Share News

టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీకి జరిమానా.. ఎందుకంటే.?

ABN , Publish Date - Mar 04 , 2026 | 01:22 PM

నియమ నిబంధనల తుచ తప్పకుండా పాటించే టీమిండియా మాజీ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోనీ తాజాగా ఓ నిబంధనను ఉల్లంఘించి వార్తల్లోకెక్కాడు. ఈ విషయంలో అతడికి జరిమానా కూడా పడింది.

టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీకి జరిమానా.. ఎందుకంటే.?
MS Dhoni traffic fine

స్పోర్ట్స్ డెస్క్: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ గురించి క్రికెట్ అభిమానులకు ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. తనదైన సారథ్యంలో భారత జట్టుకు పలు ఐసీసీ ట్రోఫీలను అందించాడు. క్రికెట్ కెరీర్‌లోనే కాకుండా వ్యక్తిగత జీవితంలోనూ మిస్టర్ కూల్ వివాదాలకు చాలా దూరంగా ఉంటాడు. అలానే నియమ నిబంధనలను తుచ తప్పకుండా పాటిస్తాడు. అలాంటి ఎంఎస్ ధోనీకి ఓ విషయంలో జరిమానా పడింది. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం.


ఎంఎస్ ధోనీ.. ట్రాఫిక్ నిబంధనను ఉల్లంఘించి వార్తల్లోకెక్కాడు. కొద్దిరోజుల కిందట అతని పేరిట రిజిస్టర్‌ అయిన ఓ వాహనం రాంచీలో ట్రాఫిక్‌ నిబంధనలను ఉల్లంఘించినట్లు రికార్డైంది. ఆ వాహనం వేగపరిమితిని మించి ప్రయాణించినట్లు ఆటోమేటెడ్‌ ట్రాఫిక్‌ మానిటరింగ్‌ సిస్టమ్‌(ATMS) గుర్తించింది. దీంతో మోటార్‌ వెహికిల్స్‌ యాక్ట్‌ సెక్షన్‌ 183 కింద రూ.1000 జరిమానా విధిస్తూ ట్రాఫిక్ పోలీసులు ఈ-చలాన్‌ జారీ చేశారు. ఈ నిబంధన ఉల్లంఘించిన ఘటన ధోనీ నివాస సమీపంలోనే జరిగినట్టు తెలుస్తోంది.


ఇలాంటి ఘటనలు సర్వసాధారణమే అయినా.. ధోనీ పేరు రావడంతో సోషల్‌ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ జరిమానా కంటే ముందే ధోనీ మరో వివాదంలో వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. రాంచీలోని హార్ము రోడ్‌లో ఉన్న ఆయన పాత నివాస స్థలాన్ని వాణిజ్య ప్రయోజనాల కోసం ఉపయోగించారని ఆరోపణలు రావడంతో.. జార్ఖండ్‌ స్టేట్‌ హౌసింగ్‌ బోర్డ్ నోటీసులు జారీ చేసింది. ఆ స్థలం కేవలం నివాస ప్రయోజనాల కోసం మాత్రమే కేటాయించారని అధికారులు పేర్కొన్నారు.


ఈ వివాదల నడుమ ధోనీ ప్రస్తుతం ఐపీఎల్‌ 2026 సన్నాహకాల్లో బిజీగా ఉన్నాడు. చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఫ్రాంచైజీ ఈ సీజన్‌కు కూడా ధోనీని రిటైన్‌ చేసుకుంది. అన్‌క్యాప్డ్‌ ప్లేయర్‌ కోటాలో రూ.4 కోట్లకు అతను ఎంపికయ్యాడు. గత సీజన్‌లో సీఎస్‌కే 14 మ్యాచ్‌ల్లో 10 ఓటములు ఎదుర్కొని చివరి స్థానంలో నిలిచింది. అయితే ధోనీ వ్యక్తిగతంగా 135.17 స్ట్రైక్‌ రేట్‌తో 196 పరుగులతో రాణించాడు. ధోనీ(44)కి వయసు మీదపడినప్పటికీ.. అతడి వ్యూహాత్మక అవగాహన, జట్టుపై నియంత్రణ సీఎస్కేకు కీలకంగా మారనున్నాయి. సంజూ శాంసన్‌ లాంటి కీలక ఆటగాళ్లను జట్టులో చేర్చుకోవడంలోనూ ధోనీయే కీలకపాత్ర పోషించాడని క్రీడా నిపుణులు అంటున్నారు.


ఇవీ చదవండి:

టీ20 డబ్ల్యూసీ: రెండు గంటలు బ్యాటింగ్ చేసిన పాండ్య..

టీ20 డబ్ల్యూసీ: నేడే న్యూజిలాండ్, సౌతాఫ్రికా మ్యాచ్.. పిచ్ రిపోర్ట్ ఇదే!

Updated Date - Mar 04 , 2026 | 03:09 PM