Share News

జమ్మూకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దాల్లాకు షాక్.. ఎంపీ రాజీనామా

ABN , Publish Date - Nov 03 , 2026 | 06:43 PM

జమ్మూకశ్మీర్‌లో తాజాగా కీలక పరిణామం చోటుచేసుకుంది. అధికార పార్టీ నేషనల్ కాన్ఫరెన్స్‌కు చెందిన కీలక నేత, శ్రీనగర్ ఎంపీ ఆగా సయ్యద్ రుహుల్లా మెహ్దీ రాజీనామా చేసినట్టు ప్రకటించారు.

జమ్మూకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దాల్లాకు షాక్.. ఎంపీ రాజీనామా
NC MP Ruhulla Medhi Resignation

ఇంటర్నెట్ డెస్క్: జమ్మూకశ్మీర్‌లో తాజాగా కీలక పరిణామం చోటుచేసుకుంది. అధికార పార్టీ నేషనల్ కాన్ఫరెన్స్‌కు చెందిన కీలక నేత, శ్రీనగర్ లోక్‌సభ ఎంపీ ఆగా సయ్యద్ రుహుల్లా మెహ్దీ రాజీనామా చేసినట్టు ప్రకటించారు. పార్టీ సభ్యత్వానికీ గుడ్‌బై చెప్పానని తెలిపారు. తన తండ్రి 26వ వర్ధంతి సందర్భంగా బుడ్గామ్‌లో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ఆయన తన రాజీనామా విషయాన్ని ప్రకటించారు. దాదాపు 24 ఏళ్లుగా ఎన్‌సీలో కొనసాగుతున్న ఆయన పార్టీకి గుడ్‌బై చెప్పారు. ప్రజలను పార్టీ మోసగించడమే తన రాజీనామాకు కారణమంటూ ఆయన నాలుగు పేజీల లేఖ రాయడం కలకలానికి దారి తీసింది.


2024లో ఎన్‌సీకి మద్దతు ఇచ్చిన ప్రజల భావోద్వేగాలను పార్టీ మోసగించిందని రుహుల్లా మెహ్దీ మండిపడ్డారు. ఎన్నికల సమరం ముగిశాక పార్టీ యూటర్న్ తీసుకుందని ఆరోపించారు. చరిత్ర తాలుకు భారం జమ్మూకశ్మీర్ ప్రజలు ఇప్పటికీ మోస్తున్నారని ఆయన చెప్పారు. ఆర్టికల్ 370, 35-ఏ రద్దు కశ్మీరీల హక్కులపై దాడిగా అభివర్ణించారు. హక్కులు లేని సమాజం మనలేదని చెప్పారు. 2019లో ఆర్టికల్ 370 రద్దు ఓ అవకాశాన్ని కూడా ఇచ్చిందని ఆయన చెప్పుకొచ్చారు. పోరాటానికి, త్యాగాలు చేసేందుకు అవకాశం వచ్చిందని అన్నారు. ఇందుకు ఎన్‌సీ నాయకత్వం వహించాల్సిన సందర్భం వచ్చిందని అన్నారు.


ఈ విషయంలో ముందుండి నడిపిస్తామన్న పార్టీ హామీతో తాను ఎన్‌సీ పక్షాన నిలిచానని గుర్తు చేశారు. పార్టీతో కలిసి నడిస్తే హక్కుల పునరుద్ధరణ జరుగుతుందని విశ్వసించినట్టు చెప్పారు. కానీ తాను ఆశించినది జరగలేదని విచారం వ్యక్తం చేశారు. 2024 నాటి ఎన్నికల్లో పార్టీ కోసం విస్తృతంగా ప్రచారం చేసిన విషయాన్ని ఆయన తన లేఖలో గుర్తుచేశారు. ఎన్‌సీకి దక్కిన మద్దతు ప్రజల ఆశలను, ఆగ్రహాన్ని ప్రతిబింబించిందని చెప్పారు. కానీ ఎన్నికల వేడి తగ్గేలోపే పార్టీ యూటర్న్ తీసుకుందని ఆవేదన వ్యక్తం చేశారు. జమ్మూకశ్మీర్ ఉనికికే ముప్పు ఉన్న తరుణంలో ప్రజలను మోసగించడం తనను వ్యక్తిగతంగా బాధించిందని చెప్పారు.


ఈ అంశాలను పార్టీలో ప్రస్తావిస్తే అవమానాలు ఎదురయ్యాయని అన్నారు. పార్టీలో ఇంతకాలం నడిచే అవకాశం దక్కినందుకు ధన్యావాదాలు చెబుతూనే ఇకపై కొనసాగడం తన వల్ల కాదని అన్నారు. దేవుడి కృపతో మరో మార్గంలో ప్రజలకు సేవ చేస్తానని చెప్పారు. అయితే, మరో పార్టీలో చేరే యోచన మెహ్దీకి లేదని అక్కడి వర్గాలు చెబుతున్నాయి.


ఈ వార్తలనూ చదవండి:

డిజిటల్ వాలెట్ పేరిట భారీ స్కామ్.. ఏకంగా 1,211 కోట్లు వసూలు

రూ.21,800 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన ప్రధాని మోదీ

Updated Date - Nov 03 , 2026 | 08:45 PM