హస్తానికి కేరళం దక్కేనా?
ABN , Publish Date - Apr 05 , 2026 | 07:11 AM
వరుసగా పదేళ్లపాటు అధికారంలో ఉండడంతో ఎల్‌డీఎఫ్ సర్కారుపై ప్రజల్లో నెలకొన్న సహజ వ్యతిరేకత. దశాబ్దకాలం దూరమైన అధికారాన్ని తిరిగి దక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్న యూడీఎఫ్..
అధికారంపై యూడీఎఫ్ ఆశలు
4 నెలల క్రితం స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమిదే పైచేయి
న్యూఢిల్లీ, ఏప్రిల్ 4 (ఆంధ్రజ్యోతి): వరుసగా పదేళ్లపాటు అధికారంలో ఉండడంతో ఎల్‌డీఎఫ్ సర్కారుపై ప్రజల్లో నెలకొన్న సహజ వ్యతిరేకత. దశాబ్దకాలం దూరమైన అధికారాన్ని తిరిగి దక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్న యూడీఎఫ్.. దశాబ్దాలుగా ఈ రెండు కూటముల మధ్యే కేంద్రీకృతమైన ఆధిపత్యానికి గండికొట్టే ప్రయత్నాల్లో ఉన్న ఎన్డీయే.. వెరసి కేరళలో ఈసారి అసెంబ్లీ ఎన్నికలు రసవత్తరంగా సాగనున్నాయి. రాష్ట్రంలోని 140 స్థానాలకు ఏప్రిల్ 9న ఒకే విడతలో ఎన్నికలు జరగనుండగా.. ప్రస్తుతం కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎ్‌ఫది పైచేయిగా కనిపిస్తోంది. అయితే ఎన్నికలు సమీపిస్తున్నకొద్దీ వామపక్ష ఎల్‌డీఎఫ్ కూటమికి, యూడీఎ్‌ఫకు మధ్య ఓట్ల శాతం తగ్గిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలోని ఓటర్లలో 47 శాతానికి పైగా ముస్లింలు, క్రైస్తవులు ఉండడంతో రెండు కూటములు వారి ఓట్ల కోసమే గట్టి ప్రయత్నం చేస్తున్నాయి. మరోవైపు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ఈసారి సాధ్యమైనన్ని సీట్లు, ఓట్ల శాతాన్ని పొందాలని తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. 2021 ఎన్నికల్లో రాష్ట్రంలోని మొత్తం 140 సీట్లకుగాను ఎల్‌డీఎఫ్ 95 సీట్లు సాఽధించింది. అయితే ఈసారి ఎల్‌డీఎఫ్, యూడీఎఫ్ కూటములు రెండింటికీ కలిపి సంఖ్యాబలం 130 దాటకపోవచ్చునని, ఈ క్రమంలో ఒక్కో కూటమి 70-60 మధ్య సీట్లు సాధించే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. రెండు కూటములకూ దాదాపు 40ు ఓట్లు ఉన్నందు ప్రజాభిప్రాయం కొద్దిగా మారినా ఫలితాల్లో తేడా ఉంటుందని రాజకీయ వర్గాలు అంటున్నాయి. 2021 ఎన్నికల్లో ఒక్కచోట కూడా గెలవలేకపోయిన బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ.. ఈసారి మాత్రం 8 నుంచి 10 సీట్లు దక్కించుకునే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు. నీమామ్, పాలక్కాడ్, త్రిసూర్, మంజేశ్వరంతోపాటు 9 స్థానాల్లో ఎన్డీఏ బలంగా పోటీ ఇస్తుండడంతో ఆయా చోట్ల త్రిముఖ పోటీ జరగనుంది. ఈ తొమ్మిదింటిలో ఆరు సీట్లు ప్రస్తుతం ఎల్‌డీఎఫ్ సిటింగ్ స్థానాలు కావడం గమనార్హం. కాగా, గత ఎన్నికల్లో ఎన్డీఏ 12.41 శాతం సీట్లు సాధించింది. 2025లో జరిగిన స్థానిక ఎన్నికల్లో 1,919 వార్డులను గెలుచుకుంది.
