అహ్మదాబాద్‌లో గుజరాత్ టైటాన్స్ ఓటమిపై మాజీ క్రికెటర్ అశ్విన్ స్పందనిదే..
ABN , Publish Date - Apr 05 , 2026 | 12:03 PM
అహ్మదాబాద్ వేదికగా శనివారం జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ పరాజయం కావడంపై భారత మాజీ క్రికెటర్ స్పందించాడు. మిడిలార్డర్ వైఫల్యం వల్లే ఆ జట్టు ఓటమిని చవిచూసిందన్నారు.
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2026లో భాగంగా శనివారం జరిగిన ఉత్కంఠ పోరులో గుజరాత్ టైటాన్స్‌పై 6 పరుగుల తేడాతో రాజస్థాన్ రాయల్స్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. అహ్మదాబాద్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో గుజరాత్ ఆటగాళ్ల ప్రదర్శన గురించి టీమ్ఇండియా మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ స్పందించాడు. జీటీ జట్టు పరాజయంపై అతడు ఆవేదన వ్యక్తం చేశాడు. ఓపెనర్ సాయి సుదర్శన్ అద్భుతమైన ఆరంభాన్నిచ్చినప్పటికీ.. మిడిలార్డర్ బ్యాటర్ల వైఫల్యమే ఆ టీమ్ ఓటమికి కారణమైందన్నాడు.
'ఈ మ్యాచ్‌లో జీటీ ఎలా ఓడిపోయిందో నాకర్థం కావడం లేదు. వాళ్లు గెలుస్తూ వచ్చారు. ఆ తర్వాత ఇంకాస్త పుంజుకున్నారు.. అయినప్పటికీ ఓటమిపాలయ్యారు. చివరి ఓవర్‌లో కేవలం 11 పరుగులు కాపాడుకోవాల్సి ఉండగా.. తొలి బంతిని వైడ్ వేసిన తర్వాత 5 యార్కర్లు వేయడం అంత ఈజీ కాదు. రియాన్ పరాగ్ చివరి ఓవర్‌ను నంద్రే బర్గర్‌కు ఇవ్వలేదు. చివరి ఓవర్ అతడికే ఇస్తాడని అంతా అనుకున్నాం' అని అశ్విన్ తన యూట్యూబ్ ఛానల్‌లో చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా.. ఈ పోరులో 4 వికెట్లతో రాణించి 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్'గా నిలిచిన రవి బిష్ణోయ్ ప్రదర్శనపైనా అశ్విన్ మాట్లాడాడు. అతడు కీలకమైన బ్రేక్‌త్రూలను అందించాడని కొనియాడాడు.
'ఇప్పుడు బిష్ణోయ్‌కు గుర్తింపునివ్వాల్సిన సమయం వచ్చింది. గతేడాది ఎల్‌ఎస్‌జీ తరఫున అతడు ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నాడు. ఆ తర్వాత లఖ్‌నవూ ఫ్రాంచైజీ అతణ్ని ట్రేడ్ కూడా చేయలేదు. నేరుగా వేలంలోకి రావడంతో అతను సుమారు రూ.10 కోట్ల నుంచి రూ.12 కోట్ల ధర పలుకుతాడని అనుకున్నా. కానీ అలా జరగలేదు. అతడు ఇప్పుడు పర్పుల్ క్యాప్ సొంతం చేసుకున్నాడు. అతడి తలపై ఆ క్యాప్ చాలా అందంగా ఉంది' అని ఈ మాజీ స్పిన్నర్ వ్యాఖ్యానించారు.
ఇవీ చదవండి:
కోల్‌కతానూ కొట్టగలం.. పాక్ విదేశాంగ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు..
శుభ్‌మన్ గిల్‌కు గాయం.. జట్టుతో చేరడానికి ఎంత సమయం పడుతుంది..