అదంతా ఫేక్.. నెట్టింట్లో కలకలం రేపిన భారత్-పాక్ ఫైటింగ్ వీడియో!
ABN , Publish Date - Jun 15 , 2026 | 01:17 PM
మహిళల టీ20 ప్రపంచకప్2026లో భాగంగా నిన్న జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై 64 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. ఈ హై వోల్టేజ్ మ్యాచ్ అనంతరం ఒక వివాదాస్పద వీడియో సోషల్ మీడియాలో తీవ్ర కలకలం రేపింది.
స్పోర్ట్స్ డెస్క్: ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్2026లో భాగంగా నిన్న (ఆదివారం) జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై 64 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. ఈ హై వోల్టేజ్ మ్యాచ్ అనంతరం ఒక వివాదాస్పద వీడియో సోషల్ మీడియాలో తీవ్ర కలకలం రేపింది. మైదానం మధ్యలో ఒక పాకిస్థాన్ ప్లేయర్, భారత బ్యాటర్‌పై దాడికి దిగినట్లు మిగిలిన ఆటగాళ్లు వారిని విడదీస్తున్నట్లు ఆ వీడియోలో ఉంది. అయితే భారత్, పాక్ అభిమానుల మధ్య తీవ్ర చర్చకు దారితీసిన ఈ వీడియో పూర్తిగా ఫేక్ అని తేలింది. ఏఐ టెక్నాలజీని ఉపయోగించి ఎవరో ఆకతాయిలు సృష్టించిన ఈ తప్పుడు వీడియో నెటిజన్లను తీవ్ర గందరగోళానికి గురిచేసింది. మైదానంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగలేదని క్రీడా వర్గాలు స్పష్టం చేశాయి.
ఇక మ్యాచ్ విషయానికొస్తే.. గతంలో మాదిరిగా ఈసారి కూడా భారత్, పాక్ ప్లేయర్లు కరచాలనం చేసుకోలేదు. అలానే బర్మింగ్‌హామ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌కు రికార్డు స్థాయిలో 18 వేలకు పైగా మంది ప్రేక్షకుల హాజరయ్యారు. మహిళల ప్రపంచ కప్‌లో ఓ గ్రూప్ స్టేజ్ మ్యాచ్‌ను చూసేందుకు ఈ స్థాయిలో రావడం ఇదే తొలిసారి. గతంలో ఏ గ్రూప్ స్టేజ్ మ్యాచ్‌కి కూడా ఇంత భారీ సంఖ్యలో ప్రేక్షకులు హాజరు కాలేదు.
ఈ హై హోల్టేజ్ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత 20 ఓవర్లకు 6 వికెట్లు కోల్పోయి170 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో పాకిస్థాన్ 106 పరుగులకే ఆలౌటైంది. టీమిండియా ఇన్నింగ్స్ లో వైస్ కెప్టెన్ స్మృతి మంధాన అద్భుత హాఫ్ సెంచరీ, కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్‌తో కలిసి చేసిన 91 పరుగుల భాగస్వామ్యం మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాయి. బౌలింగ్‌లో దీప్తి శర్మ 5 వికెట్లతో పాకిస్థాన్ పతనాన్ని శాసించింది.
ఇవి కూడా చదవండి:
టీ20 ప్రపంచ కప్‌లో చరిత్ర సృష్టించిన దీప్తి శర్మ
IND vs SL: మరోసారి విఫలమైన వైభవ్ సూర్యవంశీ!