Share News

ఆర్సీబీ విజయం.. బెంగళూరులో అభిమానుల వీరంగం

ABN , Publish Date - Jun 01 , 2026 | 11:53 AM

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వరుసగా రెండో ఏడాది ట్రోఫీని కైవసం చేసుకుంది. ఆదివారం గుజరాత్‌పై ఆర్సీబీ ఘన విజయాన్ని సాధించడంతో దేశవ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొంది. ఆర్సీబీ హోమ్ గ్రౌండ్ అయిన బెంగళూరు నగరం అర్ధరాత్రి వేళ బాణసంచా వెలుగులు, టపాసుల శబ్దాలతో దద్దరిల్లిపోయింది.

ఆర్సీబీ విజయం.. బెంగళూరులో అభిమానుల వీరంగం
RCB IPL 2026 celebrations

స్పోర్ట్స్ డెస్క్: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఐపీఎల్ 2026 ట్రోఫీని వరుసగా రెండోసారి ముద్దాడింది. ఆదివారం జరిగిన ఐపీఎల్ తుది పోరులో గుజరాత్ టైటాన్స్‌పై 5 వికెట్ల తేడాతో ఆర్సీబీ ఘన విజయం సాధించింది. ఛేజింగ్ మాస్టర్ విరాట్ కోహ్లీ 75 పరుగులతో ఆర్సీబీని విజయతీరాలకు చేర్చాడు. ఆర్సీబీ ఘన విజయాన్ని సాధించడంతో దేశవ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొంది. ఆర్సీబీ హోమ్ గ్రౌండ్ అయిన బెంగళూరు నగరం అర్ధరాత్రి వేళ బాణసంచా వెలుగులు, టపాసుల శబ్దాలతో దద్దరిల్లిపోయింది. కానీ, పలుచోట్ల అభిమానులు రచ్చ చేయడంతో పరిస్థితి అదుపు తప్పింది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


గతేడాది ఆర్సీబీ టైటిల్ విజయోత్సవాల సందర్భంగా చిన్నస్వామి స్టేడియం వెలుపల జరిగిన ఘోరమైన తొక్కిసలాటలో 11 మంది మరణించిన సంగతి తెలిసిందే. ఆ విషాద ఘటనను దృష్టిలో ఉంచుకుని, ఆదివారం రాత్రి బెంగళూరు నగరంలో అభిమానులు గుమిగూడిన ప్రధాన ప్రాంతాలలో పోలీసులు గస్తీ నిర్వహించారు. పలు ప్రాంతాల్లో బారికేడ్లను ఏర్పాటు చేశారు. చుట్టూ పోలీసు బారికేడ్లు ఉన్నప్పటికీ విరాట్ కోహ్లీని, ఆర్సీబీ జట్టును కీర్తిస్తూ అభిమానులు వీధుల్లో సంబరాలు చేసుకున్నారు. కొందరు మాత్రం శ్రుతిమించి ప్రవర్తించారు. చొక్కాలు విప్పి.. రోడ్లపై రచ్చ రచ్చ చేశారు.


పోలీసులు ఎంత చెప్పినా వినకపోవడంతో కొందరికి తమదైన శైలిలో పోలీసులు సమాధానం ఇచ్చారు. మరికొందరైతే రోడ్లపై వాహనాలకు ఎదురు నిలబడి డ్యాన్సులు చేశారు. ఇలా తోటివారిని ఇబ్బంది పెడతూ సంబరాలు చేసుకున్న వారిపై బెంగళూరు పోలీసులు కాస్త కఠినంగా వ్యవహరించారు. కొందరు యువకులు అత్యుత్సాహంతో బైకులతో రోడ్లపై ప్రమాదకర ఫీట్స్ చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు యువకులను చెదరగొట్టారు. మరోవైపు రెండు తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో కూడా కొందరు ఆర్సీబీ అభిమానులు వీరంగం సృష్టించారు.


ఇవి కూడా చదవండి:

150-180 పరుగులు చేసి ఉంటే ఫలితం మరోలా ఉండేది: గిల్

ఈ ట్రోఫీ అభిమానులకు అంకితం: రజత్ పాటీదార్

Updated Date - Jun 01 , 2026 | 12:36 PM