ఢిల్లీ నుంచి సిలిగురికి 6 గంటల్లో.. పట్టాలెక్కిన బుల్లెట్ రైల్ ప్లాన్
ABN , Publish Date - Jul 08 , 2026 | 06:14 PM
దేశంలో హైస్పీడ్ రైలు వ్యవస్థ విస్తరణకు కేంద్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేస్తోంది. ఇప్పటికే నిర్మాణంలో ఉన్న ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుకు తోడు ఢిల్లీ కేంద్రంగా నాలుగు కొత్త హైస్పీడ్ రైలు కారిడార్ల అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి.
ఇంటర్నెట్ డెస్క్: దేశంలో హైస్పీడ్ రైల్వే విస్తరణకు కేంద్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేస్తోంది. ఇప్పటికే నిర్మాణంలో ఉన్న ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుకు తోడు ఢిల్లీ కేంద్రంగా నాలుగు కొత్త హైస్పీడ్ రైలు కారిడార్ల అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. వీటిలో ఢిల్లీ-వారణాసి-సిలిగురి కారిడార్ అత్యంత ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్‌గా పట్టాలెక్కుతోంది. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌లో ప్రకటించిన ఏడు హైస్పీడ్ రైలు కారిడార్లలో ఒకటిగా, దేశంలోనే అత్యంత పొడవైన బుల్లెట్ రైలు మార్గంగా రూపుదిద్దుకోనుంది. ఈ ప్రాధాన్య కారిడార్లకు సుమారు రూ.2 లక్షల కోట్ల పెట్టుబడి అవసరమవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
ఈ ప్రతిపాదిత కారిడార్ సుమారు 1,705 కిలోమీటర్ల పొడవు ఉండగా.. ప్రస్తుతం దాదాపు 20 గంటల సమయం పట్టే ఢిల్లీ-సిలిగురి ప్రయాణాన్ని కేవలం 6 గంటల్లో పూర్తిచేసే దిశగా ప్లాన్ చేస్తున్నారు అధికారులు. ఈ మార్గంలో ఢిల్లీ, నొయిడా, ఆగ్రా, లఖ్‌నవూ, వారణాసి, బక్సర్, పాట్నా, బేగుసరాయ్, ఖగారియా, కటిహార్, సిలిగురి వంటి ప్రధాన నగరాలు అనుసంధానం కానున్నాయి. భవిష్యత్తులో ఈ మార్గాన్ని గువాహటి వరకు విస్తరించే అవకాశాన్ని కూడా అధికారులు పరిశీలిస్తున్నారు.

ఈ ప్రాజెక్టులో గంటకు గరిష్ఠంగా 320 కిలోమీటర్ల వేగంతో బుల్లెట్ రైళ్లు నడిచేలా అధికారులు ప్లాన్ చేశారు. ప్రస్తుతం రైల్వే శాఖ సర్వేలు, సాధ్యాసాధ్యాల అధ్యయనాలు నిర్వహిస్తుండగా, ఢిల్లీ-వారణాసి హైస్పీడ్ కారిడార్‌కు సంబంధించిన సివిల్ నిర్మాణాల డిజైన్ కన్సల్టెన్సీ కోసం నేషనల్ హైస్పీడ్ రైల్ కార్పొరేషన్(NHSRCL) టెండర్లనూ ఆహ్వానించింది. మరోవైపు.. ఢిల్లీ-జైపూర్-ఉదయ్‌పూర్-అహ్మదాబాద్, ఢిల్లీ-అమృత్‌సర్-జమ్మూ కారిడార్లు కూడా ప్రతిపాదనల్లో ఉన్నాయి. ఇవి అమల్లోకి వస్తే ఉత్తర, పశ్చిమ, తూర్పు భారత ప్రాంతాల మధ్య వేగవంతమైన రైలు అనుసంధానం ఏర్పడుతుందని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది.
అయితే.. ఢిల్లీ కేంద్రంగా ప్రతిపాదించిన ఈ నాలుగు బుల్లెట్ రైలు మార్గాల్లో ఏదీ ఇంకా నిర్మాణ దశలోకి చేరలేదు. సర్వేలు, మార్గ నిర్ధారణ, డీపీఆర్‌లు, ఆర్థిక అనుమతులు వంటి ప్రక్రియలు కొనసాగుతున్నాయి. మరోవైపు ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ రైలు తొలి దశను 2027లో, పూర్తి కారిడార్‌ను 2029 నాటికి అందుబాటులోకి తీసుకురావాలని రైల్వే శాఖ లక్ష్యంగా పెట్టుకుంది.
ఇవీ చదవండి:
ఎన్నికల విజయంపై న్యాయపోరు.. సీఎం విజయ్‌కు కొత్త చిక్కులు
కుండపోత వర్షాలు.. పుణేలో కూలిన మూడు అంతస్తుల భవనం..