చెత్త రికార్డులో రోహిత్ సరసన చేరిన అభిషేక్ శర్మ..!
ABN , Publish Date - Apr 05 , 2026 | 08:45 PM
హైదరాబాద్‌లోని ఉప్పల్ వేదికగా ఇవాళ లఖ్‌నవూతో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ యువ సంచలనం అభిషేక్ శర్మ ఓ చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.
స్పోర్ట్స్ డెస్క్: హైదరాబాద్‌లోని ఉప్పల్ వేదికగా ఇవాళ(ఆదివారం) లఖ్‌నవూతో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ యువ సంచలనం అభిషేక్ శర్మ ఓ చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఒకే ఏడాదిలో అత్యధిక సార్లు సున్నా పరుగులకే వెనుదిరిగిన భారత ఆటగాళ్ల జాబితాలో రోహిత్ శర్మ , సంజు శాంసన్ సరసన అభిషేక్ నిలిచాడు. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే...
టాస్ గెలిచిన లఖ్‌నవూ కెప్టెన్ రిషబ్ పంత్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో తొలుత బ్యాటింగ్‌కు దిగిన సన్ రైజర్స్ ఇన్నింగ్స్ ఆరంభం నుంచే తడబడింది. ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మలపై భారీ అంచనాలు ఉన్నప్పటికీ, మహ్మద్ షమీ అదిరిపోయే వ్యూహంతో వారిని దెబ్బతీశాడు. ఇన్నింగ్స్ తొలి ఓవర్ చివరి బంతికే షమీ వేసిన 'స్లోయర్' డెలివరీని అర్థం చేసుకోవడంలో అభిషేక్ పూర్తిగా విఫలమయ్యాడు. బంతి బ్యాట్ అంచుకు తగిలి షార్ట్ థర్డ్ దిశగా వెళ్లగా, అక్కడ ఉన్న మనిమారన్ సిద్ధార్థ్ అద్భుతమైన డైవ్‌తో క్యాచ్ పట్టాడు. దీంతో అభిషేక్ ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరాడు.
ఈ డకౌట్‌తో అభిషేక్ శర్మ ఒకే సంవత్సరం(2026)లో ఆరోసారి సున్నాకే అవుట్ అయ్యాడు. గతంలో 2018లో టీమిండియా స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మ, 2024లో సంజు శాంసన్ కూడా ఒకే ఏడాదిలో ఆరు సార్లు డకౌట్ అయ్యారు. తాజాగా ఈ యువ ఓపెనర్ కూడా వారి సరసన చేరి అభిమానులను నిరాశపరిచాడు. సన్ రైజర్స్ తరఫున ఐపీఎల్‌లో అత్యధిక సార్లు డకౌట్ అయిన ఆటగాళ్ల జాబితాలో రషీద్ ఖాన్ (9), భువనేశ్వర్ కుమార్ (5) తొలి రెండు స్థానాల్లో నిలిచారు. 4 డకౌట్లతో అభిషేక్ శర్మ మూడో స్థానంలో ఉన్నాడు.
ఇవి కూడా చదవండి:
లఖ్‌నవూ బోణీ.. హైదరాబాద్‌పై ఘన విజయం
చరిత్ర సృష్టించిన రవి బిష్ణోయ్