తిలక్ నెమ్మదిగా ఆడితే భవిష్యత్‌లో కెప్టెన్ అవుతాడు: క్రిష్ శ్రీకాంత్
ABN , Publish Date - Jul 09 , 2026 | 10:47 AM
ఇంగ్లండ్, టీమిండియా మధ్య ఇవాళ(గురువారం) నాలుగో టీ20 జరగనుంది. ప్రస్తుతం భారత జట్టు సిరీస్‌ను కోల్పోయే ప్రమాదంలో ఉంది. ఈనేపథ్యంలో టీమిండియా మేనేజ్‌మెంట్‌పై మాజీ కెప్టెన్ క్రిష్ శ్రీకాంత్ విమర్శలు చేశాడు.
స్పోర్ట్స్ డెస్క్: ఇంగ్లండ్, టీమిండియా(Ind vs Eng) మధ్య ఇవాళ(గురువారం) నాలుగో టీ20 జరగనుంది. ప్రస్తుతం భారత జట్టు సిరీస్‌ను కోల్పోయే ప్రమాదంలో ఉంది. ఇప్పుడీ మ్యాచ్‌లో గెలిస్తేనే కనీసం సిరీస్‌ను సమం చేసేందుకైనా అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో గత మ్యాచుల్లో పెద్దగా ప్రభావం చూపని తిలక్ వర్మను పక్కన పెట్టి సంజు శాంసన్‌కు అవకాశం ఇవ్వాలని టీమిండియా మాజీ కెప్టెన్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ (క్రిష్) సూచించాడు. అదే సమయంలో వైస్ కెప్టెన్‌గా ఉన్న తిలక్ వర్మ ఇలాగే నెమ్మదిగా ఆడితే భవిష్యత్తులో సారథి అవుతాడంటూ పరోక్షంగా సెటైర్లు వేశాడు.
ఓ స్పోర్ట్స్ ఇంటర్వ్యూలో క్రిష్ శ్రీకాంత్ మాట్లాడుతూ.. ‘తిలక్ వర్మ (Tilak Varma) ఇప్పుడు జట్టుకు వైస్ కెప్టెన్‌గా ఉన్నాడు. భవిష్యత్తులో కెప్టెన్ కూడా అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అతడు క్రీజ్‌లోకి వచ్చాక ఔట్ కాకూడదనే ఉద్దేశంతోనే ఆడుతున్నట్లు అనిపిస్తుంది. బంతి వేగం, బౌన్స్‌ను చూసి స్ట్రైకింగ్‌కు వెళ్లకూడదని భావించి ఉండొచ్చు. అందుకే, తిలక్ స్థానంలో శాంసన్ ను ఆడించడం కాస్త నయం' అని క్రిష్ పేర్కొన్నాడు.
'తిలక్‌ను మీరు(టీమిండియా మేనేజ్‌మెంట్) ప్రధాన బ్యాటర్‌గా తీసుకున్నారు. పేసర్లను ఎదుర్కొనే విషయంలో అతడిని వెనుకేసుకొస్తున్నారు. తిలక్ కంటే ముందు అక్షర్ పటేల్‌ను బ్యాటింగ్‌కు పంపించారు. షార్ట్ పిచ్ బంతులకు వైస్ కెప్టెన్ ఇబ్బంది పడుతున్నాడని మేనేజ్‌మెంట్‌కు తెలుసు. తిలక్‌ను జట్టు నుంచి తప్పించాలని.. అప్పుడే మెరుగ్గా మారి వస్తాడని పదేపదే చెబుతున్నా. కానీ, అలా చేయడం లేదు’ అని క్రిష్(Krishnamachari Srikkanth) వ్యాఖ్యానించాడు. మొత్తంగా టీమిండియా మేనేజ్‌మెంట్‌పై క్రిష్ శ్రీకాంత్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించాడు.
ఇవి కూడా చదవండి: