Share News

కెప్టెన్‌గా సంజు టీమిండియాను ఉత్తమంగా నడిపించగలడు: రవి శాస్త్రి

ABN , Publish Date - May 15 , 2026 | 04:03 PM

టీమిండియా స్టార్ బ్యాటర్, వికెట్ కీపర్ సంజు శాంసన్ ప్రస్తుతం అద్భుత ప్రదర్శనలతో అదరగొడుతున్నాడు. టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీని భారత జట్టు గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ నేపథ్యంలో సంజు శాంసన్ భవిష్యత్తుపై టీమిండియా దిగ్గజం రవి శాస్త్రి కీలక వ్యాఖ్యలు చేశాడు.

కెప్టెన్‌గా సంజు టీమిండియాను ఉత్తమంగా నడిపించగలడు: రవి శాస్త్రి
Sanju Samson

ఇంటర్నెట్ డెస్క్: టీమిండియా స్టార్ బ్యాటర్, వికెట్ కీపర్ సంజు శాంసన్ ప్రస్తుతం అద్భుత ప్రదర్శనలతో అదరగొడుతున్నాడు. టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీని భారత జట్టు గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. ఆ మెగా టోర్నీలో అత్యధిక పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా నిలిచాడు. ప్రస్తుతం ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ప్రాతినిధ్యం వహిస్తోన్న సంజు.. ఇప్పటికే రెండు సెంచరీలు చేసి అసాధారణ ప్రతిభ కనబరుస్తున్నాడు. ఈ నేపథ్యంలో సంజు శాంసన్ భవిష్యత్తుపై టీమిండియా దిగ్గజం రవి శాస్త్రి కీలక వ్యాఖ్యలు చేశాడు. టీ20 జట్టుకు సంజు కీలక పోటీదారుగా ఉన్నాడని అభిప్రాయపడ్డాడు.


‘భారత్ రెండేళ్ల తర్వాత టీ20 ప్రపంచ కప్ ఆడనుంది. అందుకోసం తప్పకుండా కొత్త సారథిని చూడాల్సిన అవసరం ఉంటుంది. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్ పరంగా జట్టును అద్భుతంగానే నడిపిస్తున్నాడు. కానీ బ్యాటర్‌గా ఆశించిన స్థాయిలో రాణించడం లేదు. అయితే వచ్చే ప్రపంచ కప్‌కు సూర్య కెప్టెన్‌గా కొనసాగడంపై సందిగ్ధత నెలకొంది. ఈ జాబితాలో సంజు శాంసన్ ముందుంటాడు. ఇప్పటికే అతడికి రాజస్థాన్ రాయల్స్‌ను నడిపించిన అనుభవం ఉంది. ఓపెనర్‌గా విధ్వంసకర బ్యాటింగ్ చేసే సంజు.. కెప్టెన్‌గానూ జట్టును ఉత్తమంగా నడిపించగలడు. వచ్చే రెండేళ్లలో అతడి నుంచి అత్యుత్తమ ఆటతీరును చూడబోతున్నాం’ అని రవిశాస్త్రి తెలిపాడు.


ఒంటిచేత్తో మ్యాచ్‌లు గెలిపించాడు..

‘సంజు శాంసన్ బ్యాటింగ్‌లో నిలకడ ఉండదని చాలామంది భావిస్తారు. గతంలో అతడికి వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోలేదని చెబుతుంటారు. కానీ, ఆటతీరు పరంగా అతడి విషయంలో ఎలాంటి సందేహాలు అక్కర్లేదు. కొన్నిసార్లు అనుకున్నంత స్థాయిలో ఆడలేకపోయినా.. అతడి నైపుణ్యం అద్భుతం. టీ20 ప్రపంచ కప్ 2026లో ఒంటిచేత్తో మ్యాచ్‌లు గెలిపించాడు. ఇప్పుడు ఐపీఎల్‌లోనూ అద్భుతంగా రాణిస్తున్నాడు. తన ఆటతో కెప్టెన్సీ పోటీలో ఉన్నానని చెప్పకనే చెప్పాడు’ అని రవి శాస్త్రి వెల్లడించాడు.


ఇవి కూడా చదవండి:

2027 ప్రపంచ కప్.. అలాంటి పరిస్థితే వస్తే నేను ఆడను: విరాట్ కోహ్లీ

వరుస మ్యాచ్‌లకు హార్దిక్ దూరం.. స్పందించిన ముంబై ఇండియన్స్

Updated Date - May 15 , 2026 | 04:37 PM