Share News

'దాదా'కు పుట్టినరోజు కానుక.. ఐసీసీ 'హాల్ ఆఫ్ ఫేమ్'లో సౌరభ్ గంగూలీకి చోటు!

ABN , Publish Date - Jul 08 , 2026 | 09:49 PM

టీమిండియా మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీకి పుట్టినరోజు వేళ అరుదైన గౌరవం దక్కింది. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ప్రతిష్ఠాత్మక 'హాల్ ఆఫ్ ఫేమ్'లో గంగూలీకి చోటు కల్పించింది.

'దాదా'కు పుట్టినరోజు కానుక.. ఐసీసీ 'హాల్ ఆఫ్ ఫేమ్'లో సౌరభ్ గంగూలీకి చోటు!
Sourav Ganguly

స్పోర్ట్స్ డెస్క్: సౌరభ్ గంగూలి.. ఈ పేరు గురించి భారత క్రికెట్ అభిమానులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. టీమిండియా చరిత్రలో అత్యంత విజయవంతమైన, దూకుడైన కెప్టెన్‌గా గంగూలీ పేరు సంపాదించాడు. ఇవాళ(బుధవారం) దాదాకు పుట్టినరోజు వేళ అరుదైన గౌరవం దక్కింది. ఐసీసీ ప్రతిష్ఠాత్మక 'హాల్ ఆఫ్ ఫేమ్'లో గంగూలీకి చోటు కల్పించింది. జులై 8న గంగూలీ తన 54వ జన్మదినాన్ని నిర్వహించుకుంటున్న సందర్భంలోనే ఈ ప్రకటన రావడం విశేషం. ఈ గౌరవాన్ని అందుకోబోతున్న 12వ భారతీయ క్రికెటర్‌గా, పురుషుల విభాగంలో 10వ ఆటగాడిగా 'దాదా' చరిత్ర సృష్టించాడు.


'హాల్ ఆఫ్ ఫేమ్' గౌరవంపై గంగూలీ హర్షం వ్యక్తం చేశాడు. ఐసీసీతో పాటు ఐసీసీ చైర్మన్ జై షాకు 'ఎక్స్' వేదికగా ధన్యవాదాలు తెలిపాడు. 'నన్ను హాల్ ఆఫ్ ఫేమ్‌లోకి చేర్చినందుకు ఐసీసీ, చైర్మన్ జై షాకు ధన్యవాదాలు. ఇదొక గొప్ప గౌరవం. క్రికెట్ ప్రపంచంలోని దిగ్గజాల సరసన నిలవడం అద్భుతంగా ఉంది' అని గంగూలీ పేర్కొన్నాడు. 2009లో ప్రారంభమైన ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్.. క్రీడలో అసాధారణ విజయాలు సాధించిన ఆటగాళ్లను గౌరవిస్తుంది. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ఐదేళ్ల తర్వాతే ఈ అవార్డుకు ఆటగాళ్లు అర్హులవుతారు.


గంగూలీ కంటే ముందు సునీల్ గావస్కర్, కపిల్ దేవ్, సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రావిడ్, ఎం.ఎస్ ధోనీ వంటి దిగ్గజాలు ఈ అరుదైన గౌరవాన్ని అందుకున్నారు. భారత క్రికెట్ మ్యాచ్ ఫిక్సింగ్ వంటి తీవ్ర సంక్షోభంలో ఉన్న 2000 సంవత్సరంలో గంగూలీ జట్టు కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాడు. యువ ఆటగాళ్లలో దూకుడు, ఆత్మవిశ్వాసాన్ని నూరిపోసి, విదేశీ గడ్డపై సైతం టీమిండియాను సింహస్వప్నంగా మార్చాడు.


'గాడ్ ఆఫ్ ఆఫ్‌సైడ్'గా ప్రసిద్ధి చెందిన గంగూలీ.. తన కెరీర్‌లో ఆడిన 424 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో 38 సెంచరీలు, 107 హాఫ్ సెంచరీలతో 18,575 పరుగులు సాధించాడు. ఇందులో 113 టెస్టుల్లో 7,212 పరుగులు, 311 వన్డేల్లో 11,363 పరుగులు ఉన్నాయి. గంగూలీ హయాంలోనే భారత్ 2002 నాట్‌వెస్ట్ సిరీస్, 2003 వన్డే ప్రపంచకప్ రన్నరప్‌గా నిలిచింది. జులై 11న జరిగే ఐసీసీ వార్షిక సమావేశాల ముగింపు వేడుకల్లో గంగూలీని అధికారికంగా సత్కరించనున్నారు.


ఇవి కూడా చదవండి:

ఐసీసీ ఎన్నికల్లో పెను సంచలనం.. డిప్యూటీ ఛైర్మన్ ఇమ్రాన్ ఖ్వాజాకు షాక్!

అక్తర్ రికార్డును బ్రేక్ చేస్తాను.. టీమిండియా బౌలర్ ఆసక్తికర వ్యాఖ్యలు

Updated Date - Jul 08 , 2026 | 09:55 PM