భారత బ్యాటర్ సరికొత్త చరిత్ర.. 123 ఏళ్ల రికార్డు బ్రేక్
ABN , Publish Date - Nov 03 , 2026 | 09:59 PM
భారత బ్యాటర్ చిన్మయ్ సుతార్ చరిత్ర సృష్టించాడు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో ఆస్ట్రేలియా ఆటగాడు బిల్ పోన్స్‌ఫోర్డ్ పేరిట ఉన్న 123 ఏళ్ల ప్రపంచ రికార్డు బద్దలు కొట్టాడు.
స్పోర్ట్స్ డెస్క్: భారత బ్యాటర్ చిన్మయ్ సుతార్ చరిత్ర సృష్టించాడు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో ఆస్ట్రేలియా ఆటగాడు బిల్ పోన్స్‌ఫోర్డ్ పేరిట ఉన్న 123 ఏళ్ల ప్రపంచ రికార్డు బద్దలు కొట్టాడు. మిజోరాం జట్టు తరఫున చిన్మయ్ రంజీ ట్రోఫీ 2026-27 సీజన్ సందర్భంగా ఈ రెడ్‌బాల్ టోర్నీలో అరంగేట్రం చేశాడు. ఈ క్రమంలోనే అరంగేట్రం తర్వాత ఐదు ఇన్నింగ్స్‌లో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్‌గా చిన్మయ్ చరిత్రకెక్కాడు.
రంజీ ట్రోఫీ 2026-27సీజన్‌లో భాగంగా ఆనంద్‌లోని లాల్ బహదూర్ స్టేడియం వేదికగా మిజోరాం, అరుణాచల్ ప్రదేశ్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో 29 ఏళ్ల చిన్మయ్ సెంచరీతో మెరిశాడు. ఇవాళ(మంగళవారం) రెండో రోజు ఆట ముగిసే సమయానికి సుతార్ 232 బంతులు ఎదుర్కొని.. 135 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. 89 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఉండగానే.. చిన్మయ్ సుతార్ ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో ప్రపంచ రికార్డు సృష్టించాడు. అరంగేట్రం తర్వాత ఐదు ఇన్నింగ్స్‌లో అత్యధిక(748) పరుగులు చేసిన క్రికెటర్‌గా చరిత్ర లిఖించాడు.
ఇప్పటి వరకు ఈ రికార్డు ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్ బిల్ పోన్స్‌ఫోర్డ్(1921-1923) పేరిట ఉండేది. అతడు ఆడిన తొలి ఐదు ఫస్ట్‌క్లాస్ ఇన్నింగ్స్‌లో 724 పరుగులు చేశాడు. తాజాగా చిన్మయ్ సుతార్ 748 పైచిలుకు పరుగులతో 123 ఏళ్లుగా బిల్ పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టాడు. చిన్మయ్ తన తొలి నాలుగు ఇన్నింగ్స్‌ల్లో మణిపూర్‌పై 35, 99 పరుగులు, నాగాలాండ్‌పై అజేయంగా 400 పరుగులు, మేఘాలయపై 125 పరుగులు సాధించాడు. తాజాగా అరుణాచల్ ప్రదేశ్ పై 135 పరుగులు చేశాడు. ఇక మ్యాచ్ విషయానికొస్తే.. అరుణాచల్ ప్రదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 285 పరుగులకు ఆలౌటైంది. రెండో రోజు ఆట ముగిసేసరికి మిజోరాం మూడు వికెట్ల నష్టానికి 366 పరుగులు చేసి.. 81 పరుగుల ఆధిక్యంలో నిలిచింది.
ఇవి కూడా చదవండి:
విశాఖ కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం.. మేయర్‌గా ముక్కా శ్రావణి గెలుపు..
ఇక హర్దీప్ సింగ్ పురి ఎన్నిక ఏకగ్రీవమే!
ఇజ్రాయెల్‌కు ఆర్థిక సాయాన్ని నిలిపివేస్తాము: ట్రంప్