మమతా బెనర్జీకి కౌంట్‌డౌన్ మొదలైంది: మోదీ
ABN , Publish Date - Apr 05 , 2026 | 06:44 PM
రాష్ట్రంలో 'మహా ఆటవిక రాజ్యం' నడుస్తోందని, ఈ ఘటనలను టీఎంసీ బాధ్యత వహించాలని మోదీ అన్నారు. బెంగాల్‌లో మమతా బెనర్జీకి కౌంట్‌డౌన్ ప్రారంభమైందని పేర్కొన్నారు.
కూచ్‌బిహార్: పశ్చిమబెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం మరింత వెడెక్కింది. కూచ్‌బిహార్‌లో ఆదివారంనాడు జరిగిన మెగా ర్యాలీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) పాల్గొన్నారు. పశ్చిమబెంగాల్‌లోని మాల్దా, సందేశ్‌కాళి ఘటనలపై ప్రధాని విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో 'మహా ఆటవిక రాజ్యం' నడుస్తోందని, ఈ ఘటనలను టీఎంసీ బాధ్యత వహించాలని అన్నారు. బెంగాల్‌లో మమతా బెనర్జీకి కౌంట్‌డౌన్ ప్రారంభమైందని పేర్కొన్నారు.
మమత మూల్యం చెల్లించుకోవాలి
సుప్రీంకోర్టు జోక్యం చేసుకున్నప్పటికీ పశ్చిమబెంగాల్‌లో పరిస్థితి చాలా దారుణంగా తయారైందని ప్రధాని విమర్శించారు. బెంగాల్ ప్రజలను టీఎంసీ లూటీ చేసిందని, మే 4న ఫలితాలు వచ్చిన తర్వాత టీఎంసీ ఇందుకు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని అన్నారు.
చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్
కేంద్రలోని బీజేపీ ఇంతవరకూ 3 లక్షల మంది సోదరీమణులను కరోడ్‌పతి దీదీలను చేసిందని, దేశం కోసం తీసుకుంటున్న నిర్ణయాల్లో మహిళలకు ప్రాధాన్యం పెరగాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. ఇందుకోసం తమ ప్రభుత్వం మహిళలకు లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీలలో 33 శాతం రిజర్వేషన్ కల్పించే చట్టం తెచ్చిందని చెప్పారు. ఇందువల్ల 2020 లోక్‌సభ ఎన్నికల నుంచి పశ్చిమబెంగాల్‌తో సహా దేశవ్యాప్తంగా మహిళలకు లబ్ధి చేకూరుతుందని అన్నారు. ఏప్రిల్ 16,17,18 తేదీల్లో పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు జరుపుతున్నామని చెప్పారు. మన తల్లులు, సోదరీమణులకు 40 ఏళ్లుగా చట్టసభల్లో రిజర్వేషన్ హక్కు లేకుండా పోయిందని, ఇంకా జాప్యం జరగడం సరికాదని అన్నారు. జనాభా నియంత్రణను సమర్ధవంతంగా అమలు చేసిన రాష్ట్రాలకు ఇందువల్ల ఎలాంటి నష్టం జరగదని, అన్ని రాష్ట్రాలు, అందరి హక్కుల పరిరక్షణ జరుగుతుందని భరోసా ఇచ్చారు.
టీఎంసీ సిండికేట్‌కు భయపడొద్దు
పోలింగ్ రోజున టీఎంసీ గూండాలకు భయపడవద్దని, చట్టాన్ని నమ్మండని మోదీ కోరారు. మే 4న టీఎంసీ పాలన ముగియగానే ఆ పార్టీ గూండాలు, సిండికేట్లపై చట్టం తన పని తాను చేసుకుపోతుందని అన్నారు. చొరబాటుదారులను కాపాడేందుకే ఎస్ఐఆర్ ప్రక్రియను టీఎంసీ వ్యతిరేకిస్తోందని, రాబోయే ఎన్నికలు టీఎంసీ భవిష్యత్తును నిర్ణయించనున్నాయని, ప్రజలు బీజేపీకి ఓటు వేయాలని కోరారు. 2026 అసెంబ్లీ ఎన్నికలను ఎన్నికల కమిషన్ స్వేచ్ఛగా, సజావుగా నిర్వహిస్తుందనే నమ్మకం తనకు ఉందని అన్నారు. కాగా, పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఏప్రిల్ 23, 29 తేదీల్లో రెండు విడతలుగా జరుగనుండగా, మే 4న ఫలితాలు వెలువడతాయి.
ఇవి కూడా చదవండి..
అస్సాం, బెంగాల్‌లో బీజేపీదే గెలుపు.. గడ్కరి ధీమా
ఆయనను జైలుకు పంపుతాం: అసోం సీఎంపై రాహుల్ ధ్వజం