Share News

అమ్మాయిలూ.. ఈసారి వదలొద్దు!

ABN , Publish Date - Jun 12 , 2026 | 05:12 AM

క్రికెట్‌ ప్రపంచాన్ని ఉర్రూతలూగించే మహిళల మహా సంగ్రామానికి వేళైంది. వేసవిలో ఐపీఎల్‌ ధనాధన్‌తో మురిసిపోయిన అభిమానులకు ఇక మరో పసందైన విశ్వపోరు. నేటి నుంచే...

అమ్మాయిలూ..  ఈసారి వదలొద్దు!

నేటి మ్యాచ్‌

ఇంగ్లండ్‌ X శ్రీలంక

రా.11 గం. నుంచి స్టార్‌స్పోర్ట్స్‌లో...

అమ్మాయిలూ.. ఈసారి వదలొద్దు!

భారత్‌ను ఊరిస్తున్న కప్‌

టీ20 వరల్డ్‌కప్‌

ఆధిపత్యం కోసం ఆసీస్‌

టైటిల్‌ను

కాపాడుకునేందుకు కివీస్‌

14న పాక్‌తో టీమిండియా తొలి మ్యాచ్‌

క్రికెట్‌ ప్రపంచాన్ని ఉర్రూతలూగించే మహిళల మహా సంగ్రామానికి వేళైంది. వేసవిలో ఐపీఎల్‌ ధనాధన్‌తో మురిసిపోయిన అభిమానులకు ఇక మరో పసందైన విశ్వపోరు. నేటి నుంచే మహిళల టీ20 వరల్డ్‌కప్‌. ఇది కేవలం ఒక టోర్నమెంట్‌ మాత్రమే కాదు.. తమ కలలను సాకారం చేసుకునేందుకు ప్రతీ క్రికెటర్‌ చేసే పోరాటం. ముఖ్యంగా భారత క్రికెట్‌ జట్టును ఈ టైటిల్‌ ఎన్నాళ్లుగానో ఊరిస్తోంది. గతేడాదే మన జట్టు వన్డే వరల్డ్‌క్‌పను సగర్వంగా అందుకుంది. ఇక తదుపరి లక్ష్యం.. పొట్టి ప్రపంచకప్పే కావాలని కోట్లాది భారతీయులు ఆశిస్తున్నారు. అయితే అత్యుత్తమ జట్లు పోటీపడుతున్న ఈ విశ్వకప్‌ అంతిమంగా ఎవరి చెంతకు చేరబోతున్నదనేది ఆసక్తిగా వేచి చూడాల్సిందే..

లండన్‌: ఇంగ్లండ్‌ ఆతిథ్యమిస్తున్న మహిళల టీ20 వరల్డ్‌కప్‌ కోసం అంతా సిద్ధమైంది. రెండేళ్లకోసారి జరిగే ఈ విశ్వపోరు ఈనెల 12 నుంచి జూలై 5 వరకు జరుగనుంది. వరల్డ్‌కప్‌ కలను నెరవేర్చుకునేందుకు భారత జట్టు బరిలోకి దిగనుండగా.. న్యూజిలాండ్‌ తమ టైటిల్‌ను నిలబెట్టుకునే ప్రయత్నంలో ఉంది. ఆస్ట్రేలియా మాత్రం రికార్డు స్థాయిలో ఏడో టైటిల్‌పై కన్నేసింది. ఆతిథ్య ఇంగ్లండ్‌ 2009 అరంగేట్ర టోర్నీలో మాత్రమే విజేత కాగలిగింది. అప్పటి నుంచి మరో టైటిల్‌ ఈ జట్టు ఖాతాలో చేరడం లేదు. ఈసారి పటిష్టంగా కనిపిస్తున్న దక్షిణాఫ్రికా ప్రత్యర్థులకు ఏమేరకు సవాల్‌ విసరగలుగుతుందో వేచిచూడాల్సిందే. శుక్రవారం బర్మింగ్‌హామ్‌లో జరిగే ఆరంభ మ్యాచ్‌లో ఆతిథ్య ఇంగ్లండ్‌ జట్టు శ్రీలంకతో ఆడనుంది. భారత్‌ మాత్రం చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో ఈనెల 14న తొలి మ్యాచ్‌లో తలపడుతుంది. ఓవరాల్‌గా 9 టోర్నీల్లో ఆసీస్‌ 6 సార్లు గెలవడం విశేషం. ఇంగ్లండ్‌, విండీస్‌, కివీస్‌ ఒక్కో టైటిల్‌ అందుకున్నాయి.


