Share News

భారత్ టెస్టు చరిత్రలో చెత్త భాగస్వామ్యం.. 91 బంతుల్లో 12 పరుగులే!

ABN , Publish Date - Nov 28 , 2026 | 03:36 PM

న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టు రెండో రోజు ఆటలో టీమిండియా బ్యాటింగ్ లైనప్ ఘోరంగా తడబడింది. ఈ క్రమంలో ఓ చెత్త రికార్డు కూడా నమోదైంది.

భారత్ టెస్టు చరిత్రలో చెత్త భాగస్వామ్యం.. 91 బంతుల్లో 12 పరుగులే!
India Worst Test Partnership

స్పోర్ట్స్ డెస్క్: న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టు రెండో రోజు ఆటలో టీమిండియా బ్యాటింగ్ లైనప్ ఘోరంగా తడబడింది. తొలి ఇన్నింగ్స్‌లో కివీస్ జట్టును 356 పరుగులకు కట్టడి చేసినప్పటికీ, ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన భారత్ ఆట ముగిసే సమయానికి 46 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 116 పరుగులు మాత్రమే చేసింది. ఫాలో-ఆన్ తప్పించుకోవాలంటే భారత్ ఇంకా 41 పరుగులు చేయాల్సి ఉంది.


భారత ఇన్నింగ్స్‌లో యశస్వి జైస్వాల్ (0) తొలి ఓవర్లోనే పెవిలియన్ చేరగా, దేవదత్ పడిక్కల్ (21), శుభ్‌మన్ గిల్ (17), రిషభ్ పంత్ (23), కేఎల్ రాహుల్ (25) వరుసగా వికెట్లు కోల్పోయారు. 104/5 వద్ద క్రీజులోకి వచ్చిన ధ్రువ్ జురెల్ (7 నాటౌట్), వాషింగ్టన్ సుందర్ (10) ఆరో వికెట్‌కు 91 బంతులు ఆడి కేవలం 12 పరుగులే జోడించారు. తద్వారా టెస్టు ఇన్నింగ్స్‌లో టీమిండియా తరఫున ఏ వికెట్‌కైనా రన్‌రేటు పరంగా అత్యల్ప భాగస్వామ్యం నెలకొల్పిన జోడీగా చెత్త రికార్డు మూటగట్టుకున్నారు. 0.79 రన్‌రేట్‌తో సాగిన ఈ భాగస్వామ్యం.. కనీసం 90 బంతులు ఎదుర్కొన్న భారత టెస్టు భాగస్వామ్యాల్లో అత్యంత తక్కువ రన్‌రేట్ జోడీగా నిలిచింది.


1999లో ఆస్ట్రేలియాపై సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్ (1.13 రన్‌రేట్‌తో 17 పరుగులు) పేరిట ఉన్న చెత్త రికార్డును తాజాగా ధ్రువ్, వాషింగ్టన్ జోడీ అధిగమించింది. అయితే, శనివారం నాటి రెండో రోజు ఆట పూర్తయ్యేసరికి వాషింగ్టన్ సుందర్.. నాథన్‌ స్మిత్‌ బౌలింగ్‌లో అవుటయ్యాడు. మొత్తంగా అతడు 60 బంతులు ఎదుర్కొని కేవలం 10 పరుగులు చేసి నిష్క్రమించాడు. ధ్రువ్‌ జురెల్‌ 45 బంతుల్లో ఓ ఫోర్‌ బాది ఏడు పరుగులతో అజేయంగా నిలిచాడు. అంతకుముందు కివీస్ తొలి ఇన్నింగ్స్‌లో టామ్ బ్లండెల్ (89), గ్లెన్ ఫిలిప్స్ (36), డారిల్ మిచెల్ (31), డెవాన్ కాన్వే (31) రాణించగా, భారత పేసర్ ఆకాశ్ దీప్ 5 వికెట్లతో సత్తా చాటాడు. హేగ్లీ ఓవల్ మైదానంలో ఐదు వికెట్ల ఘనత సాధించిన తొలి భారత బౌలర్‌గా ఆకాశ్ నిలిచాడు.


టెస్ట్ ఇన్నింగ్స్‌లో భారత్ తరఫున ఏ వికెట్‌కైనా అత్యల్ప భాగస్వామ్యాల రన్‌రేట్ (కనీసం 90 బంతులు):

  • 0.79 - ధ్రువ్ జూరెల్-వాషింగ్టన్ సుందర్ vs న్యూజిలాండ్, క్రైస్ట్‌చర్చ్, 2026 (91 బంతుల్లో 12 పరుగులు, 6వ వికెట్),

  • 1.13 - రాహుల్ ద్రవిడ్-సచిన్ టెండూల్కర్ vs ఆస్ట్రేలియా, అడిలైడ్, 1999 (90 బంతుల్లో 17 పరుగులు, 4వ వికెట్)

  • 1.15 - రాహుల్ ద్రవిడ్-సచిన్ టెండూల్కర్ vs ఇంగ్లండ్, అహ్మదాబాద్, 2001 (114 బంతుల్లో 22 పరుగులు, 3వ వికెట్)

  • 1.17 - రాహుల్ ద్రవిడ్-ఇర్ఫాన్ పఠాన్ vs ఆస్ట్రేలియా, బెంగళూరు, 2004 (164 బంతుల్లో 32 పరుగులు, 7వ వికెట్)

  • 1.18 - రాహుల్ ద్రవిడ్-వీవీఎస్ లక్ష్మణ్ vs వెస్టిండీస్, కింగ్‌స్టన్, 2006 (157 బంతుల్లో 31 పరుగులు, 3వ వికెట్)


ఇవి కూడా చదవండి:

వాషింగ్టన్ రీగన్ విమానాశ్రయంలో ఢీకొన్న రెండు విమానాల రెక్కలు.. వీడియో వైరల్

బురఖాతో ముఖాన్ని పూర్తిగా కప్పుకోవడంపై ఇటలీలో ఆంక్షలు.. పార్లమెంటు ఆమోదం

Updated Date - Nov 28 , 2026 | 03:47 PM