్రీడా కమిటీ బడ్జెట్ భారీగా పెంపు.. ఏకంగా రూ. 127 కోట్లు
ABN , Publish Date - Oct 09 , 2026 | 02:48 PM
భారత క్రికెటర్లను వరుసగా వేధిస్తున్న గాయాల సమస్యపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)దృష్టి సారించింది. గతేడాది రూ.92 కోట్లుగా ఉన్న బడ్జెట్‌ను రూ.35 కోట్లు పెంచి.. ఈ ఆర్థిక సంవత్సరానికి రూ.127 కోట్లు కేటాయించింది.
స్పోర్ట్స్ డెస్క్: భారత క్రికెటర్లను వరుసగా వేధిస్తున్న గాయాల సమస్యపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)దృష్టి సారించింది. గత ఏడాదికాలంలో టీమిండియా చెందిన సుమారు 32 మంది టాప్ ప్లేయర్లు బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (CoE)లో పునరావాసం (రీహాబ్), చికిత్స పొందినట్లు నివేదికలు తెలిపాయి. ముఖ్యంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ముగిసిన తర్వాత సీఓఈ కేంద్రానికి వచ్చే ఆటగాళ్ల సంఖ్య గణనీయంగా పెరిగింది.
గాయాల తీవ్రతను తగ్గించి, ఆటగాళ్లను త్వరగా పూర్తి ఫిట్‌నెస్‌లోకి తీసుకువచ్చేందుకు గానూ బీసీసీఐ తమ ఇంజ్యూరీ మేనేజ్‌మెంట్ బడ్జెట్‌ను గణనీయంగా పెంచింది. గతేడాది రూ.92 కోట్లుగా ఉన్న బడ్జెట్‌ను రూ.35 కోట్లు పెంచి.. ఈ ఆర్థిక సంవత్సరానికి రూ.127 కోట్లు కేటాయించింది. ముఖ్యంగా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ శుభ్‌మన్ గిల్ వంటి వారు ఆటగాళ్ల వరుస గాయాలపై ఆందోళన వ్యక్తం చేయడంతో బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. దిగ్గజ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ సైతం ఇటీవల ఫిట్‌నెస్, రీహాబ్ ప్రక్రియ కోసం సిఓఈను సందర్శించారు.
జస్ప్రీత్ బుమ్రా , హార్దిక్ పాండ్యా , వాషింగ్టన్ సుందర్ , నితీశ్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణా, ప్రసిద్ధ్ కృష్ణ సీఓఈకి క్రమం తప్పకుండా వెళ్తుంటారు. కానీ వారు పునరావాసం కోసం ఎన్నిసార్లు చేరాల్సి వచ్చిందో ఆ నివేదికలో ప్రస్తావించలేదు. ఆటగాళ్ల పనిభారాన్ని (వర్క్‌లోడ్) క్రమబద్ధీకరిస్తూ, కీలక టోర్నీలకు వారు పూర్తి ఫిట్‌నెస్‌తో అందుబాటులో ఉండేలా ఆధునిక వైద్య సదుపాయాలు అందిస్తున్నట్లు బోర్డు వర్గాలు వెల్లడించాయి.
ఇవి కూడా చదవండి:
శాండ్ పేపర్ వివాదంపై లక్షలసార్లు సమాధానం చెప్పా: ప్యాట్ కమిన్స్
గంగూలీ బయోపిక్ ‘దాదా’ పోస్టర్‌పై విమర్శలు.. హీరో రియాక్షన్ ఇదే!