భారత్‌పై చరిత్రాత్మక విజయం.. ఐర్లాండ్ కోచ్ సంచలన నిర్ణయం
ABN , Publish Date - Jun 29 , 2026 | 05:47 PM
ప్రపంచ ఛాంపియన్ భారత జట్టుపై టీ20 సిరీస్‌ను 2-0తో క్లీన్‌స్వీప్ చేసి చారిత్రాత్మక విజయంతో ఊపుమీదున్న ఐర్లాండ్ క్రికెట్‌లో ఒక అనూహ్య పరిణామం చోటుచేసుకుంది.
స్పోర్ట్స్ డెస్క్: ప్రపంచ ఛాంపియన్ భారత జట్టుపై టీ20 సిరీస్‌ను 2-0తో క్లీన్‌స్వీప్ చేసి చారిత్రాత్మక విజయంతో ఊపుమీదున్న ఐర్లాండ్ క్రికెట్‌లో ఒక అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. భారత్‌తో జరిగిన రెండో టీ20లో ఒక పరుగు తేడాతో ఉత్కంఠ విజయం సాధించి సిరీస్ కైవసం చేసుకున్న 24 గంటల వ్యవధిలోనే.. ఆ జట్టు ప్రధాన కోచ్ హెన్రిచ్ మలాన్ తన పదవికి రాజీనామా చేశారు.
నాలుగున్నరేళ్ల పాటు జట్టుకు అద్భుతమైన సేవలు అందించిన ఈ దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్.. ఇకపై కొత్త కోచ్ బాధ్యతలు చేపడితే బాగుంటుందని భావించి ఆటగాళ్లకు, సిబ్బందికి తన నిర్ణయాన్ని వెల్లడించారు. నిజానికి ఆయన ఒప్పందం 2027 వరకు ఉన్నప్పటికీ, ముందే తప్పుకోవడం గమనార్హం. మలాన్ పర్యవేక్షణలో ఐర్లాండ్ క్రికెట్ స్వర్ణయుగాన్ని చూసింది. వరుసగా మూడు టీ20 ప్రపంచకప్‌లకు అర్హత సాధించడంతో పాటు టెస్ట్ హోదా వచ్చాక అఫ్గానిస్థాన్, జింబాబ్వేలపై చరిత్రాత్మక టెస్ట్ విజయాలను నమోదు చేసింది.
'ఈ ఆటగాళ్లు, సిబ్బందితో కలిసి పనిచేయడం నాకు దక్కిన గొప్ప గౌరవం. మెల్‌బోర్న్‌లో ఇంగ్లండ్‌పై సాధించిన ప్రపంచకప్ విజయం, అబుదాబిలో అఫ్గాన్‌పై తొలి టెస్టు గెలుపు, తాజాగా భారత్‌పై సాధించిన చారిత్రాత్మక టీ20 సిరీస్ విజయం ఎప్పటికీ గుర్తుండిపోతాయి. వచ్చే ఏడాది జరగబోయే వన్డే ప్రపంచకప్ క్వాలిఫైయర్స్‌ను దృష్టిలో ఉంచుకుని కొత్త కోచ్‌కు తగిన సమయం ఇవ్వడానికే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను' అని మలాన్ భావోద్వేగ ప్రకటన విడుదల చేశారు.
క్రికెట్ ఐర్లాండ్ హై-పెర్ఫార్మెన్స్ డైరెక్టర్ గ్రేమ్ వెస్ట్.. మలాన్ సేవలను కొనియాడారు. కాగా, మలాన్ స్థానంలో ఐర్లాండ్ మాజీ దిగ్గజ ఆటగాడు గ్యారీ విల్సన్‌ను కొత్త హెడ్ కోచ్‌గా బోర్డు తక్షణమే నియమించింది. ఆగస్టులో అఫ్గానిస్తాన్‌తో జరిగే వన్డే సిరీస్ నుంచి విల్సన్ బాధ్యతలు స్వీకరించనున్నారు.
ఇవి కూడా చదవండి:
హర్మన్‌ప్రీత్ కెప్టెన్సీపై సెలెక్టర్లదే తుది నిర్ణయం: టీమిండియా హెడ్ కోచ్
వైభవ్ సూర్యవంశీని ఆడించకపోవడం సరైన నిర్ణయమే: అంబటి రాయుడు