ఈ ట్రోఫీ అభిమానులకు అంకితం: రజత్ పాటీదార్
ABN , Publish Date - Jun 01 , 2026 | 09:53 AM
ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటీదార్ మ్యాచ్ అనంతరం మాట్లాడాడు. ఈ క్రమంలో విరాట్ కోహ్లీపై ప్రశంసల వర్షం కురిపించాడు. దాంతోపాటు ట్రోఫీని ఈసారి కూడా అభిమానులకే అంకితం చేస్తున్నట్లు వెల్లడించాడు.
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2026 ఫైనల్ పోరులో గుజరాత్ టైటాన్స్‌పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. వరుసగా రెండోసారి ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడింది. ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ విరాట్ కోహ్లీ 75 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఈ నేపథ్యంలో ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటీదార్ మ్యాచ్ అనంతరం మాట్లాడాడు. విరాట్ కోహ్లీపై ప్రశంసల వర్షం కురిపించాడు. దాంతోపాటు ట్రోఫీని ఈసారి కూడా అభిమానులకే అంకితం చేస్తున్నట్లు వెల్లడించాడు.
‘కోహ్లీ గురించి చెప్పడానికి నాకు మాటలు రావడం లేదు. కెరీర్‌లో అతడు సాధించలేనిది అంటూ ఏమీ లేదు. విరాట్ ఎంత గొప్ప ఆటగాడో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. మైదానంలోనే కాదు.. బయట కూడా అతడి నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంది. జట్టులోని ప్రతి ఆటగాడితో మాట్లాడుతుంటాడు. క్రికెట్‌కు సంబంధించిన విషయాలే కాకుండా జీవితానికి ఉపయోగపడే అంశాలపై కూడా సూచనలు ఇస్తుంటాడు. నేను ఎప్పుడూ విరాట్‌ను గమనిస్తూ ఉంటాను. నెట్స్‌లో అతడు చూపించే ఉత్సాహం, మ్యాచ్‌లో కనిపించే ఎనర్జీ ఒకేలా ఉంటాయి. అదే కోహ్లీ ప్రత్యేకత’ అని పాటీదార్ వెల్లడించాడు. ఈ సీజన్‌లో విరాట్ 675 పరుగులు చేశాడు. అందులో ఒక సెంచరీ, ఐదు హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
ఈ సలానూ కప్ నమ్‌దు!
‘వరుసగా రెండో కప్పును సొంతం చేసుకోవడం ఆనందంగా ఉంది. ఫైనల్ కోసం ఇక్కడికి వచ్చాక గతేడాది జ్ఞాపకాలు గుర్తుకొచ్చాయి. అప్పుడు ఎలా ఆడామో.. ఇప్పుడు కూడా అదే దూకుడును ప్రదర్శించాం. జట్టులోని ప్రతి బౌలర్‌ను నేను మెన్షన్ చేయాలి. కెప్టెన్‌గా ఇక్కడ నా ప్రయాణం అద్భుతం. గతేడాది మాపై తీవ్ర ఒత్తిడి ఉండేది. కానీ ఈసారి అంచనాలు ఉన్నప్పటికీ ఒత్తిడి లేకపోవడంతో స్వేచ్ఛగా ఆడాం. తొలి మ్యాచ్ నుంచే దూకుడుగా ఆడేందుకు ప్రయత్నించాం. మేం ఎక్కడికి వెళ్లినా అభిమానులు పెద్ద ఎత్తున వచ్చి ప్రోత్సహించారు. వారి కోసం ఏం చేసినా తక్కువే. ఈ సలానూ కప్ నమ్‌దు.. ఈ సారి కూడా ట్రోఫీని అభిమానులకే అంకితం చేస్తున్నా’ అని పాటీదార్ వెల్లడించాడు.
ఇవి కూడా చదవండి:
బస్సులో మంటలు.. గుజరాత్ టీమ్‌కు తప్పిన ప్రమాదం
ఆర్సీబీ ధురంధర్.. హ్యాపీ బర్త్‌డే కెప్టెన్ రజత్ పాటీదార్!