Share News

సంస్కృతి బహ్రెయిన్ నూతన కార్యవర్గం ఎన్నిక

ABN , Publish Date - Jul 08 , 2026 | 09:13 PM

సంస్కృతి బహ్రెయిన్ నూతన కార్యవర్గం తాజాగా కొలువుదీరింది. సంస్థ అధ్యక్షుడిగా హైదరాబాద్‌కు చెందిన దీపక్ నంద్యాల ఎన్నికయ్యారు.

సంస్కృతి బహ్రెయిన్ నూతన కార్యవర్గం ఎన్నిక
Sanskriti Bahrain

ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి ఇర్ఫాన్: సంస్కృతి బహ్రెయిన్ అనే ఆసక్తికర పేరు కలిగిన ఈ సంస్థ అరేబియా సముద్ర తీరంలోని చిరు ద్వీపకల్ప దేశం బహ్రెయిన్‌లో భారతీయ సంస్కృతి, జాతీయ స్ఫూర్తి, సనాతన ధర్మ విలువల పరిరక్షణ కోసం విస్తృత కృషి చేస్తోంది.

భారతమాతకు దూరంగా అరేబియా ఎడారి దేశంలో మాతృభూమి సేవకోసం పరితపించే సంస్థ సంస్కృతి బహ్రెయిన్. భారత్‌లోని 27 రాష్ట్రాలకు చెందిన ఔత్సాహికులతో దశాబ్దకాలానికి పైగా సంస్కృతి బహ్రెయిన్ సామాజిక, సాంస్కృతిక సేవలందిస్తోంది. ఇటీవల ఈ సంఘం తన నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోగా అందులో హైదరాబాద్‌కు చెందిన దీపక్ నంద్యాల అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.

భారతీయ సనాతన ధర్మం, జాతీయ భావాల మధ్య విడదీయరాని బంధం ఉందని ప్రగాఢంగా విశ్వసించే దీపక్ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సనాతన ధర్మం కేవలం ఒక మతం మాత్రమే కాదని అన్నారు. అది మానవాళికి శాంతిని, సమైక్యతను, ధర్మాన్ని బోధించే ఒక జీవన విధానమని అన్నారు. విదేశాల్లో భారత దేశ సంస్కృతి, జాతీయ సమగ్రతకు బలమైన పునాదిగా పనిచేస్తున్న మంత్రం సనాతనమని వ్యాఖ్యానించారు.


ప్రధాని నరేంద్ర మోదీ స్ఫూర్తితో స్వచ్ఛ భారత్ మిషన్ ఆశయానికి అనుగుణంగా అరేబియా సముద్ర తీరంలో ప్రతి వారం శుభ్రతా కార్యక్రమాన్ని సంస్కృతి బహ్రెయిన్ నిర్వహిస్తోంది. ఆరోగ్య పరిరక్షణ, రక్తదాన శిబిరాలతో పాటు యాంత్రిక జీవితంలో అలసిపోయిన వారికి ప్రత్యేకంగా యోగా శిబిరాలను కూడా సంస్కృతి బహ్రెయిన్ నిర్వహిస్తోంది.

ఈ సంస్థ నిర్వహించిన లిటిల్ ఇండియా కార్యక్రమం బహ్రెయిన్‌లో భారతీయ స్ఫూర్తిని రగిలించిందని నిర్వాహకులు అభిప్రాయపడ్డారు.

సంస్కృతి బహ్రెయిన్ కార్యవర్గానికి దీపక్ నంద్యాల అధ్యక్షుడిగా ఎన్నిక కాగా రేజు ఆండ్రూస్ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. ఆనంద్. జె (ఉపాధ్యక్షుడు), హరీష్ నాయర్ (కోశాధికారి), హనుమంతరావు (సంయుక్త కార్యదర్శి), రంజిత్. పి (సభ్యత్వ కార్యదర్శి), వెంకట్ స్వామి, ప్రేమ్ సాగర్, రాజీష్, వినయ్ చండల్ (కార్యనిర్వాహక సభ్యులు), సురేష్ బాబు (విదేశీ సమన్వయకర్త), ప్రవీణ్ ఎస్ (సలహాదారు), ప్రదీప్. ఎస్ (సంయోజక్) కూడా కార్యవర్గానికి ఎన్నికయ్యారు.

ఆనంద్. జె స్వాగతోపన్యాసంతో ప్రారంభమైన సమావేశం హరీష్ నాయర్ వందన సమర్పణతో ముగిసింది. ఈ సమావేశంలో ప్రముఖులు డాక్టర్ అరుణ్ కుమార్ ప్రహరాజ్, ప్రత్యేక అతిథులు అభిషేక్ దేవ్ జీ, బ్రిజ్‌భూషణ్ కిషోర్‌లు పాల్గోన్నారు.


ఈ వార్తలనూ చదవండి:

జోరందుకున్న ప్రవాసాంధ్ర పదవుల పందేరం.. టీడీపీ శ్రేణుల సంబరాలు

జీవితాంతం ఎడారిలో గడిపి.. చివరకు అక్కడే.. తెలంగాణ వాసి దీనగాథ

Updated Date - Jul 08 , 2026 | 09:21 PM