తిలక్ వర్మపై అర్ష్‌దీప్ వివాదాస్పద వ్యాఖ్య.. మండిపడుతున్న ఫ్యాన్స్!
ABN , Publish Date - May 15 , 2026 | 12:08 PM
ఐపీఎల్ 2026లో భాగంగా గురువారం జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో పంజాబ్ కింగ్స్‌పై ముంబై ఇండియన్స్ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌కు ముందు తిలక్ వర్మపై పంజాబ్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ వివాదాస్పద కామెంట్స్ చేశాడు
స్పోర్ట్స్ డెస్క్: ఐపీఎల్ 2026లో భాగంగా గురువారం జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో పంజాబ్ కింగ్స్‌పై ముంబై ఇండియన్స్ విజయం సాధించింది. తెలుగు కుర్రాడు తిలక్ వర్మ(33 బంతుల్లో 75) మెరుపు ఇన్నింగ్స్ తో ముంబై విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇది ఇలా ఉంటే.. తిలక్ వర్మపై పంజాబ్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ వివాదాస్పద కామెంట్స్ చేశాడు. దీంతో అతడిపై తిలక్ వర్మ అభిమానులు మండిపడుతున్నారు.
ధర్మశాల వేదికగా ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్‌కు ముందు ఒక వీడియో వైరల్ అయ్యింది. అందులో అర్ష్‌దీప్ సింగ్, ముంబై బ్యాటర్ తిలక్ వర్మను ఉద్దేశించి 'ఓయ్ అంధేరే' అని పిలిచాడు. ప్రస్తుతం ఈ పదమే వివాదాస్పదమైంది. ఈ పదం జాత్యహంకార ధోరణిలో ఉందంటూ అర్ష్‌దీప్‌పై నెటిజన్లు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. హిందీలో అంధేరే అంటే చీకటి అని అర్థం. ఒక వ్యక్తి శరీర రంగును ఉద్దేశించి ఇలాంటి పదాలు వాడటం సరైంది కాదని, ఇది వర్ణ వివక్ష కిందికే వస్తుందని నెట్టింట చర్చ జరుగుతోంది.
సాధారణంగా అర్ష్‌దీప్ సింగ్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. రీల్స్, వ్లాగ్స్ చేస్తూ సరదాగా కనిపిస్తుంటారు. ఇటీవల విమానంలో కూడా ఓ వ్లాగ్ చేసిన సంగతి తెలిసిందే. అందులో యుజ్వేంద్ర చాహల్ ఈ సిగరేట్ తాగుతున్నట్లు కనిపించడంతో ఆ వీడియో కూడా చర్చనీయాంశమైంది. అయితే చాహల్ ఈ సిగరెట్ తాగలేదని.. కేవలం సరదాగా అలా చేశాడని తేలింది. ఆ సమయంలో అర్ష్‌దీప్‌కు ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ కూడా కీలక సూచనలు చేసింది. వ్లాగ్స్, రీల్స్ విషయంలో అతడిని హెచ్చరించింది. తాజాగా ముంబైతో మ్యాచ్‌కు ముందు ప్రాక్టీస్ సెషన్ సమయంలో తిలక్ వర్మను పిలిచే క్రమంలో చీకటి అనే అర్థం వచ్చేలా వాడిన అంధేరే అనే పదం వివాదానికి దారితీసింది.
దీనిపై భిన్నమైన కామెంట్స్ వస్తున్నాయి. అర్ష్‌దీప్ సింగ్, తిలక్ వర్మ ఇద్దరూ టీమిండియా తరపున కలిసి ఆడారు. వారిద్దరి మధ్య మంచి స్నేహం ఉంది. ఆ చనువుతోనే సరదాగా అలా పిలిచి ఉంటారని కొందరు నెటిజన్లు అంటున్నారు. స్నేహితులైనా సరే.. బహిరంగ ప్రదేశాల్లో రంగును ఉద్దేశించి వ్యాఖ్యలు చేయడం అవమానించటమేనని మరికొందరు నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. గతంలో కూడా క్రికెట్‌లో ఇలాంటి వర్ణ వివక్ష వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపిన సంగతి తెలిసిందే.
ఈ వార్తలు కూడా చదవండి
వీరేంద్ర సెహ్వాగ్‌పై మండిపడుతున్న బుమ్రా ఫ్యాన్స్
ఐపీఎల్ 2026: పంజాబ్ కింగ్స్ చెత్త రికార్డ్!