Share News

పాకిస్థాన్, ఇంగ్లండ్ ఏకైక టెస్టు మ్యాచ్ రద్దు..!

ABN , Publish Date - Jun 22 , 2026 | 02:44 PM

ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు పాకిస్థాన్‌కు షాకిచ్చింది. వచ్చే ఏడాది పాక్‌తో ఆడాల్సిన ఏకైక టెస్టు మ్యాచ్‌ను ఈసీబీ రద్దు చేసుకున్నట్లు సమాచారం.

పాకిస్థాన్, ఇంగ్లండ్ ఏకైక టెస్టు మ్యాచ్ రద్దు..!
ECB vs Pakistan Test cancellation

స్పోర్ట్స్ డెస్క్: ఐసీసీ మహిళల టీ20 ప్రపంచ కప్ 2026 టోర్నీ నుంచి పాకిస్థాన్ ఎలిమినేట్ కావడంతో పీసీబీ(పాకిస్థాన్ క్రికెట్ బోర్డు)కు బిగ్ షాక్ తగిలినట్లైంది. ఈ బాధలో ఉన్న ఆ బోర్డుకు ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు (ఈసీబీ) కూడా షాకిచ్చింది. త్వరలో పాక్‌తో ఆడాల్సిన ఏకైక టెస్టు మ్యాచ్‌ను ఈసీబీ రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఆస్ట్రేలియాతో ప్రతిష్ఠాత్మక యాషెస్‌ సిరీస్‌2027కు ముందు ఇంగ్లండ్‌, పాకిస్థాన్‌ మధ్య ఏకైక టెస్టు జరగాల్సి ఉంది.


తాజాగా ఓ అంతర్జాతీయ స్పోర్ట్స్ నివేదిక ప్రకారం.. గతంలో వచ్చే ఏడాది సమ్మర్‌లో ఏకైక టెస్టు మ్యాచ్ ఆడాలని ఇరు జట్లు కూడా చర్చించినట్లు సమాచారం. అయితే తాజాగా ఈసీబీ యూటర్న్‌ తీసుకున్నట్లు తెలుస్తోంది. పాకిస్థాన్‌ను కాదని బంగ్లాదేశ్‌తో ఈ ఏకైక టెస్టు నిర్వహించాలని నిర్ణయించుకున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. వచ్చే ఏడాది మే నెలలో ఇంగ్లండ్‌- బంగ్లాదేశ్‌ మధ్య టెస్టు నిర్వహణకు ఈసీబీ సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, ఇందుకు సంబంధించిన వేదికను మాత్రం ఇంకా నిర్ణయించలేదు.


మెరిల్‌బోన్‌ క్రికెట్‌ క్లబ్‌ (MCC)తో ఈసీబీకి ఓ ఒప్పందం ఉంది. దాని ప్రకారం ఏటా వేసవిలో లార్డ్స్‌ వేదికగా రెండు టెస్టు మ్యాచ్‌లు నిర్వహించాల్సి ఉంటుంది. ఇక ఈసారి ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ 2025-27 ఫైనల్‌ వేదికను లార్డ్స్‌ నుంచి తరలిస్తున్నారు. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్‌తో నిర్వహించే టెస్టుకు లార్డ్స్‌ను వేదికగా ఎంపిక చేయాలనే యోచనలో ఈసీబీ ఉందని టాక్. ఒకవేళ అదే నిజమైతే బంగ్లాదేశ్‌కు బంపరాఫర్‌ వచ్చినట్లేనని క్రీడా నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. బంగ్లా జట్టు చివరగా 2010లో ఇంగ్లండ్‌లో పర్యటించింది. తాజాగా మరోసారి ఏకైక టెస్టు కోసం ఇంగ్లండ్‌కు వెళ్లనుంది.


అయితే, ఈసీబీ పాకిస్థాన్‌కు ఓ ఊరట ఇచ్చింది. 2026 ఆగస్టులో ఇంగ్లండ్‌‌లో పాక్ పర్యటన యథావిధిగా కొనసాగుతుందని తెలిపింది. ఇందులో భాగంగా హెడింగ్లీ, లార్డ్స్‌, ఎడ్జ్‌బాస్టన్‌ వేదికలుగా ఇరుజట్ల మధ్య ఆగస్టు19 నుంచి ఈ సిరీస్‌ ప్రారంభం కానుంది. కాగా 2020 తర్వాత పాకిస్థాన్‌ ఇంగ్లండ్‌ పర్యటనకు వెళ్లడం ఇదే తొలిసారి.


ఇవి కూడా చదవండి:

ఫిఫా ప్రపంచ కప్: లాకర్ రూమ్‌లో ఇరాన్ జట్టు నోట్!

టెస్టు క్రికెట్‌ రీఎంట్రీపై విరాట్ కోహ్లీ రియాక్షన్ ఇదే!

Updated Date - Jun 22 , 2026 | 02:53 PM