Share News

పాక్ క్రికెట్‌లో పెను మార్పులు.. షాహీన్ అఫ్రిది, నసీమ్‌లపై వేటు!

ABN , Publish Date - Jun 29 , 2026 | 05:07 PM

పాకిస్థాన్ క్రికెట్ బోర్డు మరికొద్ది రోజుల్లో వెళ్లనున్న వెస్టిండీస్ పర్యటన విషయంలో సంచలన నిర్ణయాలు తీసుకుంది. జులైలో విండీస్‌తో జరగబోయే రెండు టెస్టుల సిరీస్ కోసం పాక్ సెలెక్టర్లు జట్టు పేస్ విభాగాన్ని పూర్తిగా ప్రక్షాళన చేశారు.

పాక్ క్రికెట్‌లో పెను మార్పులు.. షాహీన్ అఫ్రిది, నసీమ్‌లపై వేటు!
Pakistan Test squad

స్పోర్ట్స్ డెస్క్: పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) మరికొద్ది రోజుల్లో వెళ్లనున్న వెస్టిండీస్ పర్యటన విషయంలో సంచలన నిర్ణయాలు తీసుకుంది. జులైలో విండీస్‌తో జరగబోయే రెండు టెస్టుల సిరీస్ కోసం పాక్ సెలెక్టర్లు జట్టు పేస్ విభాగాన్ని పూర్తిగా ప్రక్షాళన చేశారు. స్టార్ బౌలర్లు షాహీన్ షా అఫ్రిది, నసీమ్ షా, హసన్ అలీలతో పాటు సీనియర్ స్పిన్నర్ నౌమాన్ అలీపై వేటు వేశారు. రెండు నెలల క్రితం బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో పాక్ ఘోర పరాజయం పాలైన నేపథ్యంలో సెలెక్షన్ కమిటీ ఈ కఠిన నిర్ణయం తీసుకుందని సమాచారం.


సీనియర్ సెలెక్టర్ ఆకిబ్ జావేద్ ప్రతిపాదించిన 17 మంది సభ్యులతో కూడిన ప్రాథమిక జట్టుకు పీసీబీ చైర్మన్ మోసిన్‌ నఖ్వీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. పాక్ క్రికెట్ ప్రయోజనాల దృష్ట్యా ఎలాంటి నిర్ణయాలైనా తీసుకోవచ్చని నఖ్వి సెలెక్టర్లకు పూర్తి స్వేచ్ఛనిచ్చారు. సరికొత్త వ్యూహాలతో బరిలోకి దిగుతున్న పాక్ జట్టులో సీనియర్ పేసర్లు మహ్మద్ అబ్బాస్, మహ్మద్ అలీ మళ్లీ పునరాగమనం చేశారు. వీరితో పాటు ఖుర్రమ్ షెహజాద్, యువ ఆల్‌రౌండర్ ఆమీర్ జమాల్ పేస్ దళంలో చేరనున్నారు. కాగా, జట్టు నుంచి తప్పించిన నసీమ్ షా తమ్ముడు, 20 ఏళ్ల అన్‌క్యాప్డ్ ప్లేయర్ ఉబైద్ షాకు సెలెక్టర్లు తొలిసారి జాతీయ జట్టులో అవకాశం కల్పించడం విశేషం.


షాహీన్, నసీమ్ వంటి బౌలర్లు వైట్ బాల్ క్రికెట్‌కే పరిమితమైతే బాగుంటుందని మేనేజ్‌మెంట్ భావిస్తోంది. పాక్ జట్టు జూలై 25 నుంచి ట్రినిడాడ్‌లోని బ్రెయిన్ లారా క్రికెట్ అకాడమీలో వెస్టిండీస్‌తో తొలి టెస్ట్ ఆడనుంది. ఆ తర్వాత ఆగస్టు 2 నుంచి పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌లో రెండో టెస్ట్ ప్రారంభమవుతుంది. ఈ విండీస్ పర్యటన ముగిసిన వెంటనే పాకిస్థాన్ జట్టు ఇంగ్లండ్‌తో మూడు టెస్టుల సిరీస్ కోసం బయలుదేరుతుంది. దీనికి సంబంధించి కూడా ఈ వారంలోనే పీసీబీ అధికారికంగా తుది జట్టును ప్రకటించనుంది.


ఇవి కూడా చదవండి:

హర్మన్‌ప్రీత్ కెప్టెన్సీపై సెలెక్టర్లదే తుది నిర్ణయం: టీమిండియా హెడ్ కోచ్

వైభవ్ సూర్యవంశీని ఆడించకపోవడం సరైన నిర్ణయమే: అంబటి రాయుడు

Updated Date - Jun 29 , 2026 | 05:07 PM