150-180 పరుగులు చేసి ఉంటే ఫలితం మరోలా ఉండేది: గిల్
ABN , Publish Date - Jun 01 , 2026 | 10:43 AM
ఐపీఎల్ 2026 ఫైనల్ మ్యాచ్‌లో ఆర్సీబీపై గుజరాత్ టైటాన్స్ పరాజయం పాలైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గుజరాత్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఓటమిపై స్పందించాడు.
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2026 ఫైనల్ మ్యాచ్‌లో ఆర్సీబీపై గుజరాత్ టైటాన్స్ పరాజయం పాలైన విషయం తెలిసిందే. ఐదేళ్లలో రెండోసారి ఫైనల్ చేరిన జీటీ.. ఆఖరి మెట్టుపై బోల్తా పడింది. రెండోసారి కప్పును ముద్దాడాలనే కలను సాకారం చేసుకోలేకపోయింది. బ్యాటర్లు, బౌలర్లు విఫలమైన వేళ.. జీటీ 155 పరుగులకే పరిమితమైంది. ఛేదనలో ఆర్సీబీ 18 ఓవర్లలో ఆటను ముగించింది. ఈ నేపథ్యంలో గుజరాత్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఓటమిపై స్పందించాడు.
‘మేము 150-180 పరుగులు చేసి ఉంటే ఫలితం మరోలా ఉండేది. పిచ్ చాలా నెమ్మదిగా ఉందని నేను భావించడం లేదు. తొలి నాలుగు ఓవర్లలో పేసర్లకు కొంత సహకారం లభించింది. ఆ సమయంలోనే మేం కీలక వికెట్లు కోల్పోయాం. మధ్య ఓవర్లలో కూడా వేగం పెంచలేకపోయాం. దీంతో ఆశించిన స్కోర్ చేయలేకపోయాం. ఇది ఫైనల్ మ్యాచ్. తక్కువ స్కోర్ చేసినా.. వికెట్లు పడగొట్టి ప్రత్యర్థిని ఒత్తిడిలోకి నెడితే గెలుపు అవకాశాలు ఉంటాయని భావించాం. కానీ అనుకున్న ప్రణాళికలు పక్కాగా అమలు చేయడంలో విఫలమయ్యాం. అదే మా ఓటమికి కారణమైంది’ అని గిల్ వెల్లడించాడు.
ఒకవేళ కప్ గెలిచినా..
‘ఈ సీజన్‌లో మేం అద్భుత ప్రదర్శనలు కనబరిచాం. ఎప్పుడూ ఒకరితో ఒకరం మాట్లాడుకుంటూ.. మా ఆటలో లోపాలను సరిదిద్దుకునే ప్రయత్నం చేశాం. ప్రతి అంశంలో మెరుగుదల కోసం కష్టపడ్డాం. ఈసారి ట్రోఫీని అందుకోలేకపోయాం. కానీ బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్‌లో మేం మెరుగుపరుచుకోవాల్సిన విషయాలు ఉన్నాయి. ఒకవేళ కప్ గెలిచినా కూడా సరిచేసుకోవాల్సిన అంశాల గురించి మేము చర్చించుకునేవాళ్లం’ అని గిల్ తెలిపాడు. ఫైనల్ పోరులో తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్.. 8 వికెట్లు కోల్పోయి 155 పరుగులు చేసింది. ఛేదనలో ఆర్సీబీ 18 ఓవర్లకే ఆటను ముగించింది. వరుసగా రెండోసారి ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడింది.
ఇవి కూడా చదవండి:
బస్సులో మంటలు.. గుజరాత్ టీమ్‌కు తప్పిన ప్రమాదం
ఆర్సీబీ ధురంధర్.. హ్యాపీ బర్త్‌డే కెప్టెన్ రజత్ పాటీదార్!