భారత్‌కు కఠిన సవాల్‌

గతేడాది తొలి వన్డే వరల్డ్‌కప్‌ విజయంతో ఊపు మీదున్న భారత మహిళల జట్టుకు ఈ టోర్నీలో గట్టి సవాల్‌ ఎదురుకానుంది. ఇప్పటికీ ఫేవరెట్‌గానే పరిగణిస్తున్నా.. గ్రూప్‌ ఆఫ్‌ డెత్‌గా భావించే .‘ఎ’లో ఆసీస్‌, దక్షిణాఫ్రికా జట్ల నుంచి ప్రమాదం పొంచి ఉంది. ఎందుకంటే రెండు జట్లు మాత్రమే సెమీ్‌సకు వెళ్లగలవు. దీనికి తోడు దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్‌ల్లో తమ చివరి టీ20 సిరీ్‌సలను భారత్‌ కోల్పోయింది. డాషింగ్‌ బ్యాటర్‌ షఫాలీకి జతగా ఇంగ్లండ్‌ పరిస్థితుల్లో మెరుగ్గా రాణించే స్మృతి మంధాన పవర్‌ప్లేలో కీలకం కానున్నారు. కెప్టెన్‌ హర్మన్‌ అనుభవం, జెమీమా, రిచాల దూకుడైన బ్యాటింగ్‌ జట్టుకు బలంగా చెప్పవచ్చు. దీప్తి శర్మ, రాధా యాదవ్‌, శ్రీచరణి, శ్రేయాంక పాటిల్‌ల స్పిన్‌ బౌలింగ్‌ దళం అక్కడి పిచ్‌లపై ప్రభావం చూపే అవకాశం ఉంది. అరుంధతి, రేణుకా సింగ్‌, క్రాంతి తమ పేస్‌లతో ఇబ్బందిపెట్టగలరు. ఏదిఏమైనా వన్డే వరల్డ్‌కప్‌ గెలిచిన జట్టులోని సభ్యులంతా ఈ టోర్నీలోనూ బరిలోకి దిగుతుండడంతో... మనమ్మాయిలు మరోసారి ఒత్తిడిని అధిగమించి పొట్టి పోరులోనూ విజేతగా నిలుస్తారని ఆశిద్దాం..

ఇదీ ఫార్మాట్‌

టోర్నీలో మొత్తం 12 జట్లు పాల్గొంటున్నాయి. వీటిని రెండు గ్రూపులుగా విభజించారు. గ్రూప్‌ 1లో భారత్‌, ఆసీస్‌, బంగ్లాదేశ్‌, నెదర్లాండ్స్‌, పాకిస్థాన్‌, దక్షిణాఫ్రికా జట్లు ఉన్నాయి. ఇక గ్రూప్‌ 2లో ఇంగ్లండ్‌, ఐర్లాండ్‌, న్యూజిలాండ్‌, స్కాట్లాండ్‌, శ్రీలంక, విండీస్‌ జట్లున్నాయి. ఒక్కో గ్రూప్‌లో ప్రతీ జట్టు మరో జట్టుతో ఒక్కో మ్యాచ్‌ ఆడుతుంది. తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీ్‌సకు అర్హత సాధిస్తాయి.

భారత్‌ మ్యాచ్‌ల షెడ్యూల్‌

ఎప్పుడు ప్రత్యర్థి వేదిక

జూన్‌ 14 పాకిస్థాన్‌ బర్మింగ్‌హామ్‌

జూన్‌ 17 నెదర్లాండ్స్‌ లీడ్స్‌

జూన్‌ 21 దక్షిణాఫ్రికా మాంచెస్టర్‌

జూన్‌ 25 బంగ్లాదేశ్‌ మాంచెస్టర్‌

జూన్‌ 28 ఆస్ర్టేలియా లండన్‌

మ్యాచ్‌లన్నీ రాత్రి 7 గంటల నుంచి..

ఇవి కూడా చదవండి..

పెరిగిన క్రూడాయిల్ ధరలు.. సూచీలకు నష్టాలు..

మాతో ఉంటారా.. అభిషేక్‌తో ఉంటారా.. మమతకు కల్యాణ్ బెనర్జీ అల్టిమేటం..

Updated Date - Jun 12 , 2026 | 05:12 AM