వైభవ్‌తో పాటు తల్లిదండ్రులూ విదేశీ పర్యటనకు.. బీసీసీఐ ఏర్పాట్లు
ABN , Publish Date - Jun 18 , 2026 | 05:05 PM
భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి బీసీసీఐ ప్రత్యేక సౌకర్యం కల్పించింది. ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనలకు అతడితో పాటు తల్లిదండ్రులనూ వెంట తీసుకెళ్లేందుకు అనుమతించింది. విదేశీ పర్యటనలో యువ ఆటగాడు సౌకర్యంగా ఉండేందుకు ఈ చర్యలు చేపట్టినట్లు బీసీసీఐ స్పష్టం చేసింది.
ఇంటర్నెట్ డెస్క్: భారత క్రికెట్‌లో నయా సంచలనంగా ఎదుగుతున్న వైభవ్ సూర్యవంశీకి భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ప్రత్యేక వెసులుబాటు కల్పించింది. ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనలకు ఎంపికైన ఈ యువ బ్యాటర్‌తో పాటు అతడి తల్లిదండ్రులనూ అనుమంతించింది. వారి ప్రయాణ, వసతి ఖర్చులన్నింటినీ తామే భరిస్తామని బీసీసీఐ స్పష్టం చేసింది. ఈ విషయాన్ని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా ధ్రువీకరించారు. కేవలం 15 ఏళ్ల వయసులోనే జాతీయ జట్టులో చోటు దక్కించుకున్న వైభవ్.. సీనియర్ ఆటగాళ్ల మధ్య సౌకర్యంగా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు.
'జాతీయ జట్టులో 14-15 ఏళ్ల ఆటగాడు ఉండటం చాలా అరుదు. గతంలో సచిన్ టెండూల్కర్ లాంటి ఆటగాడు చిన్న వయసులోనే భారత జట్టులోకి వచ్చాడు. ఇప్పుడు వైభవ్ కూడా అలాంటి ప్రత్యేక పరిస్థితుల్లో ఉన్నాడు. అక్కడి కొత్త వాతావరణ పరిస్థితులకు అతడు అలవాటుపడేందుకు తల్లిదండ్రుల సాన్నిహిత్యం ఉపయోగపడుతుంది' అని సైకియా వివరించారు.
ఈ ఐపీఎల్ సీజన్‌లో అద్భుత ప్రదర్శన కనబరిచిన వైభవ్.. 776 పరుగులతో ఆరెంజ్ క్యాప్ సొంతం చేసుకున్నాడు. అంతేకాకుండా 237కు పైగా స్ట్రైక్‌రేట్‌తో బ్యాటింగ్ చేసి మోస్ట్ వ్యాల్యూబుల్ ప్లేయర్, ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డులనూ సొంతం చేసుకున్నాడీ చిచ్చర పిడుగు. అతడి అద్భుత ఆటతీరును గుర్తించిన బీసీసీఐ.. భారత టీ20 జట్టులో అవకాశం కల్పించింది. కాగా.. దీనికంటే ముందు శ్రీలంకలో ప్రస్తుతం జరుగుతున్న ముక్కోణపు వన్డే సిరీస్‌లో భారత్-ఏ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నాడు వైభవ్.
ఇవీ చదవండి:
బీసీసీఐ కీలక నిర్ణయం.. ఐపీఎల్ 2027 షెడ్యూల్‌లో మార్పు!
జులన్ గోస్వామి రికార్డును సమం చేసిన దీప్తి శర్మ