మెరుపు సెంచరీ.. దక్షిణాఫ్రికా బ్యాటర్ ప్రపంచ రికార్డు
ABN , Publish Date - Sep 11 , 2026 | 08:06 PM
నమీబియాతో జరుగుతున్న రెండో వన్డే మ్యాచ్‌లో సౌతాఫ్రికా ఓపెనర్ కానర్ ఎస్టర్‌హుయిజెన్ సూపర్ శతకం బాదాడు. ఈ సెంచరీతో అతడు ఓ ప్రపంచ రికార్డు నెలకొల్పాడు.
స్పోర్ట్స్ డెస్క్: ఇవాళ(శుక్రవారం) నమీబియా, సౌతాఫ్రికా మధ్య రెండో వన్డే మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో ప్రొటీస్ ఓపెనర్, వికెట్‌కీపర్ బ్యాటర్ కానర్ ఎస్టర్‌హుయిజెన్ మెరుపు శతకం చేశాడు. ఈ సెంచరీతో అతడు ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. వన్డేల్లో నమీబియాపై అత్యధిక వ్యక్తిగత స్కోర్ చేసిన వికెట్ కీపర్, బ్యాటర్‌గా కానర్ నిలిచాడు. ఎస్టర్‌హుయిజెన్‌కు ముందు ఈ రికార్డు యూఏఈకి చెందిన వ్రిత్య అరవింద్ (115*) పేరిట ఉండేది.
మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ గెలిచిన నమీబియా బౌలింగ్ ఎంచుకుంది. దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 335 పరుగులు భారీ స్కోర్‌ను చేసింది. 110 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 119 పరుగులు చేశాడు. కానర్ శతకంతో పాటు టోనీ డి జోర్జి (79) అర్ద సెంచరీతో రాణించడంతో సౌతాఫ్రికా ఈ భారీ స్కోర్ నమోదు చేసింది. ఇక నమీబియా బౌలర్లలో జాక్ బ్రసెల్ 4 వికెట్లు సాధించాడు.రూబెన్ ట్రంపెల్మాన్, జాన్ బాల్ట్ చెరో రెండు వికెట్లు సాధించగా...జాన్ నికోల్ ఒక వికెట్ తీశాడు.
అనంతరం భారీ లక్ష్య ఛేదనలో నమీబియా ఆదిలోనే చేతులెత్తేసింది. ఒక్క పరుగుకే 3 వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం 33 ఓవర్లు ముగిసే సరికి 7 వికెట్లు కోల్పోయి 133 పరుగులతో ఓటమి అంచుల్లో ఉంది. మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో తొలి వన్డే గెలిచిన దక్షిణాఫ్రికా 1-0తో ఆధిక్యంలో ఉంది. ఈ మ్యాచ్ కూడా గెలిస్తే ఆ జట్టు సిరీస్‌ను కైవసం చేసుకుంటుంది. ఈ సిరీస్ కోసం సౌతాఫ్రికా నమీబియాలో పర్యటిస్తోంది.
ఈ వార్తలు కూడా చదవండి
ఆర్‌డబ్ల్యూఎస్ కాంట్రాక్టర్లకు గుడ్ న్యూస్.. రూ.620 కోట్లు విడుదల చేసిన కూటమి ప్రభుత్వం..
2027 నాటికి వందశాతం అక్షరాస్యతే లక్ష్యం.. కలెక్టర్లకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం