వైభవ్‌పై చర్యల ఊహాగానాలు.. బీసీసీఐ క్లారిటీ!
ABN , Publish Date - Jun 18 , 2026 | 03:59 PM
వైభవ్ సూర్యవంశీపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారన్న సోషల్ మీడియా ప్రచారానికి బీసీసీఐ చెక్ పెట్టింది. దంబుల్లా వేదికగా జరిగిన భారత్-ఏ, శ్రీలంక-ఏ మ్యాచ్ అనంతరం చోటుచేసుకున్న ఘర్షణలో యువ బ్యాటర్‌పై చర్యలు తీసుకునే ప్రసక్తే లేదని బీసీసీఐ స్పష్టం చేసింది.
ఇంటర్నెట్ డెస్క్: ముక్కోణపు వన్డే సిరీస్‌లో భాగంగా శ్రీలంక-ఏ, భారత్-ఏతో జరిగిన మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ ప్రవర్తించిన తీరు వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అయితే.. వైభవ్‌పై క్రమశిక్షణ చర్యలు తీసుకునే అవకాశముందందంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ఖండించింది. మ్యాచ్ సందర్భంగా మైదానంలో చోటుచేసుకున్న ఘటనపై తాము ఎలాంటి జోక్యం చేసుకోబోమని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా స్పష్టం చేశారు.
కాగా.. ఈ నెల 9న దంబుల్లా వేదికగా శ్రీలంక-ఏ జట్టుతో జరిగిన మ్యాచ్ అనంతరం ఇరు జట్ల ఆటగాళ్ల మధ్య ఘర్షణ చెలరేగింది. శ్రీలంక ఆటగాడు విషేన్ హలంబగే, భారత యువ బ్యాటర్ వైభవ్‌పై రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. హలంబగే దగ్గరకు రావడంతో వైభవ్ అతడిని తోసిన ఘటన చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో సూర్యవంశీపై బీసీసీఐ చర్యలకు ఉపక్రమిస్తుందంటూ వార్తలు రావడంపై సైకియా స్పందిస్తూ.. 'మ్యాచ్ రిఫరీ, అంపైర్ల పరిధిలోకి వచ్చే అంశాల్లో బీసీసీఐ జోక్యం చేసుకోదు. మైదానంలో ఏదైనా సంఘటన జరిగితే దానిపై తుది నిర్ణయాధికారం మ్యాచ్ రిఫరీ, అంపైర్లకే ఉంటుంది. ఆ వ్యవస్థ ఇప్పటికే ఉంది. అలాంటి విషయాల్లో బీసీసీఐ కలుగజేస్కోవాల్సిన అవసరం లేదు' అని అన్నారు.
ఇదిలా ఉండగా.. మ్యాచ్ సందర్భంగా జరిగిన వేర్వేరు ఘటనలకు సంబంధించి శ్రీలంక ఆటగాళ్లు హలంబగే, నీరోషన్ డిక్వెల్లాపై మ్యాచ్ రిఫరీ ప్రదీప్ జయప్రకాశ్ ఆంక్షలు విధించినట్లు సమాచారం. సూపర్ ఓవర్ విజయం అనంతరం భారత బ్యాటర్లను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేసినందుకు హలంబగేపై, అతిగా అప్పీల్ చేసినందుకు గానూ డిక్వెల్లాపై ఈ చర్యలు చేపట్టినట్టు తెలుస్తోంది. అయితే.. ఆ పనిష్మెంట్ ఏంటనే వివరాలు అధికారికంగా వెల్లడికాలేదు.
ఇవీ చదవండి:
బీసీసీఐ కీలక నిర్ణయం.. ఐపీఎల్ 2027 షెడ్యూల్‌లో మార్పు!
జులన్ గోస్వామి రికార్డును సమం చేసిన దీప్తి శర్మ