సీఎం పదవికి గట్టిపోటీ..
కేరళంలో సీఎం పదవి కోసం కాంగ్రెస్‌లో రమేశ్ చెన్నితాల, వీడీ సతీశన్ మధ్య గట్టి పోటీ ఉన్నప్పటికీ.. ఎన్నికలయ్యాక కేసీ వేణుగోపాల్ కూడా రంగంలోకి దిగే అవకాశాలున్నాయని పార్టీ వర్గాలు అంటున్నాయి. పార్టీ సంస్థాగత వ్యవహారాల కార్యదర్శి అయిన వేణుగోపాల్.. రాహుల్‌గాంధీకి ఆంతరంగికుడు. కాగా, కాంగ్రె్‌సకు ప్రస్తుతం ఉన్న 22 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో 19 మందికి తిరిగి టికెట్లు ఇచ్చింది. ఈసారి క్రైస్తవ ఓట్లను అధికంగా నమ్ముకుని 22 మంది క్రిస్టియన్ అభ్యర్థులకు సీట్లు కేటాయించింది. ముస్లింలకు 12, నాయర్‌లకు 21 సీట్లు, ఎజవ అభ్యర్థులకు 20, బ్రాహ్మణులకు మూడు సీట్లు కేటాయించింది.
ప్రభుత్వ వ్యతిరేకత ఎవరికి లాభం?
రాష్ట్రంలో పదేళ్లుగా ఎల్‌డీఎఫ్ అధికారంలో ఉండడంతో ప్రభుత్వంపై సహజంగానే కొంత వ్యతిరేకత నెలకొందన్న అభిప్రాయాలున్నాయి. అయితే ప్రభుత్వ వ్యతిరేకతను ఉపయోగించుకోవడంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ ఎంతమేరకు సఫలమవుతుందన్న విషయంపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. పదేళ్ల తమ పాలనలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపైనే ఆ కూటమి ఆధారపడి ఉంది. అయితే శబరిమల బంగారం అపహరణ, భూఆక్రమణలు, రైతుల అసంతృప్తి వామపక్షాలకు వ్యతిరేకంగా మారే అవకాశాలున్నాయి. 2025 డిసెంబరులో జరిగిన స్థానిక ఎన్నికల్లో యూడీఎ్‌ఫకు 38.8 శాతం ఓట్లు రాగా, ఎల్‌డీఎ్‌ఫకు 33. 4 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. మెజారిటీ స్థానిక సంస్థలను కాంగ్రెస్ కూటమే గెలుచుకుంది. సీపీఐ(ఎం) ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు, ఆ పార్టీ నేతలు పలువురు కాంగ్రెస్, బీజేపీలో చేరడం కూడా యూడీఎ్‌ఫకు కలిసివచ్చే అంశాలుగా మారాయి. అయితే సీపీఐ(ఎం) నుంచి వచ్చిన కొందరు నేతలకు కాంగ్రెస్ ఇవ్వడంతో సొంత పార్టీ నేతల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. ఇది ఆ పార్టీకి నష్టం చేకూర్చవచ్చని అంటున్నారు. పైగా, మహిళలకు పెద్దగా ప్రాతినిధ్యం లేకపోవడం, కేసీ వేణుగోపాల్‌కు సన్నిహితులైన వారికే 60 శాతం పైగా టికెట్లు కేటాయించడంపైనా అసంతృప్తి వ్యక్తమవుతోంది. పలువురు తిరుగుబాటు అభ్యర్థులను వేణుగోపాల్ స్వయంగా కలిసి శాంతింపజేసే ప్రయత్నం చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
టిక్కెట్ ఇవ్వకపోవడం కాదు, నేనే పోటీ చేయనని చెప్పాను: అన్నామలై
ఐదేళ్లు ప్రశాంతంగా జీవించాలంటే బీజేపీని ఐక్యంగా అడ్డుకోండి.. మమత పిలుపు