Share News

ఐసీసీ ఎన్నికల్లో పెను సంచలనం.. డిప్యూటీ ఛైర్మన్ ఇమ్రాన్ ఖ్వాజాకు షాక్!

ABN , Publish Date - Jul 08 , 2026 | 08:10 PM

ఐసీసీ పాలకమండలిలో భారీ మార్పు చోటుచేసుకుంది. ఎడిన్‌బర్గ్‌లో జరిగిన ఐసీసీ వార్షిక సమావేశాల్లో భాగంగా నిర్వహించిన ‘అసోసియేట్ మెంబర్ డైరెక్టర్ల’ ఎన్నికల్లో అనూహ్య పరిణామం ఎదురైంది.

ఐసీసీ ఎన్నికల్లో పెను సంచలనం.. డిప్యూటీ ఛైర్మన్ ఇమ్రాన్ ఖ్వాజాకు షాక్!
ICC Associate Member Directors

స్పోర్ట్స్ డెస్క్: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) పాలకమండలిలో భారీ మార్పు చోటుచేసుకుంది. ఎడిన్‌బర్గ్‌లో జరిగిన ఐసీసీ వార్షిక సమావేశాల్లో భాగంగా నిర్వహించిన ‘అసోసియేట్ మెంబర్ డైరెక్టర్ల’ ఎన్నికల్లో అనూహ్య పరిణామం ఎదురైంది. ఐసీసీలో సుదీర్ఘకాలం డిప్యూటీ ఛైర్మన్‌గా సేవలందించిన సింగపూర్‌కు చెందిన సీనియర్ అడ్మినిస్ట్రేటర్ ఇమ్రాన్ ఖ్వాజా ఊహించని ఓటమిని చవిచూశారు. ఐసీసీ బోర్డులోని మూడు అసోసియేట్ డైరెక్టర్ స్థానాల కోసం జరిగిన ఈ ఎన్నికల్లో ఫ్రాన్స్‌కు చెందిన గురుమూర్తి పళని 35 ఓట్లతో అగ్రస్థానంలో నిలిచి సంచలనం సృష్టించారు.


మిగిలిన రెండు స్థానాలను యూఏఈకి చెందిన ముబాషిర్ ఉస్మాని, నమీబియాకు చెందిన డాక్టర్ రూడీ వాన్ వురెన్ చెరో 26 ఓట్లతో దక్కించుకున్నారు. అత్యంత శక్తిమంతమైన 17 మంది సభ్యుల ఐసీసీ బోర్డులోకి గురుమూర్తి పళని, వురెన్ తొలిసారి అడుగుపెట్టగా.. ఉస్మాని తన స్థానాన్ని నిలబెట్టుకున్నారు. ఇమ్రాన్ ఖ్వాజా 23 ఓట్లతో నాలుగో స్థానానికి పరిమితం కాగా, మలేషియాకు చెందిన మహింద వల్లిపురం 19 ఓట్లు మాత్రమే సాధించారు. అమెరికా, కెనడాల సభ్యత్వాలు సస్పెన్షన్‌లో ఉండటంతో.. మొత్తం 45 అసోసియేట్ దేశాలలో 43 దేశాలు మాత్రమే ఓటింగ్‌లో పాల్గొన్నాయి.


ఇమ్రాన్ ఖ్వాజా ఓటమితో ఐసీసీలో ఒక సుదీర్ఘ శకం ముగిసింది. వృత్తిరీత్యా న్యాయవాది అయిన ఆయన గతంలో 2020లో తాత్కాలిక ఐసీసీ చైర్మన్‌గా వ్యవహరించారు. ఎన్.శ్రీనివాసన్, గ్రెగ్ బార్‌క్లే, జై షా వంటి దిగ్గజాల హయాంలో డిప్యూటీ ఛైర్మన్‌గా పనిచేశారు. భారత్-పాక్ మధ్య కొలంబోలో జరిగిన హై-వోల్టేజ్ టీ20 ప్రపంచకప్ మ్యాచ్ సజావుగా సాగడానికి ఖ్వాజా జరిపిన రాయబారాలు క్రికెట్ చరిత్రలో నిలిచిపోతాయి. కొత్తగా ఎన్నికైన సభ్యులకు ఐసీసీ ఛైర్మన్ జై షా అభినందనలు తెలియజేస్తూ.. గ్లోబల్ క్రికెట్ విస్తరణలో అసోసియేట్ సభ్యుల పాత్ర కీలకమని కొనియాడారు. ఖ్వాజా నిష్క్రమణతో ఐసీసీ ఇప్పుడు కొత్త డిప్యూటీ ఛైర్మన్‌ను ఎన్నుకోవాల్సి ఉంటుంది.


ఇవి కూడా చదవండి:

అక్తర్ రికార్డును బ్రేక్ చేస్తాను.. టీమిండియా బౌలర్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఫిఫా 2026: క్వార్టర్ ఫైనల్స్‌కు లైన్ క్లియర్.. షెడ్యూల్ ఇదే!

Updated Date - Jul 08 , 2026 | 09:10 PM