ఫిఫా 2026: క్వార్టర్ ఫైనల్స్‌కు లైన్ క్లియర్.. షెడ్యూల్ ఇదే!
ABN , Publish Date - Jul 08 , 2026 | 06:24 PM
ఫిఫా ప్రపంచ కప్ 2026 క్వార్టర్ ఫైనల్ దశకు చేరింది. రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్‌లు ముగియడంతో క్వార్టర్ ఫైనల్స్ పోరుకు లైన్ క్లియర్ అయింది. ఇక్కడి నుంచి మ్యాచ్‌లు మరింత ఆసక్తికరంగా మారనున్నాయి.
స్పోర్ట్స్ డెస్క్: ఫిఫా ప్రపంచ కప్ 2026 క్వార్టర్ ఫైనల్ దశకు చేరింది. రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్‌లు ముగియడంతో క్వార్టర్ ఫైనల్స్ పోరుకు లైన్ క్లియర్ అయింది. ఇక్కడి నుంచి మ్యాచ్‌లు మరింత ఆసక్తికరంగా మారనున్నాయి. లీగ్ దశలో 48 జట్లు పోటిపడితే అందులో 32 జట్టలు నాకౌట్ దశకు చేరాయి. అక్కడ నుంచి 16 జట్లు ప్రిక్వార్టర్స్‌కు చేరుకున్నాయి. తాజాగా క్వార్టర్ ఫైనల్ స్టేజ్ కు 8 జట్లు చేరాయి.
ఈ ఫిఫాలో ఎన్నో ఆశ్చర్యకరమైన ఫలితాలు, ఉత్కంఠభరితమైన క్షణాల మధ్య సాగిన ఈ రౌండ్‌లో ఫేవరెట్ జట్లు కొన్ని ముందంజ వేయగా, మరికొన్ని జట్లు ఇంటిబాట పట్టాయి. జర్మనీ, పోర్చుగల్, నెదర్లాండ్స్, క్రొయేషియా లాంటి జట్లు ప్రి క్వార్టర్స్ లోనే టోర్నీ నుంచి నిష్క్రమించాయి. డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా సైతం ఈజిప్ట్‌తో జరిగిన మ్యాచ్‌లో ఒక దశలో 2-0తో వెనుకబడి, లీ మిస్సి అద్భుతమైన ఫామ్‌తో కేవలం 13 నిమిషాల్లో 3 గోల్స్ కొట్టి 3-2తో నాటకీయ విజయాన్ని అందుకుంది.
మరోవైపు మొరాకో 3-0తో కెనడాను, ఫ్రాన్స్ 1-0తో పరాగ్వేను, బెల్జియం 4-1తో యూఎస్‌ఏను ఓడించి క్వార్టర్స్‌కు చేరాయి. స్విట్జర్లాండ్-కొలంబియా మ్యాచ్ షూటౌట్‌కు దారితీయగా, స్విట్జర్లాండ్ విజయం సాధించింది. ఇంగ్లండ్ జట్టు 3-2తో మెక్సికోను ఓడించి ముందంజ వేసింది. అన్నీ కుదిరితే 2022 ఫిఫా ప్రపంచ కప్‌లో ఫైనల్లో తలపడిన అర్జెంటీనా, ఫ్రాన్స్ లు ఈసారి సెమీస్ లేదా మరోసారి ఫైనల్లో తలపడే ఛాన్స్ ఉంది. మొత్తంగా క్వార్టర్ ఫైనల్ దశ మరింత ఆసక్తికరంగా మారింది.
క్వార్టర్ ఫైనల్స్ షెడ్యూల్ (భారత కాలమానం ప్రకారం):
ఫ్రాన్స్ vs మొరాకో: జులై 10, రాత్రి 1:30 గంటలకు (బోస్టన్ స్టేడియం)
స్పెయిన్ vs బెల్జియం: జులై 11, రాత్రి 12:30 గంటలకు (లాస్ ఏంజెల్స్ స్టేడియం)
నార్వే vs ఇంగ్లాండ్: జులై 12, తెల్లవారుజామున 2:30 గంటలకు (మయామి స్టేడియం)
అర్జెంటీనా vs స్విట్జర్లాండ్: జులై 12, ఉదయం 6:30 గంటలకు (కాన్సాస్ సిటీ స్టేడియం)
లైవ్ స్ట్రీమింగ్ వివరాలు:
ఈ ప్రతిష్ఠాత్మక మ్యాచ్‌లను భారత్‌లో ' యూనైట్8 స్పోర్ట్స్' ఛానళ్లలో ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించవచ్చు. డిజిటల్ స్ట్రీమింగ్ కోసం 'జీ5' యాప్‌లో మ్యాచ్‌లు అందుబాటులో ఉంటాయి.
ఇవి కూడా చదవండి:
ఫిఫా ప్రపంచకప్‌లో యూఎస్ వ్యూహాలపై ఇరాన్ ఘాటు విమర్శలు!
ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్: అగ్రస్థానాల్లో ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