Share News

ఐపీఎల్ చరిత్రలోనే వైభవ్ సూర్యవంశీ అరుదైన ఘనత

ABN , Publish Date - Jun 01 , 2026 | 08:55 AM

వైభవ్ సూర్యవంశీ.. రాజస్థాన్ రాయల్స్ తరఫున అత్యద్భుత ప్రదర్శనలతో చెలరేగాడు. వైభవ్ విధ్వంసానికి అవార్డులు క్యూ కట్టాయి. ఐపీఎల్ చరిత్రలోనే అతడు అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు.

ఐపీఎల్ చరిత్రలోనే వైభవ్ సూర్యవంశీ అరుదైన ఘనత
Vaibhav Sooryavanshi

ఇంటర్నెట్ డెస్క్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 కప్పు ఆర్సీబీదే అయినా.. 15 ఏళ్ల కుర్రాడి గురించే ఇప్పుడు అందరూ ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. వైభవ్ సూర్యవంశీ.. రాజస్థాన్ రాయల్స్ తరఫున అత్యద్భుత ప్రదర్శనలతో చెలరేగాడు. వైభవ్ విధ్వంసానికి అవార్డులు క్యూ కట్టాయి. ఐపీఎల్ చరిత్రలోనే అతడు అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ సీజన్‌లో 776 పరుగులు చేసిన వైభవ్.. ఆరెంజ్ క్యాప్ అందుకున్నాడు. కేవలం 15 ఏళ్ల వయసులోనే ఆరెంజ్ క్యాప్ అందుకున్న అతిపిన్న వయస్కుడిగా చరిత్ర సృష్టించాడు.


ఈ సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ తరఫున 16 ఇన్నింగ్స్‌ల్లో 776 పరుగులు చేసిన వైభవ్.. అత్యధిక పరుగుల వీరుడిగా ఆరెంజ్ క్యాప్‌ను కైవసం చేసుకున్నాడు. గిల్ 732 పరుగులతో రెండో స్థానంలో, సాయి సుదర్శన్ 722 పరుగులతో మూడో స్థానంలో నిలిచారు. ఇప్పటివరకు ఆరెంజ్ క్యాప్ గెలిచిన అతి పిన్న వయస్కుడిగా సాయి సుదర్శన్ (23 సంవత్సరాలు 231 రోజులు) పేరిట ఉన్న రికార్డును వైభవ్ బద్దలు కొట్టాడు. అంతేకాదు, ఈ సీజన్‌లో 237.31 స్ట్రైక్‌ రేట్‌తో చెలరేగిన అతడు ఏకంగా 72 సిక్సర్లు బాదాడు. దీంతో ఒక ఐపీఎల్ సీజన్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన క్రిస్ గేల్(59) రికార్డును కూడా అధిగమించాడు.


అవార్డుల జాతర

రాజస్థాన్ రాయల్స్ ట్రోఫీ గెలవకపోయినా.. ఆ జట్టు ప్లేయర్ వైభవ్ సూర్యవంశీ మాత్రం పలు రికార్డులు కొల్లగొట్టాడు. ఒక సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన అన్‌క్యాప్‌డ్ ప్లేయర్‌గా వైభవ్‌ చరిత్ర సృష్టించాడు. అతడు మొత్తం 16 ఇన్నింగ్స్‌ల్లో 237.30 స్ట్రైక్‌రేట్‌తో 776 పరుగులు చేశాడు. ఒక సీజన్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన ప్లేయర్‌గా వైభవ్ నిలిచాడు. మొత్తం 72 సిక్సర్లు, 63 ఫోర్లు బాదాడు. విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగిన అతడు.. మూడు శతకాలు (93, 97, 96) త్రుటిలో చేజార్చుకున్నాడు. ఐపీఎల్‌లో వేగంగా 1000 పరుగులు (440 బంతుల్లో) సాధించిన ఆటగాడిగా ఘనత సాధించాడు. మొత్తం సీజన్‌లో పవర్‌ప్లేలో అత్యధిక పరుగులు (521) చేసిన మొదటి ఆటగాడిగానూ రికార్డు సృష్టించాడు. డేవిడ్‌ వార్నర్‌ (467 పరుగులు, 2016లో)ను వైభవ్‌ అధిగమించాడు. వైభవ్‌.. ఆరెంజ్‌ క్యాప్‌తో పాటు సూపర్‌ స్ట్రైకర్‌ (237.30), ఎమర్జింగ్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ద సీజన్, మోస్ట్‌ వాల్యుబుల్‌ ప్లేయర్‌ (436.5 పాయింట్లు), అత్యధిక సిక్సర్ల అవార్డులు దక్కించుకున్నాడు.


ఇవి కూడా చదవండి:

బస్సులో మంటలు.. గుజరాత్ టీమ్‌కు తప్పిన ప్రమాదం

ఆర్సీబీ ధురంధర్.. హ్యాపీ బర్త్‌డే కెప్టెన్ రజత్ పాటీదార్!

Updated Date - Jun 01 , 2026 | 09:04 AM