Share News

ఐదేళ్లు ప్రశాంతంగా జీవించాలంటే బీజేపీని ఐక్యంగా అడ్డుకోండి.. మమత పిలుపు

ABN , Publish Date - Apr 04 , 2026 | 05:27 PM

పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ రాజకీయ ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ చీఫ్ మమతాబెనర్జీ బీజేపీపై మరోసారి నిప్పులు చెరిగారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీని కలిసికట్టుగా అడ్డుకోవాలని పిలుపునిచ్చారు.

ఐదేళ్లు ప్రశాంతంగా జీవించాలంటే బీజేపీని ఐక్యంగా అడ్డుకోండి.. మమత పిలుపు
Mamata Banerjee

కోల్‌కతా: పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ రాజకీయ ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ చీఫ్ మమతాబెనర్జీ బీజేపీపై మరోసారి నిప్పులు చెరిగారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీని కలిసికట్టుగా అడ్డుకోవాలని ఓటర్లకు పిలుపునిచ్చారు. బీజేపీకి మతాలంటే గౌరవం లేదని, అంశాంతిని సృష్టించడం, మాల్దాలో స్థానికులను టార్గెట్ చేయడం, రాజకీయ ప్రయోజనాల కోసం కేంద్రం ఏజెన్సీలను దుర్వినియోగపరచడం చేస్తోందని ఆరోపించారు. పశ్చిమబెంగాల్‌లోని మానిక్‌చక్‌లో శనివారంనాడు నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో మమతా బెనర్జీ మాట్లాడారు.


'రాబోయే ఐదేళ్లు మీరు ప్రశాంతంగా జీవించాలనుకుంటే బీజేపీని కలసికట్టుగా అడ్డుకోండి. దేశాన్ని బీజేపీ నాశనం చేసింది. వారికి ఏమతమన్నా గౌరవం లేదు. వాళ్లు చెప్పే మతాన్నే అందరిపై రుద్దుతారు. కాళీ మాతకు నైవేద్యంగా చేపలు, మాసం కూడా సమర్పిస్తుంటాం. మరి బీజేపీ ఏమతం గురించి బోధ చేయాలనుకుంటోంది. ముందు వాళ్లు బెంగాలీ సంస్కృతి గురించి అవగాహన చేసుకోవాలి' అని మమతాబెనర్జీ అన్నారు.


రెచ్చిపోవద్దు

బీజేపీ రెచ్చగొట్టే చర్యలకు పాల్పడినా రెచ్చిపోవద్దని మమత సూచించారు. 'వాళ్లు ఇబ్బందులు సృష్టించాలనుకుంటున్నారు. ప్రతి ఏరియా నుంచి 30 నుంచి 40 మందిని అరెస్టు చేస్తారు. మాల్దాలో ఇదే జరిగింది. అమాయక ప్రజలను అరెస్టు చేస్తున్నారు. మోటా భాయ్ చేతుల్లో ఎన్ఐఏ, సీబీఐ, ఈడీ, బీఎస్ఎఫ్, సీఐఎస్ఎఫ్ ఉన్నాయి. మోటా భాయ్ మనలను దొంగలని పిలుస్తుంటారు. సరిహద్దుల నుంచి వస్తున్న డబ్బు ఎక్కడికి పోతోంది? బెంగాలీ మాట్లాడే వారిని మీరు (బీజేపీ) చొరబాటుదారులను పిలుస్తున్నారు. నిజానికి మీరే పెద్ద చొరబాటుదారులు. ఎన్నికలప్పుడే ఇక్కడికి వచ్చి బలవంతంగా ఓట్లు రాబట్టుకునే చర్యలకు పాల్పడుతుంటారు' అని మమత విమర్శించారు.


బీజేపీ-కాంగ్రెస్ మధ్య రహస్య అవగాహన

ఏఐటీసీ మినహా ఏ ఒక్క పార్టీకి మద్దతు ఇవ్వవదని ప్రజలను మమతా బెనర్జీ కోరారు. రాష్ట్రంలో బీజేపీ-కాంగ్రెస్ మధ్య 'రహస్య అవగాహన' ఉందన్నారు. ఇది ఎన్ఆర్‌సీ అమలు, డిటెన్షన్ క్యాంపులకు దారితీస్తుందని హెచ్చరించారు. పౌరులను అలాంటి క్యాంపులకు పంపే ఎలాంటి చర్యలనైనా తమ ప్రభుత్వం అనుమతించేది లేదని స్పష్టం చేశారు. నిన్నకాక మొన్నే బెంగాల్‌కు చెందిన వలస కార్మికుడిని రాజస్థాన్‌లో దారణంగా చంపారని, వలస కార్మికులను వెనక్కి వచ్చి ఓటు వేయకుండా అడ్డుకుంటున్నారని, వారికి రైలు టిక్కెట్లు అమ్మడం లేదని, వారి బస్సులను యూపీలో ఆపేస్తున్నారని ఆరోపించారు. వలస కార్మికులంతా తిరిగి వచ్చి వారి హక్కులను ఎవరూ ఊడలాక్కోకుండా చూసుకోవాలని అన్నారు. 'టీఎంసీ అభ్యర్థులను ఈడీ పిలిపించి బీజేపీకి తగినంత సీట్లు రాకపోతే, గెలిచిన ఎమ్మెల్యేలు బీజేపీకి మద్దతివ్వాలని చెబుతోంది. అయితే ఈ పాచిక ఎప్పటికీ పారదు' అని మమత స్పష్టం చేశారు. పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ రెండు విడతల్లో ఏప్రిల్ 23, 29 తేదీల్లో జరుగనుండగా, మే 4న ఫలితాలు వెలువడతాయి.


ఇవి కూడా చదవండి..

ట్రంప్ నియంత్రణలో మోదీ, ఆయన నియంత్రణలో పినరయి... రాహుల్ విసుర్లు

పుదుచ్చేరి రాష్ట్ర హోదాకు టీవీకే కృషి: విజయ్

Updated Date - Apr 04 , 2026 | 05:29 PM