Share News

టీ20ల్లో పాకిస్థాన్ కెప్టెన్‌ ప్రపంచ రికార్డు

ABN , Publish Date - May 16 , 2026 | 01:40 PM

పాకిస్థాన్‌ మహిళా క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ ఫాతిమా సనా టీ20 క్రికెట్‌లో ప్రపంచ రికార్డు నెలకొల్పింది. శుక్రవారం జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో 15 బంతుల్లో హాఫ్‌ సెంచరీ పూర్తి చేసింది.

టీ20ల్లో పాకిస్థాన్ కెప్టెన్‌ ప్రపంచ రికార్డు
Fatima Sana world record

స్పోర్ట్స్ డెస్క్: పాకిస్థాన్‌ మహిళా క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ ఫాతిమా సనా టీ20 క్రికెట్‌లో ప్రపంచ రికార్డు నెలకొల్పింది. శుక్రవారం జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో 15 బంతుల్లో హాఫ్‌ సెంచరీ పూర్తి చేసింది. తద్వారా అంతర్జాతీయ మహిళల టీ20 క్రికెట్‌లో అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీ నమోదు చేసిన ప్లేయర్‌గా సనా రికార్డు సృష్టించింది.


గతంలో ఈ రికార్డు సోఫీ డివైన్‌(న్యూజిలాండ్‌), ఫోబ్‌ లిచ్‌ఫీల్డ్‌( ఆస్ట్రేలియా), రిచా ఘోష్‌(భారత్‌) పేరిట సంయుక్తంగా ఉండేది. ఈ ముగ్గురు 18 బంతుల్లో హాఫ్‌ సెంచరీలు పూర్తి చేశారు. తాజాగా ఫాతిమా సనా వీరి రికార్డును బద్దలు కొట్టి సింగిల్‌ ప్లేయర్‌గా ప్రపంచ రికార్డు నమోదు చేసింది. మ్యాచ్‌ విషయానికొస్తే.. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా జింబాబ్వేతో కరాచీ వేదికగా జరిగిన మూడో టీ20లో పాకిస్థాన్ 133 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో 3-0తో సిరీస్‌ను పాక్ క్లీన్‌ స్వీప్‌ చేసింది.


తొలుత బ్యాటింగ్‌ చేసిన పాక్‌ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 223 పరుగులు చేసింది. ఫాతిమా సనా 19 బంతుల్లో 62 పరుగులు చేసి పాక్‌ భారీ స్కోర్‌ చేయడంలో కీలక పాత్ర పోషించింది. సైరా జబీన్‌ (50*), అయేషా జాఫర్‌ (45) కూడా రాణించారు. మిగతా బ్యాటర్లలో మునీబా అలీ 22, నతాలియా పర్వేజ్‌ 1, ఇరామ్‌ జావెద్‌ 29 పరుగులు చేశారు. 224 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో జింబాబ్వే 17.1 ఓవర్లలో 90 పరుగులకే కుప్పకూలింది. ఫలితంగా భారీ తేడాతో పరాజయంపాలైంది. సదియా ఇక్బాల్‌ 3, నష్రా సంధు 2, ఫాతిమా సనా, రమీన్‌ షమీమ్‌, తుబా హస్సన్‌ తలో వికెట్‌ తీశారు


మహిళల టీ20ల్లో అత్యంత వేగవంతమైన అర్ధ సెంచరీలు

  • ఫాతిమా సనా (పాకిస్థాన్) - 15 బంతులు vs జింబాబ్వే - 2026

  • సోఫీ డివైన్ (న్యూజిలాండ్) - 18 బంతులు vs భారత్‌- 2015

  • ఫీబీ లిచ్‌ఫీల్డ్ (ఆస్ట్రేలియా) - 18 బంతులు vs వెస్టిండీస్ - 2023

  • రిచా ఘోష్ (భారత్) - 18 బంతులు vs వెస్టిండీస్ - 2024

  • నిదర్ దార్ (పాకిస్థాన్) - 20 బంతులు vs దక్షిణాఫ్రికా - 2019


ఇవి కూడా చదవండి:

లఖ్‌నవూ చేతిలో ఓటమి తర్వాత సహచరులకు రుతురాజ్ బిగ్ మెసేజ్

కెప్టెన్‌గా సంజు టీమిండియాను ఉత్తమంగా నడిపించగలడు: రవి శాస్త్రి

Updated Date - May 16 , 2026 | 01:46 PM