ఇప్పటికీ మంచి మిత్రుడే.. కానీ కలవను: యోగరాజ్ వివాదంపై కపిల్ దేవ్
ABN , Publish Date - Jul 09 , 2026 | 11:46 AM
భారత్ దిగ్గజ క్రికెటర్ కపిల్ దేవ్‌పై తరచూ యువరాజ్ సింగ్ తండ్రి యోగరాజ్ సింగ్ విద్వేషపూరిత వ్యాఖ్యలు చేస్తుంటాడు. అయితే అతడి వ్యాఖ్యలపై ఈ హర్యానా హరికేన్ స్పందించింది. ద్వేషం వద్దు.. సంతోషంగా ఉందామంటూ హితవు పలికాడు.
స్పోర్ట్స్ డెస్క్: భారత క్రికెట్ చరిత్రలో కపిల్ దేవ్.. తన పేరును సువర్ణాక్షరాలతో లిఖించుకున్నారు. 1983లో భారత్‌కు తొలి ప్రపంచకప్ అందించి దేశంలో క్రికెట్ ముఖచిత్రాన్ని మార్చేసిన ఘనత ఆయనది. అయితే, కపిల్ సమకాలీనుడైన యువరాజ్ సింగ్ తండ్రి, మాజీ క్రికెటర్ యోగరాజ్ సింగ్ మాత్రం చాలాకాలంగా కపిల్‌పై తీవ్ర అసంతృప్తితో, ద్వేషంతో రగిలిపోతున్నాడు. కపిల్ దేవ్ వల్లే తన కెరీర్ నాశనమైందంటూ, గతంలో తుపాకీ పట్టుకుని ఆయన ఇంటికి వెళ్లానంటూ యోగరాజ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. తన తండ్రి చేసిన వ్యాఖ్యలకు లెజెండరీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ అప్పట్లోనే కపిల్‌కు క్షమాపణలు కూడా చెప్పాడు.
తాజాగా ఓ స్పోర్ట్స్ పోడ్‌కాస్ట్‌లో పాల్గొన్న కపిల్ దేవ్ ఈ వివాదంపై అత్యంత హుందాగా స్పందించాడు. యోగరాజ్ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ.. 'నా మనసులో ఎలాంటి కల్మషం లేదు. ఇప్పటికీ అతడు నా స్నేహితుడే. కానీ, జీవితంలో నిరంతరం ద్వేషాన్ని నింపుకునే వ్యక్తులకు నేను దూరంగా ఉంటాను. కఠినంగా ఉండే వారిని కలిసేందుకు ఇష్టపడను' అని కపిల్ దేవ్ స్పష్టం చేశాడు. ఇదే సమయంలో యువరాజ్ సింగ్ భారత క్రికెట్‌కు అందించిన సేవలను కపిల్ కొనియాడారు. రెండు ప్రపంచకప్‌ల్లో మ్యాన్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా నిలిచిన కొడుకును చూసి యోగరాజ్ గర్వపడాలే కానీ, ఇలాంటి పాత పగలతో జీవితాన్ని వృథా చేసుకోకూడదని కపిల్ హితవు పలికాడు.
'జీవితంలో ప్రతి ఒక్కరికీ అన్నీ దొరకవు. యోగరాజ్‌కు భారత్ తరఫున ఆడే అవకాశం వచ్చింది. సినిమాల్లోనూ నటించాడు. అయినా ఎందుకీ అసంతృప్తి?. ఒకవేళ ఆయన నన్ను కౌగిలించుకోవాలని వస్తే నాకేం అభ్యంతరం లేదు. మేమిద్దరం ఒకే కోచ్ (దేశ్ ప్రేమ్ ఆజాద్) వద్ద పెరిగాము. విడాకులు తీసుకున్నంత మాత్రాన గతంలోని మంచి రోజులను మర్చిపోకూడదు' అంటూ కపిల్ దేవ్ తన పెద్దరికాన్ని చాటుకున్నారు. పగ, ప్రతికారాల కంటే జీవితంలో ముందుకు సాగడమే ముఖ్యమని కపిల్ చెప్పిన మాటలకు క్రికెట్ ప్రియులు ఫిదా అవుతున్నారు.
ఇవి కూడా చదవండి:
తిలక్ నెమ్మదిగా ఆడితే భవిష్యత్‌లో కెప్టెన్ అవుతాడు: క్రిష్ శ్రీకాంత్