Share News

భారత్‌తో టెస్టు సిరీస్‌.. న్యూజిలాండ్‌కు భారీ ఎదురుదెబ్బ!

ABN , Publish Date - Nov 17 , 2026 | 11:14 AM

భారత్‌తో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు ముందు న్యూజిలాండ్‌ జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. స్టార్ ఆల్‌రౌండర్, పరిమిత ఓవర్ల కెప్టెన్ మిచెల్ శాంట్నర్ కుడి చేతి గాయం కారణంగా ఈ సిరీస్‌కు దూరమయ్యాడు.

భారత్‌తో టెస్టు సిరీస్‌.. న్యూజిలాండ్‌కు భారీ ఎదురుదెబ్బ!
Mitchell Santner

ఇంటర్నెట్ డెస్క్: భారత్‌తో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు ముందు న్యూజిలాండ్‌ జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. స్టార్ ఆల్‌రౌండర్, పరిమిత ఓవర్ల కెప్టెన్ మిచెల్ శాంట్నర్ కుడి చేతి గాయం కారణంగా ఈ సిరీస్‌కు దూరమయ్యాడు. ఇటీవల భారత్‌తో జరిగిన ఐదో వన్డేలో అతడి చేతికి గాయమైనట్లు వైద్య పరీక్షల్లో తేలింది. ఐదో వన్డేలో అర్ష్‌దీప్ బౌలింగ్‌లో (37 ఓవర్‌) శాంట్నర్‌ కుడి చేతి వెనక భాగంలో బంతి బలంగా తాకింది. ఫిజియో వచ్చి చికిత్స అందించిన తర్వాత బ్యాటింగ్ కొనసాగించి 24 పరుగులు చేసి ఔటయ్యాడు.


శాంట్నర్ కోలుకోవడానికి ఎంత సమయం పడుతుందనే దానిపై స్పష్టత లేదని న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు వెల్లడించింది. డిసెంబర్‌లో ఆస్ట్రేలియాతో జరగనున్న నాలుగు టెస్టుల సిరీస్‌లో అతడి భాగస్వామ్యంపై కూడా త్వరలోనే అప్‌డేట్ ఇస్తామని తెలిపింది. మరోవైపు శాంట్నర్ స్థానంలో స్పిన్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్ డీన్ ఫాక్స్‌క్రాఫ్ట్‌కు జట్టులోకి తీసుకున్నారు. భారత్‌తో చివరి రెండు వన్డేల్లో ఆడిన ఫాక్స్‌క్రాఫ్ట్‌కు టెస్టుల్లో పెద్దగా అనుభవం లేదు. ఇప్పటివరకు ఒకే ఒక్క టెస్టు ఆడిన అతడు.. ఈ ఏడాది మేలో ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 98 పరుగులు చేశాడు. నవంబర్ 19 నుంచి జరిగే తొలి టెస్టులో డీన్‌కు తుది జట్టులో చోటు దక్కే అవకాశాలున్నాయి. అక్టోబర్‌లో టీమిండియా-ఎ జట్టుతో జరిగిన అనధికార టెస్టు సిరీస్‌లో క్రాఫ్ట్ మంచి ప్రదర్శన చేశాడు. నాలుగు ఇన్నింగ్స్‌ల్లో 51, 42, 93, 10 పరుగులు సాధించాడు.


న్యూజిలాండ్ జట్టు:

టామ్ లాథమ్ (కెప్టెన్), టామ్ బ్లండెల్, డెవాన్ కాన్వే, జాకబ్ డఫీ, డీన్ ఫాక్స్‌క్రాఫ్ట్, మ్యాట్ హెన్రీ, కైల్ జేమీసన్, డారిల్ మిచెల్, హెన్రీ నికోల్స్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, నాథన్ స్మిత్, బ్లెయిర్ టిక్నర్, విల్ యంగ్.


ఇవి కూడా చదవండి:

ముద్దంటూ విదేశీయురాలిని వేధించిన వ్యక్తి.. కట్ చేస్తే జైల్లో..

అమితాబ్, అభిషేక్ బచ్చన్‌ల హత్యకు 200 మంది సిద్ధం.. గోల్డీ ధిల్లాన్ మరోసారి బెదిరింపులు..

Updated Date - Nov 17 , 2026 | 01:36 PM