నేటి నుంచే ‘కపిల్ దేవ్ ఇన్విటేషనల్ టూర్ ఛాంపియన్‌షిప్’.. రూ.2 కోట్ల ప్రైజ్ మనీ..
ABN , Publish Date - Oct 07 , 2026 | 02:48 PM
కపిల్ దేవ్ ఇన్విటేషనల్ టూర్ ఛాంపియన్‌షిప్ అక్టోబర్ 7 నుంచి 10 వరకు గ్రేటర్ నోయిడాలోని జేపీ గ్రీన్స్ గోల్ఫ్ అండ్ స్పా రిసార్ట్‌లో ఘనంగా జరగనుంది. మొత్తం రూ. 2 కోట్ల భారీ ప్రైజ్ మనీతో సాగే ఈ ప్రతిష్ఠాత్మక టోర్నీలో డీపీ వరల్డ్ పీజీటీఐ ఆర్డర్ ఆఫ్ మెరిట్‌లో ఉన్న టాప్-60 ఆటగాళ్లు పాల్గొనున్నారు.
స్పోర్ట్స్ డెస్క్: కపిల్ దేవ్ ఇన్విటేషనల్ టూర్ ఛాంపియన్‌షిప్ అక్టోబర్ 7 నుంచి 10 వరకు గ్రేటర్ నోయిడాలోని జేపీ గ్రీన్స్ గోల్ఫ్ అండ్ స్పా రిసార్ట్‌లో ఘనంగా జరగనుంది. మొత్తం రూ. 2 కోట్ల భారీ ప్రైజ్ మనీతో సాగే ఈ ప్రతిష్ఠాత్మక టోర్నీలో డీపీ వరల్డ్ పీజీటీఐ ఆర్డర్ ఆఫ్ మెరిట్‌లో ఉన్న టాప్-60 ఆటగాళ్లతో సహా మొత్తం 64 మంది ప్రొఫెషనల్స్ పాల్గొంటున్నారు. వచ్చే వారం జరగబోయే ‘రేస్ టు డీపీ వరల్డ్ ఇండియా ఛాంపియన్‌షిప్’ సీజన్ ఫైనల్‌కు టాప్-24 ఆటగాళ్లను ఎంపిక చేయడానికి ఇదే చివరి టోర్నమెంట్ కావడం విశేషం.
ఈ టోర్నీలో భారత స్టార్ ప్లేయర్ శుభాంకర్ శర్మ, పీజీటీఐ ఆర్డర్ ఆఫ్ మెరిట్ డిఫెండింగ్ ఛాంపియన్ యువరాజ్ సంధుతో పాటు ప్రస్తుతం పీజీటీఐ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో ఉన్న స్వదేశీ గోల్ఫర్ సప్తక్ తల్వార్ తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. సప్తక్‌కు ఇది సొంత మైదానం కావడం సానుకూలంశం. వీరితో పాటు ఖాలిన్ జోషి, వీర్ అహ్లావత్, హనీ బైసోయా, అక్షయ్ శర్మ, రషీద్ ఖాన్‌లతో పాటు స్థానిక క్రీడాకారులు అమర్‌దీప్ మాలిక్, అర్జున్ శర్మ కూడా రేసులో ఉన్నారు. ఈ టోర్నమెంట్‌లో భారతదేశంతో పాటు 8 విదేశాలకు చెందిన 10 మంది అంతర్జాతీయ క్రీడాకారులు పాల్గొంటున్నారు. ఎన్ తంగరాజా (శ్రీలంక), మిచెల్ ఒర్టోలానీ (ఇటలీ), జమాల్ హుస్సేన్, బాదల్ హుస్సేన్, మహమ్మద్ అక్బర్ హుస్సేన్ (బంగ్లాదేశ్), సుభాష్ తమంగ్ (నేపాల్), స్టెపాన్ డానెక్ (చెక్ రిపబ్లిక్), జోషువా సీల్ (ఉగాండా), తనపట్ పిచైకూల్ (థాయిలాండ్), కోయిచిరో ఇషికా (జపాన్) ప్రధాన ఆకర్షణగా నిలవనున్నారు.
ఈ టోర్నీ ప్రత్యేకత ఏమిటంటే.. ప్రొఫెషనల్ ఛాంపియన్‌షిప్‌తో పాటు ప్రతి రౌండ్‌లోనూ ప్రొ-యామ్ (Pro-Am) పోటీలను నిర్వహిస్తున్నారు. ప్రతి ప్రొ-యామ్ జట్టులో ఒక ప్రొఫెషనల్, ఒక అమెచ్యూర్ ఆటగాడు ఉంటారు. అమెచ్యూర్లు 'మోడిఫైడ్ స్క్రాంబుల్' ఫార్మాట్‌లో ఆడగా.. ప్రొఫెషనల్స్ స్ట్రోక్ ప్లే ఫార్మాట్‌లో ప్రతిభ చూపుతారు. ప్రొఫెషనల్స్ సాధించే స్కోర్లు మెయిన్ లీడర్‌బోర్డ్‌తో పాటు ప్రొ-యామ్ ఛాంపియన్‌షిప్‌కు కూడా లెక్కిస్తారు. ప్రతి రౌండ్ ముగింపులో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన మొదటి మూడు ప్రొ-యామ్ జట్లకు బహుమతులు అందజేస్తారు.
ఇవి కూడా చదవండి:
ప్రేమానంద్ ఆశ్రమానికి వెళ్లేందుకు కోహ్లీకి రూ.5 కోట్లు.. క్లారిటీ
హర్మన్-స్మృతి మధ్య విభేదాలు? కారణం అదేనా..
మనం గెలవడం కొందరికి ఇష్టం లేదు.. అర్జెంటీనా ఏకతాటిపై రావాలి: మెస్సి