అయోధ్య విరాళాల కేసు.. నిందితులకు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ
ABN , Publish Date - Jun 29 , 2026 | 05:13 PM
అయోధ్య రామాలయ విరాళాల దుర్వినియోగం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో అరెస్టైన ఎనిమిది మంది నిందితులకు ప్రత్యేక అవినీతి నిరోధక న్యాయస్థానం 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది.
ఇంటర్నెట్ డెస్క్: అయోధ్య రామాలయ విరాళాల దుర్వినియోగం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో అరెస్టైన ఎనిమిది మంది నిందితులకు ప్రత్యేక అవినీతి నిరోధక న్యాయస్థానం 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. దీంతో వారు జులై 13 వరకు జైలులోనే ఉండనున్నారు. దర్యాప్తు ఇంకా కొనసాగుతున్నందున నిందితులను జ్యుడీషియల్ కస్టడీలో ఉంచాల్సిన అవసరముందని పోలీసులు కోర్టుకు వివరించడంతో.. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది న్యాయస్థానం.
ఈ కేసులో రామశంకర్ అలియాస్ తిన్నూ యాదవ్ సహా అవినాశ్ శుక్లా, అనుకల్ప్ మిశ్రా, లవ్‌కుశ్ మిశ్రా, మనీశ్ కుమార్ యాదవ్, కరుణేశ్ పాండే, రామ్‌శంకర్ మిశ్రా, సుభాశ్ శ్రీవాస్తవ్‌లు నిందితులుగా ఉన్నారు. వీరంతా రామాలయానికి వచ్చిన విరాళాల నగదు, విలువైన వస్తువుల లెక్కింపు, నిర్వహణ బాధ్యతల్లో పనిచేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఇప్పటికే నిందితుల ఇళ్లలో సోదాలు నిర్వహించిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్(ఎస్‌ఐటీ).. సుమారు రూ.79.85 లక్షల నగదును స్వాధీనం చేసుకుంది. నిందితులు ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో వారి ఆర్థిక లావాదేవీలు, బ్యాంకు అకౌంట్లు, ఆస్తుల వివరాలను అధికారులు తనిఖీ చేస్తున్నారు. ఈ కేసులో కొందరు బ్యాంకు ఉద్యోగుల పాత్ర కూడా ఉందనే అనుమానంతో ఆ కోణంలోనూ దర్యాప్తు చేపట్టినట్టు తెలుస్తోంది. దీంతో మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
ఇదిలా ఉండగా.. ఈ వ్యవహారంపై సీబీఐతో విచారణ జరిపించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు తక్షణ విచారణకు నిరాకరించింది. ముందుగా పిటిషన్ కాపీని రిజిస్ట్రీకి పంపాలని ధర్మాసనం ఆదేశించింది. కాగా.. ప్రస్తుతం ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. సమాజ్‌వాదీ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు యోగి ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. మరోవైపు, దోషులపై కఠిన చర్యలు తప్పవన్న రాష్ట్ర ప్రభుత్వం.. ప్రతిపక్షాలు రాజకీయ లబ్ధి కోసం కావాలనే ఈ అంశంపై అనవసర రచ్చ చేస్తున్నారని ఆరోపిస్తోంది.
ఇవీ చదవండి:
కేతన్ మర్డర్ కేసు.. అరగంట ముందు ప్రియుడితో 'సీక్రెట్ కాల్'!
'అయోధ్య విరాళాల కేసు నిందితుల తరఫున ఎవరూ వాదించొద్దు'