ఢిల్లీకి తమిళనాడుకు మధ్య జరుగుతున్న ప్రజాస్వామ్య పోరు ఇది: స్టాలిన్
ABN , Publish Date - Apr 05 , 2026 | 07:47 PM
రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికలు ఢిల్లీకి తమిళనాడుకు మధ్య జరుగుతున్న ప్రజాస్వామ్య పోరాటమని రాష్ట్ర ముఖ్యమంత్రి, డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్ అన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో డీఎంకే ప్రకటించిన సంక్షేమ పథకాలతో సమాజంలోని అన్ని వర్గాలకు లబ్ధి చేకూరుతుందని చెప్పారు.
విరుధునగర్: రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికలు ఢిల్లీకి తమిళనాడుకు మధ్య జరుగుతున్న ప్రజాస్వామ్య పోరాటమని రాష్ట్ర ముఖ్యమంత్రి, డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్ (MK Stalin) అన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో డీఎంకే ప్రకటించిన సంక్షేమ పథకాలతో సమాజంలోని అన్ని వర్గాలకు లబ్ధి చేకూరుతుందని అన్నారు. తమిళనాడు పామ్ ఆయిల్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డులో నమోదు చేసుకున్న పామ్ ఆయిల్ వర్కర్లందరికీ బీమా సౌకర్యం కల్పిస్తామని, వారి కుటుంబాలకు విద్య, వైద్య అవసరాల కోసం ఆర్థిక సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. తమ మేనిఫెస్టోతో 6 నుంచి 60 ఏళ్ల వరకూ మహిళలు, పురుషులు, యువకులు, సీనియర్ సిటిజన్లు అందరికీ మేలు జరుగుతుందని చెప్పారు. హామీలు ఎవరైనా ఇవ్వవచ్చని, కానీ డీఎంకే ఇచ్చే హామీలనే ప్రజలు విశ్వసిస్తారని ధీమా వ్యక్తం చేశారు.
తమిళనాడు ప్రయోజనాలకు ఎన్డీయే విరోధి
తమిళనాడు ప్రయోజనాలకు ఎన్డీయే పూర్తి వ్యతిరేకి అని, తమిళ సంస్కృతిని ఎన్నికల ప్రచారంలో ఆ పార్టీ దుయ్యబడుతోందని స్టాలిన్ విమర్శించారు. కె.కామరాజ్, పెరియార్ ఈవీ రామస్వామి వంటి నేతలను కూడా విడిచిపెట్టడం లేదన్నారు. తమిళనాడు అబివృద్ధిని అడ్డుకునేందుకే బీజేపీతో ఎడప్పాడి కె.పళనిస్వామి పొత్తు పెట్టుకున్నారని విమర్శించారు. ఇది విస్తృత సైద్ధాంతిక పోరాటమని, డీఎంకే సారథ్యంలోని కూటమి కేవలం రాజకీయ విజయం కోసం కాకుండా తమిళనాడు భవిష్యత్తు కోసం పోరాడుతోందని అన్నారు. ఢిల్లీకి తమిళనాడుకు మధ్య జరుగుతున్న ఈ పోరాటంలో సెక్యులర్ ప్రొగ్రసివ్ అలెయెన్స్‌కు ప్రజలు మద్దతివ్వాలని కోరారు.
ద్రవిడియన్ మోడల్ 2.0 ప్రభుత్వం గతంలో సాధించిన సాధించిన విజయాలను అధిగమించి, తమిళనాడు సంక్షేమం, అభివృద్ధికి పాటుపడుతుందని స్టాలిన్ భరోసా ఇచ్చారు. కాగా, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఈనెల 23న ఒకే విడతలో జరుగనుండగా, మే 4న ఫలితాలు వెలువడతాయి.
ఇవి కూడా చదవండి..
అస్సాం, బెంగాల్‌లో బీజేపీదే గెలుపు.. గడ్కరి ధీమా
ఆయనను జైలుకు పంపుతాం: అసోం సీఎంపై రాహుల్ ధ్వజం