Share News

స్విస్‌ సూపర్‌

ABN , Publish Date - Jul 09 , 2026 | 02:51 AM

ఏడు దశాబ్దాల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత స్విట్జర్లాండ్‌ ఫిఫా వరల్డ్‌ కప్‌లో క్వార్టర్‌ఫైనల్‌కు చేరుకొంది. బుధవారం జరిగిన రౌండ్‌-16 మ్యాచ్‌లో పెనాల్టీ షూటౌట్‌లో స్విట్జర్లాండ్‌ 4-3తో కొలంబియాపై...

స్విస్‌ సూపర్‌

క్వార్టర్స్‌లో ఎవరెవరంటే..

ఫ్రాన్స్‌ X మొరాకో

(నేటి అర్ధరాత్రి 1.30)

స్పెయిన్‌ X బెల్జియం

(శుక్రవారం అర్ధరాత్రి 12.30)

ఇంగ్లండ్‌ X నార్వే

(ఆదివారం తెల్లవారుజాము 2.30)

అర్జెంటీనా X స్విట్జర్లాండ్‌

(ఆదివారం ఉదయం 6.30)

72 ఏళ్ల తర్వాత క్వార్టర్స్‌కు స్విట్జర్లాండ్‌

షూటౌట్‌లో కొలంబియాపై విజయం

సాకర్‌ వరల్డ్‌ కప్‌

వాంకోవర్‌ (కెనడా): ఏడు దశాబ్దాల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత స్విట్జర్లాండ్‌ ఫిఫా వరల్డ్‌ కప్‌లో క్వార్టర్‌ఫైనల్‌కు చేరుకొంది. బుధవారం జరిగిన రౌండ్‌-16 మ్యాచ్‌లో పెనాల్టీ షూటౌట్‌లో స్విట్జర్లాండ్‌ 4-3తో కొలంబియాపై గెలిచింది. దీంతో 1954 తర్వాత తొలిసారి ఆ జట్టు రౌండ్‌-8 బెర్త్‌ను పట్టేసింది. ఇక, సెమీస్‌లో చోటు కోసం డిఫెండింగ్‌ చాంప్‌ అర్జెంటీనాతో స్విస్‌ జట్టు తలపడనుంది. మ్యాచ్‌ విషయానికొస్తే.. నిర్ణీత, అదనపు సమయంలో ఇరుజట్లూ గోల్‌ చేయడంలో విఫలమ య్యాయి. దీంతో 0-0తో గోల్‌ రహితంగా నిలిచిన ఈ పోరు.. ఫలితం కోసం షూటౌట్‌కు దారితీసింది. షూటౌట్‌లో ఆఖరున కొలంబియా డిఫెండర్‌ డేవిసన్‌ శాంచెజ్‌ పెనాల్టీ కిక్‌ క్రాస్‌ బార్‌కు తగలగా, స్ట్రయికర్‌ కుచో హెర్నాండెజ్‌ కిక్‌ను స్విస్‌ కీపర్‌ గ్రెగొర్‌ కోబెల్‌ అడ్డుకొన్నాడు. ఇక, నిర్ణయాత్మక పెనాల్టీని రూబెన్‌ వార్గస్‌ గోల్‌గా మలచడంతో.. స్విట్జర్లాండ్‌ సంబరాలు చేసుకొంది.

హోరాహోరీ: కీలక ఆటగాళ్లు డిఫెండర్‌ లూకాస్‌ జాక్వెజ్‌, మిడ్‌ఫీల్డర్‌ మైకేల్‌ ఎబీషర్‌ లేకుండానే అరకొర వనరులతో బరిలోకి దిగిన స్విస్‌ జట్టును గోల్‌ కీపర్‌ కోబెల్‌ ఆపద్బాంధవుడిలా ఆదుకొన్నాడు. కొలంబియా దాడికి ఎదురునిలిచిన కోబెల్‌.. కనీసం మూడు గోల్స్‌ను అడ్డుకొన్నాడు. 21వ నిమిషంలో గుస్తావో ప్యూరెటా దూరం నుంచి కొట్టిన షాట్‌ను కోబెల్‌ త్రుటిలో పక్కను నెట్టేశాడు. మరో తొమ్మిది నిమిషాల తర్వాత స్విస్‌కు గోల్‌ చేసే చాన్స్‌ దక్కింది. కానీ, మిడ్‌ఫీల్డర్‌ ఫాబియన్‌ రీడర్‌ పవర్‌ఫుల్‌ కిక్‌ను కొలంబియా కీపర్‌ కమిలో వార్గస్‌ ఒక్క పంచ్‌తో పక్కకు నెట్టాడు. 52వ నిమిషంలో స్విస్‌కు ఫ్రీకిక్‌ లభించినా.. రీడర్‌ షాట్‌ సుడులు తిరుగుతూ బయటకు పోయింది. నిర్ణీత సమయంలో ఇరుజట్లూ గోల్‌ చేయలేక పోవడంతో మ్యాచ్‌ ఫలితం ఎక్స్‌ట్రా టైమ్‌కు వెళ్లింది. 99వ నిమిషంలో కొలంబియా ఆటగాడు జాన్‌ లుకుమి హెడర్‌.. గోల్‌ బార్‌కు తగిలి బయటకు పోవడంతో ఆ జట్టు నిరాశకు గురైంది. అదనపు సమయంలోనూ గోల్‌ కాకపోవడంతో షూటౌట్‌ అనివార్యమైంది. ఇందులో స్విస్‌ జట్టును అదృష్టం వరించింది.


9-Sports.jpg

ఎనిమిది జట్ల సమరం ఇక.. రసవత్తరం

సాకర్‌ ప్రపంచకప్‌లో రౌండ్‌-16 సమరం ముగిసింది. క్వార్టర్స్‌కు చేరిన ఎనిమిది జట్లేవో తేలిపోయింది. ఫుట్‌బాల్‌ పవర్‌హౌ్‌సలైన డిఫెండింగ్‌ చాంప్‌ అర్జెంటీనా, ఫ్రాన్స్‌, ఇంగ్లండ్‌, స్పెయిన్‌ లాంటి ఫేవరెట్లతో పాటు అండర్‌డాగ్‌లైన మొరాకో, నార్వే, బెల్జియం, స్విట్జర్లాండ్‌ రౌండ్‌-8కు అర్హత సాధించాయి. మొత్తంగా ప్రపంచ ర్యాకింగ్స్‌లో టాప్‌-10లోని ఆరు జట్లు క్వార్టర్స్‌కు చేరుకోవడంతో ఇక నుంచి జట్ల మధ్య పోరు మరింత రసవత్తరం కానుంది.

ఇవి కూడా చదవండి:

ఐసీసీ ఎన్నికల్లో పెను సంచలనం.. డిప్యూటీ ఛైర్మన్ ఇమ్రాన్ ఖ్వాజాకు షాక్!

అక్తర్ రికార్డును బ్రేక్ చేస్తాను.. టీమిండియా బౌలర్ ఆసక్తికర వ్యాఖ్యలు

Updated Date - Jul 09 , 2026 | 02:51 AM