జులై 20 నుంచి బల్కంపేట ఎల్లమ్మ వార్షిక కళ్యాణోత్సవాలు: కొండా సురేఖ
ABN , Publish Date - Jul 08 , 2026 | 07:47 PM
హైదరాబాద్‌లోని బల్కంపేట ఎల్లమ్మ బోనాల ఉత్సవాలకు సర్వం సిద్ధం చేయాలని ఆధికారులను దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఆదేశించారు. ఎల్లమ్మ దర్శనం అష్టాదశ శక్తిపీఠాల దర్శనంతో సమానమని భక్తుల విశ్వాసం అని ఆమె పేర్కొన్నారు.
హైదరాబాద్, జులై 08: నగరంలోని బల్కంపేట ఎల్లమ్మ బోనాల ఉత్సవాలకు సర్వం సిద్ధం చేయాలని ఆధికారులను దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఆదేశించారు. బల్కంపేట ఎల్లమ్మ దర్శనం అష్టాదశ శక్తిపీఠాల దర్శనంతో సమానమని భక్తుల విశ్వాసం అని పేర్కొన్నారు. బుధవారం హైదరాబాద్‌లో బోనాల జాతర, కళ్యాణోత్సవ పోస్టర్లను మంత్రి కొండా సురేఖ ఆవిష్కరించారు. వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. జులై 20 నుంచి 22 వరకు ఎల్లమ్మ అమ్మవారి వార్షిక కళ్యాణోత్సవాలు జరుగుతాయని వివరించారు. జులై 20 సాయంత్రం ఎదుర్కోలు ఉత్సవంతో ఈ వేడుకలు ప్రారంభమవుతాయని తెలిపారు.
జులై 21న వైభవంగా ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణోత్సవం జరుగుతుందని మంత్రి కొండా సురేఖ చెప్పారు. జులై 22న సాయంత్రం ఘనంగా రథోత్సవం నిర్వహిస్తారని పేర్కొన్నారు. ఈ ఉత్సవాలకు లక్షలాది మంది భక్తులు తరలివస్తారన్నారు. ఈ నేపథ్యంలో అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సమన్వయంతో పనిచేయాలని అధికారులు, సిబ్బందిని మంత్రి ఆదేశించారు.
వర్షాకాలం నేపథ్యంలో విద్యుత్ సేవలు, భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు స్పష్టం చేశారు సురేఖ. పోలీసులతో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటుచేయాలని అన్నారు. ట్రాఫిక్ మళ్లింపునకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలనీ సూచించారు. మహిళలు, వృద్ధులు, దివ్యాంగుల కోసం ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటుచేయాలని ఆదేశించారు. పరిశుభ్రత, మొబైల్ టాయిలెట్లు, తాగునీటి ఏర్పాట్లు పూర్తిచేయాలని జీహెచ్‌ఎంసీ అధికారులకు స్పష్టం చేశారు. వైద్య శిబిరాల ఏర్పాటు, 108 అంబులెన్స్‌లతోపాటు అత్యవసర వైద్య బృందాలనూ సిద్ధంగా ఉంచాలని తెలిపారు. ప్రత్యేక బస్సులు నడపాలని ఆర్టీసీ అధికారులను మంత్రి ఆదేశించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
బండి భగీరథ్ బెయిల్ పిటిషన్‌పై హైకోర్టు తీర్పుపై ఉత్కంఠ
డిజిటల్ గవర్నెన్స్‌తో పారదర్శక పరిపాలన అందిస్తాం: సీఎం రేవంత్‌రెడ్డి
Read Latest Telangana News And Telugu News