నేటి నుంచే ఐసీసీ ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్.. పాక్‌తో భారత్ పోరు.. ఎప్పుడంటే?
ABN , Publish Date - Jun 12 , 2026 | 01:18 PM
మహిళల టీ20 ప్రపంచ కప్ 2026 నేటి నుంచి ప్రారంభం కానుంది. ఈ మెగా టోర్నీలో భారత జట్టు తన తొలి మ్యాచ్‌లో దాయాది పాకిస్థాన్‌తో తలపడనుంది. మరి ఆ మ్యాచ్ ఎప్పుడు? టీమ్ఇండియా షెడ్యూల్ ఏంటి? ఓసారి చూద్దాం...
ఇంటర్నెట్ డెస్క్: ఐసీసీ ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ 2026కు కౌంట్‌డౌన్ మొదలైంది. నేడు సాయంత్రం 5:30(భారత కాలమానం ప్రకారం రాత్రి 11:00) గంటలకు ఈ టోర్నీ అట్టహాసంగా ప్రారంభం కానుంది. మహిళల క్రికెట్‌కు అంతకంతకు ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో క్రికెట్ ప్రేమికులకు పూనకాలు తెప్పించేలా ఈ మెగా టోర్నీ సాగనుంది. పాకిస్థాన్‌తో జరిగే హైఓల్టేజ్ మ్యాచ్‌తో భారత్ తన టైటిల్ వేటను ప్రారంభించబోతోంది. జూన్ 14న జరిగే ఈ మ్యాచ్‌కు బర్మింగ్‌హామ్(ఇంగ్లండ్) ఆతిథ్యమివ్వనుంది.
నేటి(శుక్రవారం) నుంచి జులై 5 వరకు ఇంగ్లండ్, వేల్స్‌లో జరగనున్న ఈ మెగా టోర్నమెంట్‌లో మొత్తం 12 జట్లు తలపడుతున్నాయి. వీటిని రెండు గ్రూపులుగా విభజించారు. ఒక్కో గ్రూప్‌లో 6 జట్లు ఉంటాయి. గ్రూప్ స్టేజ్‌లో ప్రతి టీమ్ మిగిలిన జట్లతో ఐదు మ్యాచ్‌లు ఆడుతుంది. ఆ తర్వాత రెండు గ్రూపుల నుంచి టాప్-2 లో నిలిచిన జట్లు సెమీఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. ఇక.. టీమ్ఇండియా విషయానికొస్తే.. భారత్ గ్రూప్ వన్‌లో ఉంది. ఇదే గ్రూప్‌లోనే బలమైన ఆస్ట్రేలియాతో పాటు పాకిస్థాన్, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్, నెదర్లాండ్స్ జట్లు ఉన్నాయి.
ఇటీవల వన్డే ప్రపంచ కప్‌ను గెలుచుకుని ఫుల్ జోష్‌లో ఉన్న హర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలోని ఉమెన్ ఇన్ బ్లూ.. ఇప్పుడు పొట్టి ఫార్మాట్‌లోనూ హిస్టరీ క్రియేట్ చేయాలని చూస్తోంది. ఇప్పటివరకు భారత మహిళల జట్టు ఐదుసార్లు సెమీఫైనల్‌కు చేరినప్పటికీ.. ఒక్కసారీ పొట్టి కప్‌ను అందుకోలేకపోయారు. దీంతో ఈసారి ఎలాగైనా కప్ కొట్టి తీరాలనే కసిమీద అమ్మాయిలున్నారు.

ఇవీ చదవండి:
భారత షూటింగ్ దిగ్గజం జస్పాల్ రాణా కన్నుమూత