Share News

ఇక హర్దీప్ సింగ్ పురి ఎన్నిక ఏకగ్రీవమే!

ABN , Publish Date - Nov 03 , 2026 | 09:34 PM

రాజ్యసభ ఉపఎన్నికలో మధ్యప్రదేశ్ నుంచి బరిలో నిలిచిన కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ ఎన్నిక ఏకగ్రీవం కానుంది.

ఇక హర్దీప్ సింగ్ పురి ఎన్నిక ఏకగ్రీవమే!
Hardeep Singh Puri

ఇంటర్నెట్ డెస్క్: రాజ్యసభ ఉపఎన్నికలో మధ్యప్రదేశ్ నుంచి బరిలో నిలిచిన కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ ఎన్నిక ఏకగ్రీవం కానుంది. బరిలో నిలిచిన ఇద్దరు స్వతంత్ర అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరణకు గురికావడంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవమేనని జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ అయిన నవంబర్ 5నే ఉపఎన్నిక ఫలితాన్ని ప్రకటించనున్నట్టు సమాచారం. కేంద్ర మంత్రి ఎల్ మురుగన్ రాజీనామాతో ఈ ఉపఎన్నిక అనివార్యమైన విషయం తెలిసిందే.


స్వతంత్ర అభ్యర్థులు సాయన్న, రాజ్‌కుమార్ లొహానీల నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. రాజ్‌కుమార్ లొహానీకి కాంగ్రెస్ మద్దతు ఇస్తోంది. అంతకుమునుపు సాయన్న, లొహానీ, కాంగ్రెస్ నేత హేమంత్ కటారే మంత్రి పురి నామినేషన్ పేపర్లపై అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఫారం-26లో ఆయన సమర్పించిన అఫిడవిట్ అసంపూర్ణంగా ఉన్నందున చెల్లుబాటు కాదని చెప్పారు.


ఈ అభ్యంతరాలను పరిశీలించిన రిటర్నింగ్ అధికారి కేంద్ర మంత్రి పురి నామినేషన్ నిబంధనల ప్రకారమే ఉందని నిర్ణయించారు. ఆయన సమర్పించిన పేపర్లలో ఎలాంటి లోపాలు లేవని తేల్చారు. అయితే, ఈ నిర్ణయాన్ని కోర్టులో సవాలు చేస్తామని కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆతిఫ్ అకీల్ తెలిపారు. పురి నామినేషన్‌లో ఎన్నో తప్పులు ఉన్నప్పటికీ తిరస్కరణకు గురికాలేదని ఆరోపించారు. ఇది ప్రజాస్వామ్యంపై దాడి అని వ్యాఖ్యానించారు.


ఈ వార్తలనూ చదవండి:

పాత ఓటర్లకు కేంద్ర ఎన్నికల సంఘం బిగ్ రిలీఫ్

జమ్మూకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దాల్లాకు షాక్.. ఎంపీ రాజీనామా

Updated Date - Nov 03 , 2026 | 09:40 PM