Share News

2027 ప్రపంచ కప్.. అలాంటి పరిస్థితే వస్తే నేను ఆడను: విరాట్ కోహ్లీ

ABN , Publish Date - May 15 , 2026 | 03:14 PM

టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ వన్డే ప్రపంచ కప్‌ 2027లో ఆడుతాడా? లేదా? అని చాలాకాలంగా చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో కోహ్లీ సంచలన వ్యాఖ్యలు చేశాడు. తన సామర్థ్యాన్ని పదేపదే నిరూపించుకోవాల్సిన పరిస్థితే వస్తే అలాంటి వాతావరణంలో తాను ఉండబోనని స్పష్టం చేశాడు.

2027 ప్రపంచ కప్.. అలాంటి పరిస్థితే వస్తే నేను ఆడను: విరాట్ కోహ్లీ
Virat Kohli

ఇంటర్నెట్ డెస్క్: టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఇప్పటికే టెస్టు, టీ20 ఫార్మాట్ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. 2027 వన్డే ప్రపంచ కప్ గెలవడమే లక్ష్యంగా శ్రమిస్తున్నట్లు పలుమార్లు వెల్లడించాడు. అయితే విరాట్ వన్డే ప్రపంచ కప్‌లో ఆడుతాడా? లేదా? అని చాలాకాలంగా చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో కోహ్లీ సంచలన వ్యాఖ్యలు చేశాడు. తన సామర్థ్యాన్ని పదేపదే నిరూపించుకోవాల్సిన పరిస్థితే వస్తే అలాంటి వాతావరణంలో తాను ఉండబోనని స్పష్టం చేశాడు. జట్టుకు తన అవసరం ఉందని మేనేజ్‌మెంట్ భావించాలని, తాను కూడా జట్టుకు ఉపయోగపడగలని నమ్మితేనే ఆడతానని తెలిపాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీ చేసిన ఓ ఇంటర్వ్యూలో విరాట్ మాట్లాడాడు.


‘నా అవసరం జట్టుకు ఉందని మేనేజ్‌మెంట్ భావిస్తేనే ఆడతాను. కానీ ప్రతిసారీ నా విలువను నిరూపించుకోవాలని అడిగే పరిస్థితులను నేను కోరుకోవడం లేదు. అలాంటి వాతావరణంలో నేను ఉండలేను. క్రికెట్ కోసం నిజాయతీగా కష్టపడుతూనే ఉంటాను. ఒక వన్డే మ్యాచ్‌లో 40 ఓవర్లు బౌండరీకి పరుగెత్తమంటే కూడా నాకెలాంటి ఇబ్బంది లేదు. ఎందుకంటే ప్రతి మ్యాచ్‌కు ముందు అన్ని విధాలుగా సిద్ధమయ్యాకే మైదానంలోకి దిగుతాను. ప్రతి బంతిని కెరీర్‌లో చివరి బంతిలా భావించి ఆడతాను’ అని విరాట్ వెల్లడించాడు.


క్రికెట్ అంటే పిచ్చి: కోహ్లీ

అంతర్జాతీయ క్రికెటర్లు దేశవాళీల్లోనూ ఆడాలని బీసీసీఐ నిబంధన పెట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విరాట్ కోహ్లీ ఇటీవల విజయ్ హజారే ట్రోఫీలో ఢిల్లీ తరఫున ఆడిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నాడు. ‘నాకు ఎవరికీ ఏం నిరూపించాల్సిన అవసరం లేదు. నేను క్రికెట్‌ను ప్రేమించి ఆడుతున్నాను. దేశవాళీల్లో ఆడటంతో మళ్లీ నాకు బాల్యం గుర్తొచ్చింది. ఒకరోజు బాగా ఆడావని ప్రశంసిస్తారు. ఫామ్ లేమితో ఇబ్బంది పడుతున్నప్పుడు విమర్శించడానికి సిద్ధంగా ఉంటారు. ఇది ప్లేయర్ల స్థిరత్వంపై ప్రభావం పడుతుంది. నేను ఇంకా ఆడుతున్నానంటే.. నాకు క్రికెట్ ఆడాలనే కోరిక ఉంది కాబట్టే. భారత్ కోసం ప్రపంచ కప్ ఆడటం గొప్ప విషయం. కానీ దీనికి రెండు వైపులా విలువ ఉండాలి. జట్టుకు నా అవసరం లేదనుకుంటే మొదటి రోజే చెప్పండి. లేదంటే మౌనంగా నా పని నన్ను చేసుకోనివ్వండి’ అని విరాట్ వివరించాడు.


వన్డేల్లోనూ విరాట్ కోహ్లీ పలు అరుదైన రికార్డులు నెలకొల్పాడు. 311 మ్యాచులు ఆడి 14,797 పరుగులు చేశాడు. ఇందులో 54 సెంచరీలు, 77 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. వన్డేల్లో అత్యధిక సెంచరీలు బాదిన ప్లేయర్‌గా కొనసాగుతున్నాడు.


ఈ వార్తలు కూడా చదవండి

తిలక్ వర్మపై అర్ష్‌దీప్ వివాదాస్పద వ్యాఖ్య.. మండిపడుతున్న ఫ్యాన్స్!

ఐపీఎల్ 2026: ముంబై ఇండియన్స్‌ అరుదైన రికార్డు..

Updated Date - May 15 , 2026 | 03:14 PM